- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్‌ని శాసిస్తున్నది నాయకుడా.. అల్గారిథమా?
న్యూరోసైన్స్ కోణంలో డిజిటల్ యుగంలోని ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ఓటరు మనస్తత్వంపై సోషల్ మీడియా అల్గారిథమ్‌లు, ఎకో చాంబర్లు, కన్ఫర్మేషన్ బయాస్, మైక్రో-టార్గెటింగ్ వంటి అంశాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి?

ఒకప్పుడు ఎన్నికలు అంటే జనసముద్రాలు, హోరెత్తే మైకులు, వీధుల నిండా పోస్టర్లు, రచ్చబండ చర్చలు.. నాయకుడి వాగ్ధాటి, ప్రజల సమస్యలపై అతని అవగాహన, అతని వ్యక్తిత్వం మాత్రమే ఓటరు తీర్పును నిర్ణయించేవి. కానీ, ఇరవై ఒకటో శతాబ్దపు డిజిటల్ యుగంలో ప్రజాస్వామ్య క్షేత్రం పూర్తిగా మారిపోయింది.
నేడు ఓటరును చేరుకోవడానికి రాజకీయ నాయకుడు మీ ఇంటి గుమ్మానికి రానవసరం లేదు. ఎందుకంటే, అతడు ఇప్పటికే మీ చేతిలోని మొబైల్ స్క్రీన్ ద్వారా మీ ఆలోచనల గదిలోకి ప్రవేశించాడు.
నిశ్శబ్ద విప్లవం.. అల్గారిథమ్
ప్రజాస్వామ్యంలో ఒకప్పుడు రాజకీయ పార్టీలు 'ప్రజల మనసులను' గెలవడానికి ప్రయత్నించేవి. కానీ నేడు, 'ప్రజల దృష్టిని' గెలవడమే పరమావధిగా మారింది. అటెన్షన్ ఎకా నమీలో ఎవరి కంటెంట్ ఎక్కువ సమయం స్క్రీన్‌పై నిలిస్తే, వారిదే చర్చ, వారిదే అధికారం. అయితే ఇక్కడ కీలకమైన ప్రశ్న, ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ నాయకుడే ఓటును గెలుస్తున్నాడా? లేక తెర వెనుక ఉండే అల్గారిథమ్ మనల్ని రోబోల్లా మారుస్తూ మన నిర్ణయాలను నిశ్శబ్దంగా మలుస్తోందా? ఈ రహస్యాన్ని ఛేదించాలంటే, ముందుగా మనిషి మెదడు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందో న్యూరోసైన్స్ కోణంలో అర్థం చేసుకోవాలి.
మెదడుపై డిజిటల్ దాడి..
"నేను స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేశాను" అని ప్రతి ఓటరు అనుకుంటాడు. కానీ న్యూరోసైన్స్ ప్రకారం, మన నిర్ణయాలపై భావోద్వేగాలు, అలవాట్లు, సోషల్ మీడియా కూడా ప్రభావం చూపగలవు. మొదటిది అమిగ్డాలా - భయం, కోపం, ప్రమాదాన్ని వెంటనే గుర్తించే మెదడు భాగం. అందుకే ప్రశాంతంగా వాస్తవాలు చెప్పే పోస్టుల కంటే భయపెట్టే, కోపం తెప్పించే, ద్వేషాన్ని రెచ్చగొట్టే రాజకీయ పోస్టులు ఎక్కువగా మన దృష్టిని ఆకర్షిస్తాయి. రెండోవది డోపమైన్ - ప్రతి లైక్, షేర్, కామెంట్, నోటిఫికేషన్‌తో మెదడులో డోపమైన్ విడుదలై క్షణిక ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ ఫోన్ చూడాలనిపిస్తుంది. ఫలితంగా అల్గారి థమ్ చూపించే సమాచారంలోనే ఎక్కువసేపు గడుపుతాం. మూడోవది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ - తర్కం, విశ్లేషణ, సరైన నిర్ణయాలకు బాధ్యత వహించే మెదడు భాగం. కానీ వరుసగా రీల్స్, షార్ట్ వీడియోలు, రాజకీయ పోస్టులు చూస్తుంటే లోతుగా ఆలోచించే సమయం తగ్గుతుంది. ఫలితంగా వాస్తవాల కంటే భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది.
ఒకే అబద్ధం... వందసార్లు..
సోషల్ మీడియా అల్గారిథమ్‌కు రాజకీయ పార్టీ, సిద్ధాంతం, నైతిక విలువలు ఉండవు. దాని ప్రధాన లక్ష్యం ఒక్కటే. మీరు వీలైనంత ఎక్కువ సమయం ఆ యాప్‌లో ఉండేలా చేయడం. ఇందుకోసం అది ఎకో చాంబర్ అనే పరిస్థితిని సృష్టిస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక రాజకీయ పార్టీకి లేదా ఒక సిద్ధాంతానికి అనుకూలమైన వీడియోను చూస్తే, అల్గారిథమ్ దానిని మీ ఆసక్తిగా గుర్తిస్తుంది. వెంటనే అదే భావజాలానికి సంబంధించిన వీడియోలు, వార్తలు, ఇంటర్వ్యూలు, పోస్టులు, విశ్లేషణలనే వరుసగా చూపిస్తుంది. దీనివల్ల భిన్నమైన అభిప్రాయాలు, ప్రత్యామ్నాయ వాస్తవాలు లేదా వ్యతిరేక ఆధారాలు మీకు చాలా తక్కువగా కనిపిస్తాయి. న్యూరోసైన్స్, సైకాలజీ ప్రకారం, ఒకే సమాచారాన్ని పదే పదే చూడటం వల్ల అది నిజమే అనే భావన మెదడులో బలపడుతుంది. దీనిని "ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్ " అంటారు. ఫలితంగా, అబద్ధం అయినా పదేపదే కనిపిస్తే నిజమని నమ్మే ప్రమాదం పెరుగుతుంది. ఇలా ఓటరు పూర్తి సమాచారంతో కాకుండా, అల్గారిథమ్ ఎంచుకున్న సమాచారంతోనే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
కన్ఫర్మేషన్ బయాస్ & మైక్రో - టార్గెట్టింగ్..
కన్ఫర్మేషన్ బయాస్ అంటే, మనిషి తాను ఇప్పటికే నమ్మిన అభిప్రాయాలకు అనుకూలమైన సమాచారాన్నే నిజమని స్వీకరించి, వ్యతిరేక ఆధారాలను నిర్లక్ష్యం చేయడం. సోషల్ మీడియా అల్గారిథమ్‌లు అదే తరహా పోస్టులు, వీడియోలు, వార్తలను పదే పదే చూపించడం వల్ల ఈ ధోరణి మరింత బలపడుతుంది. ఫలితంగా, అసత్య సమాచారం కూడా నిజమనే నమ్మకం ఏర్పడే ప్రమాదం ఉంది. మైక్రో-టార్గెటింగ్ అనేది డేటా ఆధారంగా ప్రతి ఓటరికి వ్యక్తిగతంగా రాజకీయ సందేశాలను చేరవేసే ఆధునిక సాంకేతిక విధానం. గతంలో ఎన్నికల మేనిఫెస్టో అందరికీ ఒకేలా ఉండేది. ఇప్పుడు మాత్రం గూగుల్ సెర్చ్‌లు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, సోషల్ మీడియాలో మీ ఆసక్తులు, స్పందనలు వంటి డేటాను విశ్లేషించి మీ వ్యక్తిత్వ ప్రొఫైల్ రూపొందిస్తారు. ఆ తర్వాత ప్రతి వర్గానికి వారి ఆసక్తులకు అనుగుణంగా కంటెంట్ చూపిస్తారు. దీని ఫలితంగా ప్రజలందరూ ఒకే సామాజిక వాస్తవాన్ని చూడడం లేదు. ప్రతి ఓటరు తనకోసం ప్రత్యేకంగా రూపొందించిన "సృష్టించబడిన వాస్తవం" ఆధారంగా అభిప్రాయాలు ఏర్పరచుకొని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈవీఎంల ముందు ఓటర్..
నిశ్చయంగా, నాయకుడి ఆకర్షణ , క్షేత్రస్థాయి పరిస్థితులు ఇప్పటికీ ముఖ్యమే. కానీ, ఆ నాయకుడిని ప్రజల ముందుకు ఎలా తీసుకెళ్లాలి, ఏ రూపంలో తీసుకెళ్లాలి, అతని శత్రువును ఏ విధంగా చిత్రించాలి అనే విషయాలను మాత్రం అల్గారిథమే శాసిస్తోంది. ఎన్నికల యుద్ధం ఇప్పుడు వీధుల్లో కాదు, మన జేబుల్లోని ఐదు అంగుళాల మొబైల్ స్క్రీన్‌లపై, సెర్చ్ ఇంజన్ల రిజల్ట్స్‌లో, నోటిఫికేషన్ల వెనుక జరుగుతోంది. రేపు బ్యాలెట్ బాక్స్ ముందో, ఈవీఎం మిషన్ ముందో నిలబడేది మనిషే కావచ్చు. కానీ, ఆ చివరి క్షణంలో అతని వేలు ఏ బటన్‌పై పడాలనే ఆలోచనను డిజిటల్ ల్యాబ్‌లలోని అల్గారిథమ్‌లు ప్రోగ్రామ్ చేస్తున్నాయనే నిష్టూర సత్యాన్ని ప్రజాస్వామ్య పౌరుడిగా మనం గుర్తించకపోతే.. మన స్వేచ్ఛా ఓటు కేవలం ఒక 'డిజిటల్ ఇల్యూజన్' (భ్రమ) మాత్రమే అవుతుంది.
-డా.బి.కేశవులు ఎండీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659






