ఆసరా పెన్షన్ కంటే దారుణంగా ఉద్యోగి పెన్షన్ ఉందా?

by Disha edit |
ఆసరా పెన్షన్ కంటే దారుణంగా ఉద్యోగి పెన్షన్ ఉందా?
X

పీఎఫ్‌ఆర్‌డీఏని రద్దు చేస్తే ఉద్యోగులందరికి పాత పెన్షన్ సౌకర్యం వర్తిస్తుంది. ఎన్‌పీ‌ఎస్ నుంచి బయటకు రాలేమనుకుంటే ఉద్యోగి తరపున ఎన్‌పీ‌ఎస్ ఖాతాకు ప్రభుతం ఇచ్చిన డబ్బును లోన్‌లా భావించి నెలనెలా రికవరీ చేసుకోవచ్చు. ఉద్యోగి నుంచి జీపీఎఫ్‌కు కూడా డబ్బులు తీసుకోవచ్చు. లేదా సీపీఎస్ రద్దుకు ఉత్తర్వులు ఇచ్చి పీఎఫ్‌ఆర్‌డీఏ వద్ద ఉన్న డబ్బులను రిటైర్మెంట్ తర్వాత అదే నిష్పత్తిలో పంచుకోవచ్చు. చనిపోయిన, రిటైరైన వారి నుంచి కూడా పెన్షన్ సెటిల్ చేసినప్పుడు రికవరీ చేసుకునే అవకాశం వుంది. సీపీఎస్ రద్దుతో ఒకే దఫా సుమారు ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమవుతాయి. అందులో 5,600 కోట్లను ప్రభుత్వానికి, మిగతా 2400 కోట్లను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు బదిలీ చేయవచ్చు. ప్రభుత్వం నెలనెలా జమ చేస్తున్న 80 కోట్లు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

న్నో సంవత్సరాలు కష్టపడి, తమ మేధో సంపత్తిని పెట్టుబడిగా పెట్టి, గౌరవప్రద ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు 30-35 సంవత్సరాలు సమాజానికి, తద్వారా దేశానికి సేవ చేసి ఉద్యోగ విరమణ చేస్తారు. అనంతరం ప్రతి నెలా వచ్చే పెన్షన్‌తో ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తారు. 1991లో వచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా పెన్షన్‌లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. సంస్కరణల పేరుతో అప్పుడప్పుడే ఉద్యోగాలు సంపాదించిన బడుగు బలహీనవర్గాల, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శ్రమను కార్పొరేట్ శక్తులకు షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి, వారికి కాసులు కురిపించేందుకు వీలుగా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.

పెన్షన్‌లో మార్పులు చేయడానికి ఎన్‌డీ‌ఏ ప్రభుత్వం 2001-02లో బీకే భట్టాచార్య నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రతిపాదనలను 23 ఆగస్టు 2003న ఆమోదించి 01 సెప్టెంబర్ 2004 నుంచి అమలులోకి తెచ్చింది. కమిటీ రెండు రకాల ప్రతిపాదనలు చేసింది. ఒకటి-నూతన పెన్షన్ విధానం, రెండవది- ఉద్యోగులు కోరుకుంటే పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించడం.

అభిప్రాయం తీసుకోకుండానే

ప్రభుత్వం మాత్రం ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకోకుండానే పార్లమెంట్‌లో బిల్లు పెట్టకుండానే, దాని మీద చర్చ లేకుండానే ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీవితాలను నూతన పెన్షన్ విధానం ద్వారా షేర్ మార్కెట్‌లో తాకట్టు పెట్టింది. ఉద్యోగుల జీతంలో పది శాతం కోత విధించి. ప్రభుత్వం కూడా అంతే మొత్తం కలుపుతూ ఉద్యోగికి కొత్త ఖాతా తెరచి, అందులో జమ చేసే ఏర్పాటు చేసింది. ఈ నిధిని 'జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) ట్రస్ట్' నుంచి 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీ‌ఎల్) ట్రస్ట్' ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టాలని నిర్ణయించింది.

ఉద్యోగ విరమణ తరువాత ఉద్యోగి, ప్రభుత్వ వాటాల మొత్తంలో 40 శాతం యాన్యుటీ ప్లాన్‌లలో పెట్టీ నెలవారీ పెన్షన్ చెల్లిస్తారు. మిగతా 60 శాతం ఉద్యోగులకు చెల్లిస్తారు. దీని కోసం 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ)-2013 చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినది. నూతన పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇష్టమైతే ఒప్పందం చేసుకోవచ్చని తెలిపారు. దీనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ పేరుతో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలులోకి తెచ్చారు. ఫైల్ తయారైంది నారా చంద్రబాబు నాయుడు హయాంలో. తెలంగాణ వచ్చాక 'మీరు సీపీ‌ఎస్‌ను కొనసాగిస్తారా? పాత పెన్షన్ వాధానాన్ని పునరుద్ధరిస్తారా' అని పీఎఫ్‌ఆర్‌డీఏ అడిగితే, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించకుండానే సీపీఎస్ కొనసాగిస్తామని ఉత్తర్వులు ఇచ్చేశారు.

ఆశలు, భ్రమలు

కొత్త విధానం ద్వారా ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం కొన్ని కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం చేశారు. ఈ మధ్యనే ఉద్యోగ చేసినవారి పెన్షన్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ మేలనిపిస్తోంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు దైవాధీనం దాదాపు పది సంవత్సరాలు ఆర్మీలో ఉద్యోగం చేసి వచ్చారు. 2003 డీఎస్‌సీ ద్వారా 2005లో ఉపాధ్యాయుడిగా చేరి పది సంవత్సరాల మూడు నెలల అనంతరం స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగ విరమణ చేశారు.

ఆర్మీ కాలానికి రూ.16 వేల పెన్షన్ వస్తుండగా, ఉపాధ్యాయుడిగా అతనికి వస్తున్న పెన్షన్ రూ.1,200 మాత్రమే. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన భాగ్యలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు 2003 డీఎస్‌సీ ద్వారా 2005 నవంబర్‌లో ఎస్‌జీటీగా చేరి పది సంవత్సరాల మూడు నెలల అనంతరం ఉద్యోగ విరమణ చేశారు. ఆమెకి వస్తున్న పెన్షన్ రూ.850. సీపీఎస్ రద్దుకు ఉద్యమం చేసి ఈ మధ్యనే చనిపోయిన మిత్రుడు శ్రీనివాస్ కుటుంబానికి రాబోయే పెన్షన్ ఆసరా పెన్షన్ కన్నా తక్కువే. పెన్షన్ ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదని, మానవహక్కని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

పోరాట ఫలితం ఫ్యామిలీ పెన్షన్

సీపీఎస్‌కు వ్యతిరేకంగా సంఘాలు చేసిన పోరాటాల కారణంగా ఫ్యామిలీ పెన్షన్ సాధించగలిగాయి. 01. సెప్టెంబర్ 2004 తర్వాత నియమితులై, సర్వీస్‌లో ఉండి చనిపోయిన, ఆరోగ్య అశక్తత పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తుంది. ఏడు సంవత్సరాల లోపు సర్వీస్ ఉంటే బేసిక్ మీద 30 శాతం, ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే ఏడు సంవత్సరాల వరకు 50 శాతం, తర్వాత 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రద్దు చేయవచ్చు. పీఎఫ్‌ఆర్‌డీఏని రద్దు చేస్తే ఉద్యోగులందరికి పాత పెన్షన్ సౌకర్యం వర్తిస్తుంది. ఎన్‌పీ‌ఎస్ నుంచి బయటకు రాలేమనుకుంటే ఉద్యోగి తరపున ఎన్‌పీ‌ఎస్ ఖాతాకు ప్రభుతం ఇచ్చిన డబ్బును లోన్‌లా భావించి నెలనెలా రికవరీ చేసుకోవచ్చు.

ఉద్యోగి నుంచి జీపీఎఫ్‌కు కూడా డబ్బులు తీసుకోవచ్చు. లేదా సీపీఎస్ రద్దుకు ఉత్తర్వులు ఇచ్చి పీఎఫ్‌ఆర్‌డీఏ వద్ద ఉన్న డబ్బులను రిటైర్మెంట్ తర్వాత అదే నిష్పత్తిలో పంచుకోవచ్చు. చనిపోయిన, రిటైరైన వారి నుంచి కూడా పెన్షన్ సెటిల్ చేసినప్పుడు రికవరీ చేసుకునే అవకాశం వుంది. సీపీఎస్ రద్దుతో ఒకే దఫా సుమారు ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వ ఖాతాలో జమవుతాయి. అందులో 5,600 కోట్లను ప్రభుత్వానికి, మిగతా 2400 కోట్లను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు బదిలీ చేయవచ్చు. ప్రభుత్వం నెలనెలా జమ చేస్తున్న 80 కోట్లు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. నెలనెలా రికవరీ ద్వారా 120 కోట్లు సమకూరే అవకాశం ఉంది. మొత్తంగా 200 కోట్లు పైచిలుకు మిగులుతాయి.

జుర్రు నారాయణ యాదవ్

టీటీయూ, జిల్లా అధ్యక్షుడు

మహబూబ్‌నగర్

94940 19270

Next Story

Most Viewed