వరల్డ్ వాక్ :రక్షణ రంగంలో భారత్ ముందడుగు

by Ravi |
వరల్డ్ వాక్ :రక్షణ రంగంలో భారత్ ముందడుగు
X

భారత ప్రభుత్వం రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం సాధించలేకపోయింది. ఇందుకోసం ఆటోమేటిక్ రూట్ పరిమితిని 26 శాతం నుంచి క్రమంగా 100 శాతం పెంచినప్పటికీ పెద్దగా ప్రయోజనం చూపించలేదు. 2014-15 లో 0.08 మిలియన్, 2015-16 లో 0.10 మిలియన్ 2017-18 లో 0.01 మిలియన్ 2018-19 లో 2.18 మిలియన్ అమెరికా డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే మన దేశంలోకి వచ్చాయి. ఇవి పెంచాలనే లక్ష్యంతో పీఎం మోడీ విదేశీ పెట్టుబడుల కోసం దేశంలో అనువైన వాతావరణం కల్పించామని చెప్పారు. దేశ ఎగుమతుల విలువ 2025 సంవత్సరానికి 5 బిలియన్ అమెరికా డాలర్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నామంటూ పరిశ్రమలకు ఆహ్వానం పలికారు.

దేశ ఆర్థిక ప్రగతి అయినా ఆ దేశ ఉత్పాదక రంగం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి దేశం తమ దేశంలో లభ్యమయ్యే సహజ వనరులను తమ అవసరాలకు వాడుకుంటునే ఎగుమతులపై దృష్టి సారిస్తోంది. దాంతో పాటు దేశీయంగా దొరకని ఖనిజాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సర్వసాధారణం. మన దేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం కావడంతో స్థూల జాతీయోత్పత్తిలో 16 శాతం దానిదే. అయితే, దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే శత్రుదేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొవడానికి అన్ని దేశాలు తమ వార్షిక బడ్జెట్ నుంచి భారీగా రక్షణ రంగానికి కేటాయిస్తుంటాయి.

అయితే భారత రక్షణ ఎగుమతులు 2016-17 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరానికి 700 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. రక్షణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థ, ది స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) భారత్‌లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)ను ప్రపంచలోనే రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసే 100 ప్రఖ్యాత కంపెనీల జాబితాలో చేర్చడం భారతీయులుగా మనం గర్వించదగిన విషయం. ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5,25,166 కోట్ల మొత్తాన్ని రక్షణ రంగానికి కేటాయించింది.

మేకిన్ ఇండియా లక్ష్యంగా

ఇంతకు ముందు భారత్ ఎక్కువగా రక్షణ ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు 140 కోట్ల జనాభాతో ఉన్న మన దేశం ఇక్కడి మానవ వనరులను ఉపయోగించి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాక, దిగుమతులను గణనీయంగా తగ్గించి ఎగుమతిదారుగా ఎదగాలనే సంకల్పంతో ఉంది. ఇది ఆచరణలో పెట్టడానికి రక్షణ పరికరాల సేకరణ కోసం 2022-23 సంవత్సరానికి వెచ్చించే మూలధన పెట్టుబడులలో 68 శాతం దేశీయ పరిశ్రమకు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. 'మేకిన్ ఇండియా' లక్ష్య సాధన దిశగా ఇది స్వాగతించదగిన పరిణామం. ఇంత పెద్ద యెత్తున కేటాయింపులు జరపడం వలన దేశీయ పరిశ్రమలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, విశ్వవిద్యాలయాలకు ఈ రంగంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడమే కాక దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించే వెసులుబాటు కలిగింది.

దీంతో పాటు దేశీయ ప్రభుత్వ రక్షణ సంస్థలతో సంయుక్తంగా రక్షణ రంగ ఉత్పత్తుల పరిశోధన, అభివృద్ధికి కృషి చేసే సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న రక్షణ ఉత్పదులలో 70 శాతం యుద్ధ విమానాలు, ఓడలు, జలాంతర్గాములు వీటిని దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది భారత ప్రభుత్వం. ఈ నిర్ణయం కారణంగా రష్యా రక్షణ ఉత్పత్తుల ఎగుమతి భారీగా క్షీణించడంతో పాటు అమెరికా రక్షణ ఉత్పత్తుల ఎగుమతి కూడా 46 శాతం క్షీణించిందని 'ది స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్' (SIPRI) పేర్కొంది.

ఎగుమతులపై దృష్టి

ఇటీవల కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ మాట్లాడుతూ 'గత ఏడు సంవత్సరాలలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా రక్షణ పరికరాల ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించించడమే కాక 72 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని, అంతేకాక దిగుమతి చేసుకుంటున్న 209 రక్షణ పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి చర్యలు చేపట్టామని' అన్నారు. రక్షణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాత పరిశోధన సంస్థ 'SIPRI' భారత్‌ను ప్రపంచంలోనే రక్షణ పరికరాలను ఎగుమతి చేసే 25 దేశాలలో ఒకటిగా గుర్తించిందని కూడా అన్నారు. డీఆర్‌డీఓ చేపడుతున్న నిరంతర పరిశోధనలు దేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు.

రక్షణ ఎగుమతులను మన దేశం నుండి సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, చైనా అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్నాయని 2021 లో ప్రకటించిన తన నివేదికలో SIPRI పేర్కొంది. అయినప్పటికీ దేశీయంగా తయారైన రక్షణ ఉత్పత్తులను అమెరికా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా, స్వీడన్, అజర్బైజాన్, సీషెల్స్, ఎస్టోనియా, ఇండోనేషియా, గినియా, ఫిలిప్పీన్స్, లాంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయని తెలిపారు. ఎగుమతి చేసే దేశాల విలువ ఆధారంగా భారత్ 24 వ స్థానంలో నిలిచిందని SIPRI పేర్కొంది. ఇది 2011-15 తో పోలిస్తే 228 శాతం అధికం.దీనికి కారణం 'ఆత్మ నిర్భర్ భారత్' పేర భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అని సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ డైరెక్టర్ జనరల్ విశ్రాంత ఎయిర్ మార్షల్ చోప్రా అభిప్రాయం.

ఉత్పాదక లక్షాన్ని పెంచడం కోసం

భారత ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్, ఆర్టిలరీ గన్స్, యుద్ధ ట్యాంకులు, క్షిపణులు, క్షిపణి విధ్వంసక మందుపాతర, పేలుడు పదార్థాలు సహా 156 రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఇటీవల ఆమోదం తెలిపింది. ఇప్పటికే డీఆర్‌డీ‌ఓ విడుదల చేసిన వివరాల ప్రకారం వీటిలో 19 విమానయాన వ్యవస్థ, 41 ఆయుధ, పోరాట వ్యవస్థ, 4 మిస్సైల్ సిస్టమ్స్, 27 ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థ,28 నావికాదళ వ్యవస్థ (నేవల్ సిస్టమ్స్), 16 న్యూక్లియర్ బయోలాజికల్ రక్షణ వ్యవస్థ,10 లైఫ్ ప్రొటెక్షన్ ఐటమ్స్,4 మైక్రో-ఎలక్ట్రానిక్ ఉపకరణాలు,మిగతా 7 వంటివి ఉన్నాయి. గతంలో ఆకాష్ క్షిపణుల ఎగుమతికి మాత్రమే అనుమతి ఉంది.

ఇప్పుడు మిగతా క్షిపణుల ఎగుమతికి కూడా ఆమోదం తెలిపింది భారత ప్రభుత్వం. ఇవే కాకుండా గాలిలోని లక్ష్యాన్ని ఛేదించే 'అస్త్ర' క్షిపణి, ట్యాంకు విధ్వంసక క్షిపణులు 'నాగ్' 'బ్రహ్మోస్' కూడా ఎగుమతులకు సిద్ధంగా ఉన్నట్లు డీఆర్‌డీఓ పేర్కొంది. భారత్ 2025 సంవత్సరానికి 5 బిలియన్ అమెరికా డాలర్ల విలువ గల రక్షణ ఉత్పత్తులను మిత్ర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆయా దేశాలతో మైత్రీ బంధాన్ని మరింత దృఢపర్చుకోవాలన్న సంకల్పంతో ఉంది. డిఫెన్స్ ప్రొడక్షన్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ పాలసీ ప్రకారం 2025 సంవత్సరానికి రూ.35,000 కోట్ల రక్షణ ఉత్పత్తుల ఎగుమతి లక్ష్యాన్ని మన ప్రభుత్వం నిర్దేశించుకుంది.రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలందిస్తూ రూ.1,75,000 కోట్లు లేదా 25 బిలియన్ అమెరికా డాలర్ల ఉత్పాదక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక పక్క కృషి కొనసాగిస్తూనే దేశీయ రక్షణ ఉత్పత్తుల సేకరణను 2025 నాటికి రూ.70,000 కోట్ల నుండి 1,40,000 కోట్లకు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

వారి పెట్టుబడులు ముఖ్యం

భారత ప్రభుత్వం రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం తీవ్రంగా కృషి చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం సాధించలేకపోయింది. ఇందుకోసం ఆటోమేటిక్ రూట్ పరిమితిని 26 శాతం నుంచి క్రమంగా 100 శాతం పెంచినప్పటికీ పెద్దగా ప్రయోజనం చూపించలేదు. 2014-15 లో 0.08 మిలియన్, 2015-16 లో 0.10 మిలియన్ 2017-18 లో 0.01 మిలియన్ 2018-19 లో 2.18 మిలియన్ అమెరికా డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే మన దేశంలోకి వచ్చాయి. ఇవి పెంచాలనే లక్ష్యంతో పీఎం మోడీ విదేశీ పెట్టుబడుల కోసం దేశంలో అనువైన వాతావరణం కల్పించామని చెప్పారు.

దేశ ఎగుమతుల విలువ 2025 సంవత్సరానికి 5 బిలియన్ అమెరికా డాలర్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నామంటూ పరిశ్రమలకు ఆహ్వానం పలికారు. ఈ లక్ష్య సాధనలో ఫిలిప్పీన్స్ తో 375 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువ గల బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి ఒప్పందం కుదరడం శుభ పరిణామం. అయితే 5 బిలియన్ అమెరికా డాలర్ల ఎగుమతి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించడానికి మరిన్ని భారీ ఆర్డర్లు ఎంతో అవసరం. భారత ప్రభుత్వం ఈ విషయంలో మరింత ప్రణాళికాబద్ధంగా కొనసాగి సకాలంలో సముచిత చర్యలు తీసుకుంటుందని దేశాభివృద్ధి కాంక్షించే పౌరులుగా ఆశిద్దాం.

యేచన్ చంద్ర శేఖర్

హైదరాబాద్

88850 50822



Next Story