పాఠశాల విద్యలో.. ఎన్నాళ్ళీ దురవస్థ?

by Disha edit |
పాఠశాల విద్యలో.. ఎన్నాళ్ళీ దురవస్థ?
X

విద్యార్థి వికాసానికి పాఠశాల విద్య పునాది వంటిది. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు, నిరంతర పర్యవేక్షణ, మంచి వాతావరణం నెలకొంటేనే విద్యా కుసుమాలు వికసిస్తాయి. మనదేశ పాఠశాల విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. సుమారు 15 లక్షల పాఠశాలల్లో 25 కోట్ల పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే నిధుల లేమి, ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేక నాణ్యమైన విద్య దేశంలో అందని ద్రాక్షగా మారింది. పాఠశాల విద్యపై పట్టింపు లేనితనంతో రాను రాను విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఇటీవల కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన పనితీరు గ్రేడింగ్ సూచికల నివేదిక తేటతెల్లం చేస్తున్నది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు క్షీణించాయని తెలిపింది. విద్యార్థుల నమోదు అంతకంతకు తగ్గుతున్నది. మౌలిక వసతుల లేమితో విద్యా వ్యవస్థ కుంటుపడుతున్నది. నాణ్యమైన విద్య అందరికీ అందినప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి తద్వారా దేశ ప్రగతికి బాటలు పడతాయి. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై అధికంగా నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకం పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తే పనితీరు మెరుగుపడి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి.

తెలుగు రాష్ట్రాలు స్థానమెక్కడ?

కేంద్ర విద్యాశాఖ ప్రతి ఏటా 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో పాఠశాల విద్య స్థితిగతులపై పనితీరు గ్రేడింగ్ సూచికల నివేదిక విడుదల చేస్తుంది. ఈ నివేదిక అభ్యసన ఫలితాల నాణ్యత, విద్యార్థులు, మౌలిక వసతులు, సమానత్వం, పరిపాలన విధానం అనే ఆరు అంశాల ఆధారంగా పది దశలలో 73 సూచికల్లో 1000 పాయింట్ల ఆధారంగా దేశంలోని అన్ని ప్రాంతాల పాఠశాల విద్య స్థితిగతులను విడుదల చేస్తుంది. అయితే, ఇటీవల విడుదల చేసిన 2021-22 పనితీరు గ్రేడింగ్ నివేదికలో తెలుగు రాష్ట్రాలు అట్టడుగు స్థానాన్ని పొందాయి. పీజీఐ మొదటి దశ నుండి ఐదో దశ వరకు ( 51-100 శాతం వరకు) ఏ ఒక్క రాష్ట్రం కూడా స్థానాన్ని పొందలేకపోయింది. పనితీరు గ్రేడింగ్ 6వ దశలో (641-700 పాయింట్లు) చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాలు స్థానాన్ని సంపాదించాయి. ఏడవ దశలో (581-640) గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పాండిచ్చేరి, తమిళనాడు మొదలైన రాష్ట్రాలు స్థానాన్ని పొందాయి. ఎనిమిదో దశ అయిన ఆకాంక్ష-1లో ఆంధ్రప్రదేశ్ స్థానం పొందగా, తొమ్మిదో దశ అయిన ఆకాంక్ష-2లో తెలంగాణ రాష్ట్రం స్థానం పొందింది. జిల్లాల పరంగా ఫలితాలు విశ్లేషిస్తే తెలంగాణలో మేడ్చల్ హనుమకొండ జిల్లాలో పనితీరు గ్రేడింగ్ సూచికలో మంచి మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలువగా పెద్దపల్లి, అదిలాబాద్ అధ్వాన ఫలితాలతో అట్టడుగు స్థానంలో నిలిచాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణ, గుంటూరు జిల్లాలు ప్రథమ స్థానంలో నిలువగా, పశ్చిమగోదావరి కర్నూలు జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయి.

ఎన్నో కార్యక్రమాలు చేసినా..

14 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత విద్య, పౌష్టికాహారం, ఉచిత దుస్తులు, పుస్తకాలు అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలను కాదని ఏం సదుపాయాలు లేని అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రవేశాలు పెరగడానికి గల కారణాలు ఏమిటి? అన్న విషయమై అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇటీవల విడుదల చేసిన జాతీయ సాధన సర్వే ఫలితాలు సైతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కనీస అభ్యసన సామర్ధ్యాలు సాధించడం లేదని తేల్చినది. 3,5,8,10వ తరగతి వారి అభ్యసన ఫలితాలు విశ్లేషిస్తే అధ:పాతాళంలో ఉన్నామని తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ రేటు తగ్గిపోతోంది. బడికి దూరమైన పిల్లల కోసం ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆశించిన రీతిలో సత్ఫలితాలు ఇవ్వడం లేదు. మరుగుదొడ్లు మూత్రశాలలు, ప్రహరీ గోడలు, క్రీడ మైదానాలు, ప్రయోగశాల, గ్రంథాలయం, త్రాగునీటి సరఫరా మెజార్టీ పాఠశాలల్లో లేవు. సమయానికి ఉచిత పాఠ్య పుస్తకాలు అందడం లేదు. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు తగిన పౌష్టికాహారం అందడం లేదు. మన ఊరు మన బడి పథకం కింద మూడు దశలలో రు. 7,290 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరచాలని లక్ష్యంలో నిర్దేశించుకున్నా.. ఇప్పటికీ మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇంకా చాలా చోట్ల నిధుల ఖర్చు జరగడం లేదు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అంతే మొత్తంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థలో సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. మెజార్టీ మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులుగా ఇన్చార్జీలు కొనసాగుతున్నారు. పాఠశాల అభివృద్ధి, నిర్వహణ కోసం ఇస్తున్న నిధులు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవడం లేదు.

మౌలిక సదుపాయాలు పెంచాలి..

అనేక రంగాల అభివృద్ధి విద్యతోనే ముడిపడి ఉంది. పరిశ్రమలు, ఆర్థికం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయం వంటివి ప్రత్యక్షంగా పరోక్షంగా విద్యతో అనుసంధానమై ఉన్నాయి. కావున పాఠశాల దశ నుంచి సరైన ప్రణాళిక ఉండాలి. సమర్థ కార్యాచరణ కావాలి. ఉపాధ్యాయులు ఏకోన్ముఖ లక్ష్యంతో పని చేస్తే ప్రాథమిక విద్య మెరుగుపడుతుంది. వారిని ప్రభుత్వాలు పలు సదుపాయాలతో ప్రోత్సహించాలి. బోధనలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా తగిన వృత్యంతర శిక్షణ ఇవ్వాలి. ఆ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేయాలి. ప్రాథమిక తరగతులకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి. ఉన్నత తరగతులకు సబ్జెక్టుకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయుల నియమిస్తే విద్యా ప్రమాణాలు వికసిస్తాయి. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయిస్తూ మౌలిక వసుతుల కల్పన చేయాలి. నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ కోసం శాశ్వత మండల విద్యాశాఖ అధికారుల నియామకం జరగాలి. దేశ భవిష్యత్తు నిర్దేశించే పాఠశాల విద్యా వ్యవస్థలో ఎటువంటి లోపాలున్న వాటి ఫలితాలు సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయి. కనుక ప్రాథమిక స్థాయి నుంచి విద్యకు తగిన చికిత్స అందిస్తే భారతదేశ భవిష్యత్తు తరగతి గోడల మధ్య నిలబడుతుంది.

అంకం నరేష్

6301650324


Next Story