రగులుతున్న సామాజిక వ్యూహాలు!

by Disha edit |
రగులుతున్న సామాజిక వ్యూహాలు!
X

ర్ణాటక పోరులో ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగానే కొద్ది రోజుల్లో ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ వెల్లడిస్తుందనే సమయంలోనే బీజేపీ ప్రభుత్వం 1994 నుంచీ ఓబీసీ కేటగిరీలో 4శాతం వున్న కొన్ని ముస్లిం సమూహాల రిజర్వేషన్లను రద్దుచేస్తూ వాటిని ఓబీసీల్లో జనాధిక్య కులాలైన వక్కలింగలకు 2శాతం, లింగాయత్‌లకు మరో 2శాతం అదనంగా చేరుస్తున్నట్టు ప్రకటించింది. ఓబీసీ కేటగిరిలో రద్దుచేసిన ముస్లింలను ఈడబ్ల్యూఎస్(ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల) జాబితాలోకి నెడుతున్నట్లు కూడా చెప్పింది. అయితే బీజేపీ సంధించిన ఈ అస్త్రంలో ముస్లిం వ్యతిరేక హిందూత్వను, హిందువుల్లో మెజారిటీ సంఖ్యాపర ఓబీసీ కులాలను తమవైపు ప్రలోభ పరుచుకునే ఓట్ల లబ్ధి రాజకీయ ఎత్తుగడలున్నాయని స్పష్టం అవుతోంది.

ఓటమి భయం కారణంగానే..

బ్రిటిష్‌కాలంలోనే కన్నడ సంస్థానంలో 1916లో జరిగిన నాన్ బ్రాహ్మిన్ ఉద్యమం ప్రభావంతో నాటి మైసూరు మహారాజా నల్వాడి క్రిష్టంరాజు వడయార్ తన సంస్థానంలో 1921 నుండీ నాన్ బ్రాహ్మిన్‌లకు రిజర్వేషన్ల ప్రాతినిధ్యాన్ని అమలు చేసాడు. అందులో ముస్లింలు కూడా ఒక భాగంగా వున్నారు. స్వాతంత్య్రం తర్వాత 1962లో ఆర్. నాగగౌడ నేతృత్వంలో మొదటిసారి ఓబీసీ కమిషన్‌ని నియమించి దాని ప్రతిపాదనలతో ఓబీసీల జాబితాలో ముస్లింలను కూడా చేర్చి రిజర్వేషన్ల అమలుకు నాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సాంకేతిక కారణాలతో ప్రతికూల తీర్పులు రావడంతో కన్నడ ప్రభుత్వం 1990లో జస్టిస్ ఓ. చెన్నపరెడ్డి కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా 1994లో దేవెగౌడ ప్రభుత్వం ఓబీసీలను 4 కేటగిరీలుగా చేస్తూ అందులో ఒక కేటగిరీగా కొన్ని వెనుకబడిన ముస్లిం సమూహాలను చేర్చి 6 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన అమల్లో ఉండటంతో వాటిని 4 శాతానికి తగ్గించింది. అప్పటి నుంచీ కర్ణాటకలో కొన్ని ముస్లిం సమూహాలకు ఓబీసీలుగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 2007 నుంచీ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటం మొదలైంది. అప్పటి నుంచీ దఫ దఫాలుగా సుమారు 14 ఏళ్ళపాటు అధికారంలో ఉన్నా ముస్లింల రిజర్వేషన్ల జోలికి వెళ్ళలేదు. కానీ వచ్చే ఎన్నిక ముందు మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని ప్రకటిస్తూ ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేస్తున్నట్టు బీజేపీ చెప్తున్నది. కర్ణాటకలో క్రైస్తవులలోని కొన్ని కులాలకు, బౌద్దంలోని కొన్ని కులాలకు కూడా ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. వాటి జోలికి పోకుండా కేవలం ముస్లింల రిజర్వేషన్లనే టార్గెట్ చేయడం వెనక తనకు ఖచ్చితంగా ఎదురవుతున్న ఓటమి భయం నుండి ఎలాగైనా బయటపడటానికి హిందూ ముస్లింల మధ్య భావోద్వేగాలు రగిలించే విద్వేష రాజకీయ వ్యూహంలో ఒక అస్త్రంగా ఈ నిర్ణయం బీజేపీ చేసిందని అర్ధమవుతోంది.

బీజేపీ మార్క్ రాజకీయం..

ఇదిలా వుంటే .. కర్ణాటకలో ప్రస్తుతమున్న 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 17 శాతానికి పెంచుతున్నట్లు, ఎస్సీలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి ఎస్సీ (లెఫ్ట్) కులాలకు 6శాతం, ఎస్సీ (రైట్) కులాలకు 5.5శాతం, టచ్‌బుల్ ఎస్సీ కులాలకు 4.5శాతం ఇతర ఎస్సీలకు 1శాతం అమలు చేయాలని నిర్ణయించినట్లు కూడా బీజేపీ ప్రకటించింది. అయితే దేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో సుడులు తిరుగుతున్న విషయం బీజేపీకి తెలుసు. ఈ వర్గీకరణ అంశంలో దేశంలో 7 రాష్ట్రాలు మాత్రమే ఆమోదం తెలిపినట్లు మిగతా రాష్ట్రాలు వ్యతిరేకించినట్టు ఇటీవలే తెలిపిన ప్రభుత్వం ఈ వర్గీకరణకు ఎలాంటి పరిష్కారం చూపనున్నదో, తన విధానం ప్రకటించకుండానే బీజేపీ నాయకత్వం హడావిడిగా కర్ణాటక రాష్ట్ర బీజేపీతో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ముందుకు తెచ్చింది. అలాగే 3 శాతంగా వున్న ఎస్టీ రిజర్వేషన్లను 7 శాతానికి పెంచుతూ నిర్ణయం చేసి కేంద్రానికి పంపినట్టు, దీనితో పాటు రాష్ట్రంలోని కాడుగొల్ల, కురబ, బండకురుబ కులాలను కూడా ఎస్టీ జాబితాలోకి తెచ్చే యోచన ఉన్నట్టు ప్రకటించింది. వీటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్డులో (కోర్టుల జోక్యం లేకుండా) చేర్చాలని కూడా కేంద్రాన్ని కోరినట్టు ప్రచారం చేస్తున్నది. ఇక తమపార్టీకి పునాదిగా భావిస్తున్న లింగాయత్‌లకు అధిక సీట్ల కేటాయింపు, మఠాల, మతాల, ప్రాంతాల, సామాజిక సమీకరణలతోపాటు తనను కాంగ్రెస్ 91 సార్లు దూషించిందనే మోడీ భావోద్వేగ కన్నీళ్ళు, అన్ని శాఖల ద్వారా సేకరించిన 40శాతం అవినీతి సొమ్ముతో ఓట్లను, సామాజిక సమూహాలను కొనుగోలు చేసే కార్యాచరణతో బహుముఖీనంగా బీజేపీ మార్కు విద్వేష, అవినీతి రాజకీయం చేస్తోంది. అదానీ కంపెనీలకు దేశ సంపదలను దోచిపెడుతున్న విధానాలపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రశ్నలపైన కానీ, కాశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన సత్యపాల్ మాలిక్ చెబుతున్నట్టు పుల్వామా దాడుల్లో 40 మంది వీరజవాన్లను కోల్పోయిన అసమర్ధ పాలన గురించికానీ మోడీ, అమిత్‌షాలు ఎక్కడా నోరు విప్పడం లేదు.

కాంగ్రెస్ వ్యూహాలు..

ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో, మేం అధికారంలోకి వస్తే ఓబీసీ కేటగిరీలోని ముస్లిం రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరించడమే కాక, మొత్తం ఓబీసీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు కృషిచేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ 2011లో యూపీఏ ప్రభుత్వం చేపట్టిన కుల జనగణనను ఎందుకు బహిరంగ పర్చడంలేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసి బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టాడు. అలాగే 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తామని చెప్పాడు. అలాగే దామాషా ప్రకారం దేశ సంపదను పంచి అభివృద్ధి పరచాలనే చారిత్రక సత్యాన్ని చెప్పాడు. నిజానికి ఓబీసీ కులజనగణనకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఓబీసీల కులజనగణన అంశంలో 2019లో సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పింది. ఈ ప్రకటన జాతీయ స్థాయిలోనే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో కీలకమైన సెక్రటరీల విషయంలో ఓబీసీల ప్రాతినిధ్యం లేదని విమర్శించాడు.

ఓబీసీలకు సంబంధించి కాకా కలేల్కర్, మండల్ కమిషన్‌ల సందర్భాల్లో కాంగ్రెస్‌పార్టీ అనుసరించిన అనిశ్చిత, అపరిపక్వ, విధానాల కారణంగా గతంలో కొన్ని విమర్శలను ఎదుర్కొన్నది. ఓబీసీలకు కేంద్ర సంస్థల్లో 27శాతం రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్‌ను అమలు చేస్తున్నట్టు వి.పి.సింగ్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, 1992లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం వీటిని అమలుచేస్తూ నిర్ణయం చేసింది. ఓబీసీల రిజర్వేషన్లకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలని నాటి నెహ్రూ ప్రభుత్వం చేసిన నిర్ణయం మేరకు 1962లో కర్ణాటకలోను, 1963లో ఆంధ్రప్రదేశ్‌లో ఓబీసీ రిజర్వేషన్లు (25 శాతం)అమలు చేయడానికి తొలి ప్రయత్నం మొదలైంది. కోర్టుల జోక్యంతో అనేక అడ్డంకులను ఓబీసీల రిజర్వేషన్ల అంశం ఎదుర్కొంటున్న సంకట పరిస్థితి నాటి నుండి నేటి వరకూ కొనసాగుతూనే వున్నది. మొత్తంగా ఓబీసీల రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం, ఆర్ధికవృద్ధి అంశంలో రాహుల్‌గాంధీ చేసిన శషబిషలు లేని ప్రకటన కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్ విధానంగా వుంటుందనడంలో సందేహం లేదు. బీజేపీ,కాంగ్రెస్ పార్టీల హోరాహోరి సామాజిక యుద్ధ తంత్రాలు పోటాపోటీగా సాగుతుంటే జెడి(ఎస్)కూడా తనదైన వ్యూహాలతో హంగ్ అవకాశం రాకుండా పోతుందా? అని ఆశలపల్లకీ అలంకరించుకుని ఎదురుచూస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పునర్వవస్థీకరణ చట్టంలోని అంశాల విషయంలో మోసం చేసిన మోడీ ప్రభుత్వ అన్యాయాన్ని వివరిస్తూ ఏపీ కాంగ్రెస్ నేతలు కర్ణాటకలోని తెలుగు ప్రజలకు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకూ ప్రకటించిన అనేక సర్వేల్లో కన్నడ సీమలో కాంగ్రెస్‌పార్టీ పూర్తిమెజారిటీతో అధికారంలోకి రానున్నదని స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వేలు నిజమైతే దేశంలో సామాజిక సమీకరణ వ్యూహాల పేరిట బీజేపీ చేస్తున్న విభజిత విద్వేష విధానాలను వ్యతిరేకించే శక్తులకు కొత్త ఉత్సాహాన్ని కన్నడ ప్రజలు అందించినవారౌతారు.

జంగా గౌతమ్

కార్యనిర్వాహక అధ్యక్షుడు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ

90000 02490


Next Story