జనాభా పెరుగుదలతో.. భారత్‌కు సదవకాశాలు, సవాళ్ళు..

by Disha edit |
జనాభా పెరుగుదలతో.. భారత్‌కు సదవకాశాలు, సవాళ్ళు..
X

విశ్వవ్యాప్తంగా జనాభా భారీగా పెరుగుతోంది. మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు, తగ్గిన మాతా శిశు మరణాలు, పెరిగిన ఆయుఃప్రమాణం లాంటివి దీనికి ప్రధాన కారణాలు. క్రీ.శ.1800 వ సంవత్సరం నాటికి 100 కోట్లున్న ప్రపంచ జనాభా నేడు 804.5 కోట్లకు ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకి 4.2 శాతం జననాలు, 1.8 శాతం మరణాలతో ఏటా 84 మిలియన్ల చొప్పున జనాభా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా 2030లో 8.6 బిలియన్లకు, 2050లో 9.8 బిలియన్లకు, 2100లో 11.2 బిలియన్లకు చేరుతుందని అంచనా. జనాభా పెరిగే కొద్దీ అవసరాలు అధికమవుతాయి. అవకాశాలు తగ్గుతాయి. పెరుగుతున్న జనాభా కారణంగా పర్యావరణం వంటి అంశాలపైనా ప్రభావం పడుతుంది.ప్రపంచ జనాభాకు సంబంధించిన సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్య సమితి 1989 జులై 11వ తేదీన ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ను(world population day) నిర్వహించింది. దీన్ని ఏటా పాటించడం ఆనవాయితీగా వస్తోంది.

యువజనంతో ప్రయోజనాలు

ఇప్పటిదాకా జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న భారతదేశం ఈ ఏడాది 142.8 కోట్ల జనాభాతో, 142.5 కోట్ల చైనాను దాటేసి నంబర్ వన్ అయింది. అయితే, ఈ అధిక జనాభా భారత్‌కు ఒక రకంగా సదవకాశం, మరో రకంగా సవాలు అని చెప్పొచ్చు. మనదేశం జనాభా నియంత్రణపై దృష్టి పెట్టినా, గత ఆరు దశాబ్దాలలో జనాభా రెట్టింపు పైనే పెరిగింది. ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు జనాభా కేవలం భారత్, చైనాలోనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా కొనసాగుతుంటే, భారత్ ఐదో స్థానంలో ఉంది. అయితే చైనాలో ఇప్ప్పుడు పెద్ద వయస్కుల వారి సంఖ్య పెరగడం, జననాల రేటు తగ్గడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు యువశక్తితో కూడిన జనాభా పెరుగుదల ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థికాభివృద్ధి భౌతిక, సహజ వనరులపైనే కాకుండా మానవ వనరులపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణుల అభిప్రాయం. జనాభా పెరుగుదలను ఒక దేశ అభివృద్ధిని నిర్దేశించే అంశంగా పేర్కొంటారు.

భారతదేశం అపారమైన వనరులు, నరులు కలిగిన ఘనమైన దేశం. జపాన్, దక్షిణ కొరియా లాంటి కొన్ని దేశాల్లో జనాభా తగ్గుతుంటే, మనదేశానికి పెరుగుతున్న జనాభాతో పాటు శ్రమ చేసే 15 నుంచి 64 ఏళ్ల వారు 68 శాతం మంది ఉండటం సానుకూలమైన అంశం. దేశ జనాభాలో 45 శాతం మంది 25 సంవత్సరాలు లోపువారే. 2050 నాటికి ఇండియా మధ్యస్థ సగటు వయసు 38 సంవత్సరాలుగా, అమెరికాలో 40 నుండి 42 సంవత్సరాలు, చైనాలో 39 నుండి 44 సంవత్సరాలుగా ఉంటుందని అంచనా. రాబోయే 15-20 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక యువ కార్మిక శక్తి 4 శాతం తగ్గుతుండగా, భారత్‌లో 32 శాతం పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం. మన దేశంలో మానవ వనరులకు ముఖ్యంగా విద్యావంతులైన యువతకు కొదవలేదు. మన యువత ఆర్థిక ప్రగతికి విలువైన ఆస్తివంటివారు. మనం జనాభా పరంగా ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నామని ‘ఐక్యరాజ్యసమితి జనాభా నిధి’ తెలిపింది. ఇది దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులకు సదవకాశం. 2024-25 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యసాధనలో మన యువ జనాభా కీలకం కాగలదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే మన యువశక్తిని ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా మలచుకుంటే మంచి ఫలితాలుంటాయి.

సమస్యలు, సవాళ్లు!

భారత్‌లో జనాభా పెరుగుతున్నందున సమస్యలూ ఎక్కువే. కాలుష్యం పెరగడం, అడవులు తగ్గిపోవడం, నదులు ఆక్రమణలకు గురికావడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, సముద్రాలు, నదులు, భూగర్భ జలాలలోకి రసాయనాలు చేరి నీరు కలుషితమవడం వంటివి ఎక్కువవుతాయి. ఇది మనదేశంలోనూ కొనసాగుతుంది అందుకే పలు పర్యావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా నగరాలు కాలుష్యంతో సతమతమవుతున్నాయి. అలాగే వేగవంతమైన పట్టణీకరణ వల్ల సరిపడా మౌలిక వసతులు, జనాభాకు మెరుగైన విద్య, ఉపాధి, ఆరోగ్యం, గృహవసతి, నీటి వసతి లాంటివి కల్పించడం ప్రభుత్వాలకు తలకు మించిన భారమవుతోంది. నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోంది. యువత సరియైన నైపుణ్యం లేక ఉపాధికి దూరమవుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల భారత్‌లో శాస్త్రీయమైన, నైపుణ్యవంతమైన విద్యావిధానం లోపిస్తోంది. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు అరకొర నిధుల కేటాయింపులు మానవ వనరులపై దుష్ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా జనాభాకు తగ్గట్టు వైద్యసేవలు లేకపోవడంతో, ఆరోగ్యంపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ప్రపంచంలోనే అత్యల్పం. మన దేశంలో పనిచేసే వారిలో తగు సంఖ్యలో మహిళలు లేకపోవడం కూడా పెద్ద లోటు. చైనా, అమెరికాలో 70 శాతం పైగా మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతుంటే, ఇండియాలో కేవలం 25 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ సవాళ్ళను భారత్‌ తగు చర్యలతో అధికమించాల్సి ఉంది.

సమగ్ర కార్యాచరణతో సుస్థిరాభివృద్ధి

జనాభా తీరుతెన్నుల వల్ల వచ్చే లాభాలు వాటంతటవే రావు. సుస్థిర ఆర్థికాభివృద్ధి కావాలంటే వినూత్నమైన విధానాలు, సమర్థమైన అమలు అత్యవసరం. చైనా తయారీ రంగంలో అగ్రగామిగా ఎదిగి, భారీ ఎత్తున ఎగుమతులు చేయడం ద్వారానే ప్రపంచంలో నేడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. చైనా తయారుచేసే వస్తువులు ప్రపంచ విపణిలో ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. చైనా ఆర్థికవ్యవస్థలో తయారీ రంగం వాటా 30 శాతం ఉంటే, మన దేశంలో 14 శాతం మాత్రమే ఉంది. అందువల్ల భారత్ భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, పారిశ్రామికోత్పత్తి రంగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా రంగానికి పెట్టుబడుల లభ్యతను పెంచితే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. మేకిన్ ఇండియా, ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) వంటి పథకాలతో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి. అగ్రశ్రేణి కంపెనీలు భారత్‌కు వస్తున్నప్పటికీ, ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు మారిపోతుండటంతో వెనుకంజ వేస్తున్నాయి. పాలకుల్లో ఆ వైఖరి మారాలి.

చైనా తరహాలో దూసుకెళ్ళాలంటే, భారత్‌లో విద్య, జీవనప్రమాణాలు, ఆర్థికసంస్కరణల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలి. ముందుగా పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. యువతను దేశ అభివృద్ధి, ప్రగతిలో భాగస్వాములను చేయాలి. వాళ్ళను ప్రధాన వనరుగా మలచుకోవడం అత్యంత అవసరం. కోవిడ్ విజృంభణ తర్వాత ప్రపంచ దేశాలు ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని నివేదికలు వెల్లడించడం శుభపరిణామం. ఈ తరుణంలో మన పాలకులు దక్షతతో వ్యవహరించి మరిన్ని పెట్టుబడులను రాబట్టాలి. తద్వారా ఆర్థిక అభివృద్ధి జరిగి, ప్రజలకు ప్రగతి ఫలాలు అందుతాయి. అధిక జనాభా వల్ల ఎదురయ్యే సవాళ్ళను సమగ్ర కార్యాచరణతో దీటుగా ఎదుర్కొని, యువశక్తితో ఆర్థికాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్ళగలిగితే భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ర్యాంకింగ్‌లో మరింత ముందుకు చేరుకుంటుంది.

(ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా)

పీ.వీ.ప్రసాద్,

9440176824



Next Story