సర్వే మంత్రం: సర్వం స్వతంత్రం!

by Disha edit |
సర్వే మంత్రం: సర్వం స్వతంత్రం!
X

రాజకీయ చూపులో.... లోపమో? దోషమో? ఉంటుందేమో కానీ, ప్రజాక్షేత్రమెప్పుడూ సుస్పష్టమే! శాస్త్రీయంగా జననాడిని పసిగట్టి, మనిషి మనోగతం తెలుసుకోవడం తేలికే! ప్రాతినిధ్య శాంపిల్‌, తగిన ఉపకరణాలు, సరైన పద్దతి, డాటా హేతుబద్ధ అన్వయం ఉంటే.... సర్వేలన్నీ వాస్తవానికి దగ్గరగానే ఉంటాయి. కానీ, సర్వే పేరు చెప్పి... ‘అది అలా ఉంది’ ‘ఇదుగో, ఇదిలా ఉంది’ అంటూ, ఏ సర్వే లేకుండానే సొంత నిర్ణయాలతో పార్టీలు, అధినాయకత్వం తమ అభీష్టం నెరవేర్చుకోవాలనుకున్నపుడే సమస్య! అది ఒక శాస్త్రీయ సర్వే ఆధారిత నిర్ణయం కాదని జనం గ్రహించలేకపోతారు. అక్కడక్కడ కొందరు నాయకులు, కార్యకర్తలు, సామాన్యులు గ్రహించినా... ఈ లోపు కాలం హరించుకుపోతుంది. ఫలితం వికటిస్తుంది. సర్వేల విశ్వసనీయత సన్నగిల్లుతుంది. టిక్కెట్లు ఇచ్చే ప్రాతిపదిక నుంచి పదవులు, హోదాలు కట్టబెట్టే అవకాశాల వరకు అగ్రనేతలు సర్వే మంత్రాన్నే జపిస్తుంటారు. కానీ, సొంత నిర్ణయాలనే నాయకులపైన, కేడర్‌పైన రుద్దుతుంటారు. అంటే, సర్వే భుజమ్మీద తుపాకీ పెట్టి నచ్చని వారి ‘అవకాశం’ కోయడం, కావలసిన వారికి ‘అందలాలు’ ఇయ్యడం. పేరు ‘సర్వే’ది, లక్ష్యం... రాజకీయం! ఇదీ తెలుగునాట జరుగుతున్న తంతు! ఇందులో ఏ ప్రధాన పార్టీకీ మినహాయింపు లేదు.

సర్వే నిత్య మంత్రమవుతూ..

తెలుగుదేశం పార్టీకి బలమే లేని మంగళగిరిలో ఏ సర్వే ఆధారంగా లోకేశ్‌కి టిక్కెట్టు ఇచ్చారు? సర్వే ఏం చెప్పిందని వై.ఎస్‌.విజయమ్మని విశాఖ నుంచి లోక్‌సభ బరిలో దించారు? పవన్‌కల్యాణ్‌కు గాజువాకకు ఉన్న బాదరాయణ సంబంధమేంటి? మరే సర్వే చెప్పిందని హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను తెరపైకి తెచ్చి, ఉన్నట్టుండి కౌశిక్‌రెడ్డి టిక్కెట్టు కోశారు! అంతా నాయకుల అభీష్టమే! ఫక్తు రాజకీయం! తరచి చూస్తే ఇలానే ఉంటాయి రాజకీయాలు.

తెలుగునాట చంద్రబాబే వీటికి ఆద్యుడు, తర్వాత వైఎస్సార్‌, కేసీఆర్‌, జగన్‌... ఇలా అంతా అనుసరిస్తున్నారు. గత శతాబ్ది తొంభయ్యో దశకం నుంచి... ఇలా సర్వేలను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీలు, అధినేతలు తాము కోరింది జరిపించుకోవడాలు మొదలయ్యాయి. కొన్ని సర్వేలు జరుగుతాయి... మరికొన్ని తూతూ మంత్రంగా! ఇంకొన్ని సర్వేలు అసలు జరుగకుండానే ముఖ్యమంత్రులకు, ముఖ్యమైన ఇతర నాయకులకు ‘సర్వే’ అన్న రెండక్షరాలే నిత్య మంత్రమవుతాయి. పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదిక అవుతాయి. గెలవరేమో అని అనుమానాలున్న సిట్టింగ్‌లకు టిక్కెట్లు గల్లంతవుతాయి. చివరకు ఫలితాలు తారుమారవుతాయి. మంత్రివర్గంలో స్థానం కల్పించడానికి కూడా ‘సర్వే జరిపించాం, క్లీన్‌ ఇమేజ్‌ లేదు’ అంటారు. ఇదీ వరస!

ఆత్మపరిశీలన నిల్లు

సర్వేల పేరు చెప్పి పార్టీలు తాత్కాలిక అవసరాలు తీర్చుకుంటున్నాయే తప్ప నిజమైన ప్రయోజనం పొందటం లేదు. ఒక కమ్యూనిస్టు పార్టీలు తప్ప అంతా సర్వే పేరు వాడుకుంటారు. కమ్యూనిస్టు పార్టీలు సర్వే కాకుండా ప్రజాక్షేత్రం`పోరాటం అంటాయి, కానీ, ఆ పోరాటాలూ తగ్గిపోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే, సర్వే పేరు వాడుకోవడం ద్వారా పార్టీలు, నాయకులు పరవంచనతో పాటు ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుంటే, ‘మనం సర్వే చేపిస్తున్నాం, అందులో బాగున్నవారికే టిక్కెట్టు’ అని ముఖ్యమంత్రులు పార్టీ అంతర్గత సమావేశాల్లో వెల్ల‌డించ‌డం తరచూ జరిగేదే! అది ఇంటలిజెన్స్‌ విభాగం వంటి ప్రభుత్వ యంత్రాంగం జరిపే సర్వేనా, ప్రయివేటు సంస్థలిచ్చే సర్వే నివేదికా తెలియదు. ప్రభుత్వాల పట్ల ప్రజావ్యతిరేకత పెరిగినపుడు, దానికి విరుగుడుగా పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్ల కోత తరచూ జరిగేదే! ఎవరి టిక్కెట్టు కోయాలి? ప్యారాచూట్‌ ద్వారా దింపి, ఎవర్ని పెట్టాలి? అన్నది జఠిలంగా మారితే,,,, ‘సర్వే’నే నాయకత్వానికి రక్ష!

‘అలిపిరి’ దుర్ఘటన తర్వాత.... లేని సానుభూతి ఉందనుకొని, కృత్రిమ సానుభూతి పుట్టించొచ్చని తెలుగుదేశం అధినేత బలంగా నమ్మి 2004 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఏ శాస్త్రీయత, సామాజిక అధ్యయనం, సర్వే వంటివి లేకుండానే ముందస్తు ఎన్నికలకు తొందరపడి, కడకు బొక్కబోర్లా పడ్డారు. తమతో జట్టుకట్టిన బీజేపీని, ఎన్డీయేనూ ముంచారు.‘ఆంధ్రా ఆక్టోపస్‌’ అని స్వీయ కితాబిచ్చుకున్న లగడపాటి రాజగోపాల్‌ పోల్‌ సర్వేలు ఏమయ్యాయి? ఆయనని నమ్ముకొని 2019లో చంద్రబాబు మరోమారు బోల్తాకొట్టారు. నిన్నటికి నిన్న, రాజీనామాతో ‘మునుగోడు’ ఉప ఎన్నిక తెచ్చి, యుద్దప్రాతిపదికన ఎన్నికలకు వెళ్లి, లెక్కకుమిక్కిలి డబ్బు పారించి.... కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గాని, బీజేపీ గానీ చివరకు బాపుకున్నదేమిటి? పదివేల ఓట్లతో ఓటమి, దానికి మించి పరాభవం! సర్వే జరిపించి కూడా అందులో వెల్లడైన అంశాలను అహం వల్ల ఖాతరు చేయలేదు. వెంటనే ఎన్నికలకు వెళ్లొద్దని, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాత వెళ్లొచ్చని సదరు సర్వే చేసిన సిఫారసును బుట్టదాఖలు చేసి, చివరకు ఫలితాన్నీ... అక్కడికే పంపారు.

నిజమైనదైతే ఓకే!

శాస్త్రీయంగా జరిపే సర్వే ఈసీజీ లాంటిది. ఉన్నదున్నట్టు, లేదా స్వల్ప వ్యత్యాసాలతో.... క్షేత్రంలోని వాస్తవ పరిస్థితిని యధాతథం చూపిస్తుంది. కానీ, నిజమైన సర్వే ఎజెన్సీలను ఎంచుకోవడం, వారిచ్చే ఇన్‌పుట్స్‌ని సరిగా అన్వయించడం, సిఫారసులను అనుసరించడం చేస్తే పార్టీలకయినా, ప్రభుత్వాలకైనా ఎంతో ఉపయోగం. మన వ్యవస్థల్లో అది సరిగా జరుగదు. పథకాలు రచించేప్పుడు, అవి అమలవుతున్నపుడు, వాటిల్లో మార్పులు ప్రతిపాదించినపుడు, ఎన్నికలకు ముందు, తర్వాత.... ప్రజలేమనుకుంటున్నారో క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి ప్రభుత్వాలు, పార్టీలు ప్రయత్నించొచ్చు. ఇది మంచిదే! ఉన్న పనితీరు కొనసాగించడానికో, మార్చుకోవడానికో అవకాశం ఉంటుంది. శాస్త్రీయ సర్వే ద్వారా, ప్రజాదరణని బట్టి ఒకరిని అభ్యర్థి చేయడం, మంచి పేరుని బట్టి ఒకర్ని మంత్రి చేయడం పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే, దేని పట్ల ప్రజలు అనుకూలంగా ఉన్నారు, దేన్ని వ్యతిరేకిస్తున్నారు, ఏ మార్పులు కోరుకుంటున్నారు... అనే విషయాలను యధాతథం స్వీకరించే చిత్తశుద్ధి నిజాయితీ నాయకుల్లో ఉండాలి. కొన్నిసార్లు సర్వే ప్రతికూలంగా వస్తే చాలు, పక్కన పడేస్తారు. ఎందుకు ప్రతికూలంగా ఉంది? ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రతికూలత అధిగమించడానికి ఏం చేయాలి? అన్న సద్యోచన సాగాలి. అంతే తప్ప, సర్వేలో ఒకటి వస్తే, బయటకు ఇంకోటి చెప్పటం, అసలు సర్వేనే జరిపించకుండా, ఆ పేరు చెప్పి మనసుకు తోచింది చేయడం నిరుపయోగం. ఫలితాల తర్వాత సరైన సమీక్ష, ఆత్మపరిశీలన చేయకుండా...ఏదో వంక చూపి, వాస్తవాన్ని దాటవేయటమూ రాజకీయాల్లో తరచూ జరిగేదే! 2014 ఎన్నికల్లో ‘రుణమాఫీ చేస్తామని, ఒక అబద్ధం మేమూ చెప్పి ఉంటే గెలిచేవాళ్లం’ అని వైసీపీ, 2019 ఎన్నికల్లో ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అన్న జగన్మోహన్‌రెడ్డి వైపు జనం మొగ్గడంవల్లే తాము ఓడిపోయామని టీడీపీ అనటం... ఇలాంటిదే! ఓడాక ఆ మాట చెబుతున్నారు, మరి మీ పోలింగ్‌ ముందరి సర్వేల్లో, ఇంటలిజెన్స్‌ నివేదికల్లో ఈ అంశం ఎందుకు రాలేదో సమీక్షించారా ఎప్పుడైనా? అంటే ఏమంటారు!

సాంకేతికత పెరిగి, తెలివి తగ్గింది

2018 ఎన్నికలప్పుడు, తెలంగాణలో టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌ను ముంచింది. ముందుగా దీన్నెందుకు పసిగట్టలేకపోయారు? అధికారంలో ఉన్న చంద్రబాబు అయినా, తన ఇంటలిజెన్స్‌ సర్వేల ద్వారా తెలుసుకొని ఉండాల్సిందే! కొందరు అధికారులైనా వాస్తవాలు చెప్పగలరు, కానీ, వారిని చెప్పనిచ్చేదెవరు? వైఎస్సార్‌ తర్వాత చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి, షర్మిల, తమ్మినేని వీరభద్రం, బండి సంజయ్‌కుమార్‌, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఇలా ఎందరెందరో పాదయాత్రలు చేస్తున్నారు. అసలు వాటి ప్రభావమెంత? ఓ శాస్త్రీయ పరిశీలన, సర్వే జరిగితేగాని ప్రభావాల గురించి తెలియదు. తమది పెద్ద శాంపిల్‌ అని ఓ సంఖ్య చెప్పి, ప్రచారం చేసుకునే సర్వేలనూ శంకించాల్సిందే! శాస్త్రీయంగా సర్వే జరిపించడానికి బోల్డు ఖర్చవుతుంది. దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? ఎవరు పాల్గొంటారు? డాటా అన్వయం చేసే రాజకీయ విశ్లేషకులెవరు? డబ్బెక్కడిది? వంటి విషయాలు చెబుతూ సర్వే సంస్థలు పారదర్శకంగా ఉండాలి. జననాడిని జాగ్రత్తగా పట్టి`విశ్లేషించడంలో... దేశవ్యాప్తంగా యోగేంద్రయాదవ్‌, ప్రణయ్‌రాయ్‌, సంజయ్‌కుమార్‌, సోప్డీవాలా.... ఇలా కొన్ని నిబద్ధత కలిగిన పేర్లున్నాయి. ‘మెజరింగ్‌ ఓటింగ్‌ బిహేవియర్‌ ఇన్‌ ఇండియా’ వంటి మంచి పుస్తకాలొచ్చాయి. ఒకవైపు సాంకేతికత పెరుగుతుంటే, మరోవైపు కామన్‌సెన్స్‌ సన్నగిల్లుతోంది. ఉస్మానియాతో పాటు పలు దక్షిణాది యూనివర్సిటీల రాజనీతి శాస్త్ర విభాగాలు పటిష్టంగా ఉండి, గతంలో మంచి పేరుండేది. ఇప్పుడు అంతటా పేరు పలుచనయింది. సర్వేలు శాస్త్రీయంగా జరిగి జనాభిప్రాయానికి పెద్దపీట దక్కితే ప్రజాస్వామ్యం బలపడుతుంది తప్ప సర్వే వంకతో కాదు!

-దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected],

99490 99802



Next Story

Most Viewed