ఫుడ్ పాయిజన్ ఘటనలు పొరపాట్లు కావు.. ఇది వ్యవస్థాపిత వైఫల్యం!

by Ravi |   (  Updated:2025-08-13 01:16:17  IST  )

పేద పిల్లల కడుపు నింపాల్సిన గురుకులాల్లో కమీషన్లకు కక్కుర్తి పడి, పిల్లలకు సరైన భోజనాలు పెట్టకుండా నరకం చూపెడుతున్నారు.

ఫుడ్ పాయిజన్ ఘటనలు పొరపాట్లు కావు.. ఇది వ్యవస్థాపిత వైఫల్యం!
X

పేద పిల్లల కడుపు నింపాల్సిన గురుకులాల్లో కమీషన్లకు కక్కుర్తి పడి, పిల్లలకు సరైన భోజనాలు పెట్టకుండా నరకం చూపెడుతు న్నారు. తినే తిండి కలుషితం, తాగే నీరు క్రిమి సహితం, పిల్లల భవిష్యత్తును అంధకారం చేయడానికి ఇలాంటివన్నీ కారణం అవుతున్నాయి. ఎవరడుగుతా రులే అనే అహంకారం అక్కడి వారిలో ఉంది. ఎవరేమీ చేయలేరనే గర్వం నిర్వాహకుల్లో కనిపిస్తూ ఉంది.

ఎన్నో ఏళ్లుగా గురుకులాల్లో పిల్లలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ గుర్రు పెట్టి నిద్రిస్తున్న అధికారులు సమస్యలకు పరిష్కారం చూపించడం లేదు.

ఒక చోట జరిగితే నిర్లక్ష్యం కానీ..

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్లలో వరుసగా వెలుగు చూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని భావించే ఈ దేశంలో అదే అన్నం చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కేవలం వంటల పొరపాట్లు కావు. ఇది వ్యవస్థాపిత వైఫల్యం. అధి కారుల బాధ్యత, అధికారుల నిర్లక్ష్యం, తనిఖీల లోపం.. ఇవన్నీ కలిసి పిల్లల ఆరోగ్యాన్ని క్షీణింప చేస్తున్నాయి. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు అందించాల్సిన ఆహారం విషంగా మారడం.. అధికారుల నిర్లక్ష్యం వలన పాలనా వ్యవస్థపై నమ్మకాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. పేద విద్యార్థులకు హాస్టల్ అన్నది భద్రతతో కూడిన విద్యా వేదిక. కానీ ఇప్పుడు అవే హాస్టల్స్ ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఒక చోట జరిగితే అదేదో నిర్లక్ష్యం అని అనుకోవచ్చు. కానీ అన్నేసి చోట్ల ఒకదాని తర్వాత మరొకటి బయట పడుతుంటే పేద పిల్లల దుస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు.

80 శాతం దాకా సరుకుల లోటు..

దేశవ్యాప్తంగా NHRC సమర్పించిన నివేదికలో 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు, 48 మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా నాణ్యత లేని మాంసం, నూనె, కూరగాయలు, పదార్థాల వినియోగం, శిక్షణ లేని వంటవాళ్లు, వంటగది పరిశుభ్రతపై తనిఖీల కొరత, ఫుడ్ టెస్టింగ్ లేకుండా వడ్డింపులు ఇవన్నీ ప్రధానంగా ఈ సమస్యలకు మూలంగా చెప్పుకోవాలి. కాంట్రాక్ట్‌పై పదార్థాల కొనుగోలు పేరుతో 80% వరకు లోటు సరుకులు సరఫరా అవుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదులు పట్టించుకోక పోవడం, హెల్త్ కమిటీలు ఏర్పాటు చేయకపోవడం, కిచెన్ పరిశీలన లేకపోవడం ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల భద్రతా వ్యవస్థపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటనలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో నేను ఫిర్యాదు చేస్తే కొన్ని ఘటనలను కమిషన్ సుమోటోగా తీసుకొని విచారణ ప్రారంభించింది.

ఈ శిక్షలు అమలయ్యాయా?

భద్రతా పరంగా ప్రభుత్వం 2024 నవంబర్‌లో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారులున్నా అమలు స్థాయిలో మార్పు కనిపించడం లేదు. వంట ప్రారంభానికి ముందు కిచెన్ పరిశీలన, భోజనం సిద్ధమైన తర్వాత హెడ్మాస్టర్, ఇద్దరు సభ్యులు రుచి చూసిన తర్వాతే వడ్డించాలనే ఉత్తర్వులు ఇచ్చినా.. ఇవి ఎంతమేర పాటించబడ్డాయన్నది ప్రశ్నార్థకమే. చట్టపరంగా చూస్తే, భారత న్యాయవ్యవస్థలో ఆహార కలుషితంపై స్పష్టమైన సెక్షన్లు ఉన్నాయి. BNS సెక్షన్ 286 ప్రకారం, విష పదార్థాల నిర్లక్ష్య వాడకానికి 6 నెలల జైలు లేదా రూ.5,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సెక్షన్ 274 ప్రకారం ఆహార కల్తీకి ఇదే శిక్ష ఉంటుంది. కానీ ఈ చట్టాలు పాఠ శాలలపై ఎప్పుడైనా అమలయ్యాయా?

ప్రతి ఇద్దరిలో ఒకరికి అనీమియా!

ఆహార నాణ్యతపై కఠిన తనిఖీలు, కాలానికి అనుగుణంగా మెనూలో మార్పులు, శిక్షణ పొందిన వంటవాళ్లు, సకాలంలో ఫుడ్ టెస్టింగ్, విద్యార్థుల ఆరోగ్యంపై నెలకొకసారి మెడికల్ టెస్టింగ్, ఆరోగ్య కమిటీల ఏర్పాటు, కాంట్రాక్ట్ విధానాలపై ఆడిట్ తప్పనిసరి చేయడం వంటి చర్యలు అవసరం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం, తెలంగాణలో ప్రతి ఇద్దరిలో ఒకరు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో విషపూరిత భోజనం వల్ల పిల్లలు వాంతులు, డయోరియా, బలహీనతకు గురికావడం మరింత ప్రమాదకరం. బాలికల్లో ఇది భవిష్యత్తులో తల్లి తనానికీ, పుట్టబోయే తరం ఆరోగ్యానికి ముప్పుగా మారనుంది. పోషకాహార వ్యూహాలు దీర్ఘకాలికంగా ఉండాలి. ఒక్క Nutribarతో సమస్య పరిష్కారం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మెనూను నిజంగా పాటిస్తున్నారా?

నిపుణులు సూచిస్తున్న మెనూలు పిల్లలకు పెడుతున్నా రా? వేసవిలో పుచ్చకాయ, మామిడికాయలు, వానాకాలం లో మెంతి కూరలు, చలికాలంలో బెల్లం, విత్తనాలు వంటి పోషక పదార్థాలు ఉండాలి. కానీ ప్రస్తుతం మన స్కూళ్లలో అదే పాత మెనూ! పిల్లలకు సరైన పోషకాలు ఇవ్వకపోగా, శరీరాన్ని మరింత బలహీనపరుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు విద్యా మంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్ల ఎన్నో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా ఫీజు నియంత్రణ కమిటీలు, ట్రాన్స్‌ పోర్ట్‌లు, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు. బాలికల భవిష్యత్తు విషపూరిత భోజనం వల్ల తీవ్రంగా ప్రభావి‌తమవుతుంది. అందుకే ఈ ఘటనలపై ఇప్పుడే స్పందిం చాలి. విచారణ జరగాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

- దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Next Story