స్వరాష్ట్రంలో దగాపడ్డ ముస్లింలు!

by Disha edit |
స్వరాష్ట్రంలో దగాపడ్డ ముస్లింలు!
X

తెలంగాణ రాష్ట్రంలో 14 శాతంగా ఉన్న ముస్లింల బ్రతుకులు మారుతాయనే ఉద్దేశ్యంతో అన్ని జిల్లాలోని ముస్లింలు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. మన స్థితిగతులు మారుతాయని ముస్లిం సమాజంలో చైతన్యం తీసుకొని రావడంతో ముస్లింలు ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి జేఏసీ పిలుపు మేరకు ముస్లిం విద్యార్థులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు సమూహంగా ఏర్పడి ముస్లిం సమాజంలో ఉద్యమ ఆకాంక్షను రగిలించారు.

ముస్లింల దీన పరిస్థితులు..

ప్రస్తుతం తెలంగాణలోని ముస్లింలు సామాజిక, విద్యా స్థితిగతులు చూస్తే ఇతర వర్గాల కంటే అధ్వానంగా ఉన్నాయి. సచార్ కమిటీ, శ్రీ రంగనాధ్ మిశ్రా కమిటీలు ముస్లిం స్థితిగతులపై అధ్యయనం చేసి ముస్లింలు దిన పరిస్థితులు అనుభవిస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. అయితే స్వరాష్ట్రం ఏర్పడితే, పరిస్థితులు మారుతాయని అనుకున్నాము కానీ వాస్తవంలో అలా జరగలేదు. నేటికి ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఎలాంటి ముందడుగు కనిపించడం లేదు. ప్రభుత్వం చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందని అలాంటి వారికి ఏ విధంగా నమ్మాలని ముస్లిం సమాజం ప్రశ్నిస్తోంది. ఉర్దూను ద్వితీయ భాషగా చేస్తామని, ఉర్దూ అభ్యర్ధుల కోసం ప్రత్యేకంగా డీఎస్సీ వేస్తామని మాట ఇచ్చి మాట తప్పారు పాలకులు. ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఓవర్సీస్ స్కాలర్షిప్ సమయానికి అందక ముస్లిం విద్యార్థులు లబోదిబోమంటున్నారు. షాది ముబారక్ లాంటి పథకాలు సంవత్సరం తర్వాత అర్హులకు అందుతున్నాయి. ఆ వచ్చిన డబ్బులు వడ్డీలకూ సరిపోవడం లేదు. ఇమామ్ మౌజాన్‌లకు జీతాలు సరిగా రావడం లేదు. మైనార్టీ కార్పోరేషన్ ద్వారా లోన్‌లను సరిగా అందజేయడం లేదు. అన్ని పథకాలు నామమాత్రంగా మాత్రమే అమలు చేస్తున్నారు. నామ్ కే వాస్తి కామ్ కుచ్ నహి అన్నట్టు ఉంది. ప్రస్తుతం ముస్లింలు దీన పరిస్థితులు అనుభవిస్తున్నారు ముస్లింలకు ప్రస్తుతం భూమి, ఉద్యోగాలు, ముఖ్యమైన పదవులు, విద్య లేదా ఇతర అవకాశాలు లేవు. దురదృష్టవశాత్తు, 75% కంటే ఎక్కువ మంది ముస్లిం నిరుద్యోగులు ఎలాంటి ఉపాధినీ కలిగి లేరు. ముస్లింల కోసం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ పూర్తిస్థాయిలో అందజేయలేకపోతున్నారు. పైగా మెదక్‌లో అమాయక ముస్లిం ఖదీర్‌ లాకప్ డెత్ వల్ల చనిపోతే వారికి పరామర్శించడానికి కూడా ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదు కనీసం పరిహారం కూడా అందలేదు. మొయినాబాద్‌లో ముస్లిం బాలికను రేప్ చేసి చంపేసిన వారికి కూడా న్యాయం జరుగలేదు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ రద్దు కోసం ధర్నాలు చేస్తే కేసులు బుక్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి?

ఆ చరిత్ర పునరావృత్తం కావొద్దు!

గత రెండు ఎన్నికల్లో ముస్లిం సమాజం 10 శాతానికి పైగా ఓటు బీఆర్ఎస్‌కి వినియోగించుకోవడంతో, ఆ పార్టీ గెలిచేందుకు దోహదపడింది. అలాంటప్పుడు ముస్లింలకు ఇచ్చిన హామీలు నేరవేర్చనవసరం లేదా? రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని కేవలం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చేతులు దులుపుకుంటారా? కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించరా? తొమ్మిదేళ్లుగా ముస్లిం సమాజం నష్టపోయిన ఆగాదాన్ని ఎలా పూడుస్తారు? షాదీముబారక్, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పరచి కొంత మేలుచేసినప్పటికీ, ఇప్పటికీ వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ పవర్, వక్ఫ్ భూముల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, మైనారిటీ కమిషన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీలకు పూర్తి స్థాయి పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. సచార్ కమిషన్ సూచించిన మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే మైనారిటీ బంధు, ఉర్దూ మీడియం స్కూల్స్, కాలేజీలలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులు, టీఎస్‌పీఎస్సీలో ముస్లిం మైనారిటీకి సభ్యుడిగా అవకాశం, యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ పదవి, అలాగే డబల్ బెడ్‌రూం, ఇండ్ల కేటాయింపులో ప్రత్యేక కోటా కల్పించాలని కోరుతున్నాము.

ఓట్లు సరే.. వారి కష్టాలూ...!

ఎంతసేపూ మతతత్వ పార్టీలను బూచీగా చూపెట్టి తమను తాము సెక్యులర్‌గా చెప్పుకొనే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితేనేమీ, ముస్లింల ప్రతినిధిగా చెప్పుకొనే ఎంఐఎం అయితేనేమీ గంపగుత్తగా ముస్లింల ఓట్లు తీసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. తప్ప ముస్లిం సమాజం కష్టాలు పట్టించుకోలేదు. ముస్లిం సమాజంలోని ఆలోచనాపరుల మనోభావాలను పట్టించుకోకుండా, ముస్లిం పేద వర్గాలకు ఏమీ చేయకుండా, గతంలో లాగా ఈసారి ఓట్లను గంపగుత్తగా ఎగరేసుకుపోయే చరిత్ర పునరావృతం కావద్దు. రాబోయే ఎన్నికలలో తెలంగాణలో పోటీ చేసే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముస్లిం జేఏసీ రూపొందించిన 22 డిమాండ్లను అమలు చేస్తామని ప్రకటించాలి. వారి మానిఫెస్టోలో ఈ డిమాండ్లను చేర్చాలి. వీటిని అమలు చేస్తామని. హామీ ఇవ్వాలి. లేదా వీటికంటే మెరుగుగా ముస్లింల అభివృద్ధి కొరకు ప్రణాళికలు రచించి అమలు చేస్తామని భరోసా ఇవ్వాలి. అలాంటి వారికే ముస్లిం సమాజం సపోర్ట్ చేయాలి. తెలంగాణ సమాజంలో అతి పెద్ద సమూహమైన ముస్లింలు బాగుపడకుండా బంగారు తెలంగాణ ఎలా సాధ్యం? మన దేహంలోని ఏదేని అవయవానికి గాయమైతే మన శరీరం నీరసమవుతుంది. మరి మన సమాజంలోని ఇంత పెద్ద సమూహం వెనుకబడి ఉంటే నెంబర్ వన్ తెలంగాణ ఎలా సాధ్యం?

మీరాసాబ్ జహీర్ పాషా

తెలంగాణ ముస్లిం జేఏసీ

9666502183


Next Story

Most Viewed