గగనతలాన్ని శాసిస్తున్న మహిళలు

by Disha edit |
గగనతలాన్ని శాసిస్తున్న మహిళలు
X

9 జనవరి 2021 న భారత మహిళా పైలట్ కెప్టెన్ జోయా అగర్వాల్ పూర్తిగా మహిళా సిబ్బందితో ప్రపంచంలోనే అత్యధిక గగనతల దూరం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఉత్తర ధృవం మీదుగా ఏకధాటిగా 17 గంటలపాటు 16,000 కిలోమీటర్లు విమానం నడిపారు. దీంతో ఆమె ప్రతిష్టాత్మక శాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియంలో చోటు దక్కించుకున్నారు. మ్యూజియంలోని 25 గ్యాలరీలలో ఏకైక మానవమాత్రురాలు కెప్టెన్ జోయా అగర్వాలే. ఆమె 2013లో బోయింగ్ 777 విమానాన్ని నడిపిన అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరోనా వేళ 'వందే‌భారత్' మిషన్‌లో భాగంగా టెస్టింగ్, వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేని సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి అమెరికా, ఇతర విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించారు.

స్వాతంత్ర్యానికి పూర్వం మహిళల పురోగతికి రాజా రామమోహన్‌ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతిరావ్ ఫూలే, పెరియార్ ఈవీ రామస్వామి లాంటి ప్రముఖులు చేసిన అవిరళ కృషి ఫలితంగా భారతీయ మహిళలు వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ముఖ్యంగా విమానయాన రంగంలో 15 శాతం మహిళా కమర్షియల్ పైలట్‌లు తమ ప్రతిభను చూపుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా పైలట్‌లు గల దేశాల జాబితాలో అమెరికా, ఐరోపా దేశాలను వెనుకకు తోసి భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ఇతర దేశాలో వారు ఐదు శాతం మాత్రమే. పౌర విమాన రంగంలోనే కాకుండా, వైమానిక దళంలోనూ అత్యధిక మహిళా పైలట్‌లు గల దేశంగా భారత్ కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 146 దేశాల సూచీలో లింగ సమానత్వం ఆధారంగా 135 వ స్థానంలో ఉన్న భారత్ విమానయాన రంగంలో మాత్రం ఈ గణాంకాలను తలకిందులు చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.

కరోనా తరువాత

గత రెండున్నర దశాబ్దాలలో దేశీయ విమానయాన రంగంలో పెను మార్పులు సంభవించాయి. కరోనా ప్రభావం తగ్గడంతో అంతర్జాతీయ సరిహద్దుల ఆంక్షలను సడలించారు. జెట్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది చివరలో తిరిగి ప్రారంభం కానుంది. దీంతో దేశంలోనే తక్కువ చార్జీలతో మధ్యాదాయ వర్గాలవారికి విమానయానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 7 ఆగస్టు 2022 న 'ఆకాశ్ ఎయిర్' తన సేవలను ప్రారంభించింది. ఫలితంగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య క్రమేపీ కరోనా ముందు స్థితికి చేరుకుంటోంది. కమర్షియల్ పైలట్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ఫిబ్రవరిలో పౌర 'ఇంటర్‌ నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్' 2020 గణాంకాల ప్రకారం 9.9 శాతంతో భారత్ తరువాత రెండవ స్థానంలో ఐర్లాండ్, 9.8 శాతంతో మూడవ స్థానంలో దక్షిణాఫ్రికా, 6.9 శాతంతో నాల్గవ స్థానంలో కెనడా, 6.9 శాతంతో జర్మనీ ఉన్నాయి. అమెరికా లో 5.4 శాతం, బ్రిటన్ లో 4.7 శాతం మాత్రమే మహిళా పైలట్‌లు ఉన్నారు.

భారత్‌లో సాధారణ, చిన్నతరహా ప్రాంతీయ విమానయాన సంస్థలు 13.9 శాతం వరకు మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని, కార్గో సంస్థలు మాత్రం 8.5 శాతం అవకాశమిస్తున్నాయని ఓ సర్వే వెల్లడించింది. 'పౌర విమానయాన రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పోషిస్తున్నది. దేశీయ అవసరాలకు తగినట్టుగా త్వరలోనే కమర్షియల్ పైలట్‌ల నియామక నిబంధనలలో మార్పులు చేస్తాం. లైసెన్స్ ప్రక్రియను సరళీకృతం చేస్తాం. యువత కోసం 33 దేశీయ సరుకు రవాణా టెర్మినల్స్, 15 కొత్త పైలట్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి, డ్రోన్లపై దృష్టి సారించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది ' అని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్‌సభలో చెప్పారు.

పెరిగిన ప్రయాణికులు

2016లో విధాన ప్రకటన తరువాత దేశ పౌర విమానయాన రంగం ముఖచిత్రం సమూలంగా మారుతున్నది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో విమానాశ్రయాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు కొత్త పునాది పడింది. జీతాలు కూడా చెల్లించలేక ఖాయిలా పడిన 'ఎయిర్ ఇండియా'లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్లు లభించాయి. ప్రాంతీయ కనెక్టివిటీ పథకం (ఆర్‌సీఎస్) ద్వారా చిన్న నగరాల మధ్య విమాన రాకపోకలు సాగుతున్నాయి. 'ఉడాన్' పథకం ద్వారా తక్కువ ధరలకు విమాన టికెట్లు అందుబాటులోకి తేవడంతో 2022 జనవరి నాటికి కేవలం రూ.2500 టికెట్ చార్జీలతో 87 లక్షల మంది ప్రయాణికులు విమానాలలో ప్రయాణించారు. ఈ చర్యల వలన యువతకు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలకు తలుపులు తెరుచుకున్నాయి.

ప్రతిష్టాత్మక మ్యూజియంలో

9 జనవరి 2021 న భారత మహిళా పైలట్ కెప్టెన్ జోయా అగర్వాల్ పూర్తిగా మహిళా సిబ్బందితో ప్రపంచంలోనే అత్యధిక గగనతల దూరం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఉత్తర ధృవం మీదుగా ఏకధాటిగా 17 గంటలపాటు 16,000 కిలోమీటర్లు విమానం నడిపారు. దీంతో ఆమె ప్రతిష్టాత్మక శాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియంలో చోటు దక్కించుకున్నారు. మ్యూజియంలోని 25 గ్యాలరీలలో ఏకైక మానవమాత్రురాలు కెప్టెన్ జోయా అగర్వాలే. ఆమె 2013లో బోయింగ్ 777 విమానాన్ని నడిపిన అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరోనా వేళ 'వందే‌భారత్' మిషన్‌లో భాగంగా టెస్టింగ్, వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేని సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి అమెరికా, ఇతర విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించారు.

ఆగష్టు 2021లో అఫ్ఘానిస్తాన్ తన గగనతలంపై నుంచి ప్రయాణించడానికి నిషేధం విధించింది. భారత్ నుండి నేరుగా అమెరికా, కెనడాకు విమానాలు నడపడానికి భారీగా జెట్ ఇంధనం ఖర్చవడంతో పాటు ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి భారత్ నేరుగా ఢిల్లీ నుండి నెవార్క్, న్యూయార్క్, చికాగోకు క్లిష్టమైన 'హిందూ కుష్' పర్వతశ్రేణుల మీదుగా విమానాలు నడపింది. ఈ సమయంలో జోయా పైలట్‌గా విధులు నిర్వహించారు. ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా ఒక గంట ప్రయాణ సమయం తగ్గడమే కాక, ప్రయాణానికి దాదాపు 14 టన్నుల జెట్ ఇంధనం ఆదా అయ్యింది.

Also read: ప్రత్యేకం మణిపూర్ మహిళ

విమానయాన సంస్థల తోడ్పాటు

1989లో ప్రపంచంలోనే అతి పిన్న వయసులో కమర్షియల్ ఎయిర్‌లైన్ కెప్టెన్‌గా ఘనత సాధించిన మరో భారతీయ మహిళ నివేదిత భాసిన్ మాట్లాడుతూ, తాను ఉద్యోగంలో చేరిన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. తాము ప్రయాణిస్తున్న విమానాన్ని ఒక మహిళా కెప్టెన్ నడుపుతున్నదన్న విషయం తెలిస్తే ప్రయాణికులు కంగారు పడతారని, వారికి కనబడకుండా కాక్‌పిట్‌లోకి వెళ్లమని సూచించేవారని అన్నారు. ఆమె కెప్టెన్‌గా మూడు దశాబ్దాలు విజయవంతంగా పూర్తి చేసింది. ఎందరో మహిళలు విమానయానరంగాన్ని తమ వృత్తిగా ఎంచుకోవడానికి ఎన్‌సీసీ ప్రేరణ కలిగిస్తోంది. ఎన్‌సీసీలోని వాయు విభాగం విద్యార్థులకు తేలికపాటి విమానాలు నడపడంలో శిక్షణ ఇస్తుంది. కమర్షియల్ పైలట్ శిక్షణలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రాయితీలు ఇస్తున్నాయి.

హోండా లాంటి కంపెనీలు ఉచిత శిక్షణ ఇప్పించడం తో పాటు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. ఇండిగో సంస్థ మహిళా పైలట్‌లకు, సిబ్బందికి గర్భవతులుగా ఉన్న సమయంలో గ్రౌండ్ విధులు నిర్వహించేలా వెసులుబాటు కల్పించింది. 26 వారాల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వడమే కాక, శిశువు సంరక్షణ కోసం 'క్రెచ్' (శిశు సంరక్షణా కేంద్రం) సదుపాయం కూడా కల్పిస్తుంది. విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా దాదాపు ఇలాంటి వెసులుబాటే కల్పిస్తున్నది. కొన్ని సంస్థలు రాత్రిపూట మహిళా సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు, భద్రత కోసం అంగరక్షకుడిని కూడా ఏర్పాటు చేస్తున్నాయి.


యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

88850 50822

Next Story

Most Viewed