ప్రశ్నించడం.. దేశద్రోహమా?

by Ravi |   (  Updated:2026-07-08 00:31:00  IST  )

ప్రజాస్వామ్యంలో విమర్శ, భిన్నాభిప్రాయం, నిరసన తెలిపే హక్కు ఎంత ముఖ్యమో, నిరుద్యోగం, పరీక్షల లీకేజీలు, పాలనా వైఫల్యాలపై ప్రశ్నించే స్వరాల పాత్ర ముఖ్యమే.

ప్రశ్నించడం.. దేశద్రోహమా?
X

గత పన్నెండేళ్లుగా మన దేశంలో ‘దేశభక్తి’ అనే అంశాన్ని దాదాపు ప్రతి విషయంతో ముడిపెట్టే ధోరణి పెరు గుతున్నది. దేశాన్ని ప్రేమించడం ప్రతి పౌరుడి సహజ లక్షణం. కానీ, అసలు దేశభక్తి అంటే ఏమిటి? దేశభక్తికి గీటురాయి ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వ్యక్తుల అవగాహన, దృక్పథాన్ని బట్టి మారుతుంటాయి. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అవినీతికి చెక్ పెడతామని హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రచారంలో మాత్రం వెలుగొందుతోంది. కానీ ఆచరణలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు, యువత జీవితం మాత్రం మొదలైన చోటే నిలిచిపోయినట్లు కనిపిస్తోంది. నిరు ద్యోగం, నియామక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థ నిర్వీర్యంపై ప్రశ్నించే వారిని ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశద్రోహులు’ అంటూ ముద్ర వేయడం మరింత పెరుగుతోంది. దేశంలోని వ్యవస్థల వైఫల్యాలపై జెన్ జీ యువత ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో వ్యంగ్య ఉద్యమాన్ని ప్రారంభించింది. దీనిని కూడా కొందరు ‘దేశద్రోహం’గా అభివర్ణించడం ప్రజా స్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. వ్యవస్థలోని అక్రమాలు, వైఫల్యాలను ప్రశ్నించేవారు దేశద్రోహులు ఎలా అవుతారు? సమాజ హితం కోసం పోరాడే యువతను, మేధావులను ‘బొద్దింకలు’ అంటూ అవమానించడం ఏ మాత్రం సమంజసం కాదు. లద్దాఖ్ పర్యావరణ పరిరక్షణ కోసం మంచు కొండల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన సోనమ్ వాంగ్‌చుక్, విద్యా వ్యవస్థలోని లోపాలపై సునిశితంగా ప్రశ్నించిన బిహార్‌కు చెందిన ఖాన్ సర్ వంటి వారు ప్రజల తరఫున వ్యవస్థ లను ప్రశ్నిస్తున్నారు. అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, లోపాలను సరిదిద్దే చర్యలు చేప ట్టడం, అవసరమైన సంస్కరణలకు పాలకులు నడుం బిగించడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత. అదే సరైన మార్గం. అది కాకుండా అణచివేత మార్గాన్ని ఎంచుకుంటే దాని పరిణామాలు సమాజానికే ప్రమాద‌కరంగా మారతాయి. అధికార బలంతో ప్రశ్నించే గొంతుకలను తాత్కాలికంగా అణచివేయవచ్చు. కానీ ప్రజల గుండెల్లో పేరుకుపోతున్న ఆవే దనను, అసంతృప్తిని ఎప్పటికీ అణచలేరు.

- కె.బాపురావు,

95533 07006

Next Story