సంతానోత్పత్తి తగ్గినా అభివృద్ధి సాధ్యమే!

by Ravi |   (  Updated:2026-07-12 01:00:57  IST  )

భారత్‌లో జననాల రేటు తగ్గుతుండగా వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న వృద్ధాప్య భారంతో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సవాళ్లు..

సంతానోత్పత్తి తగ్గినా అభివృద్ధి సాధ్యమే!
X

శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం దేశంలో జననాల రేటు అంతర్జాతీయ సగటు కన్నా తక్కువగా వుంది. ప్రపంచ జననాల రేటు 2.2 ఉంటే, దేశంలో 1.9గా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా దేశ జనాభా విస్పోటనం అందరిని కలవరపరచింది. నేడు ఆ పరిస్థితి తారుమారైంది. జననాలు తగ్గాయి.. అయితే తగ్గుదల దేశమంతా ఒకేలా లేదు. పట్టణ ఫెర్టిలిటి 1.5కు పడిపోయింది. గ్రామాల్లో కూడా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నప్పటికీ ఫెర్టిలిటీ 2.1గా వుంది. ఈ రేటు ఆశావహం.

హస్తినలో ఫెర్టిలైటీ అతి తక్కువగా 1.2 ఉండగా, తమిళనాడు, కేరళ, బెంగాల్‌లలో 1.3గా ఉంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో జననాల రేటు అమెరికా, జపాన్, ఫిన్లాండ్ దేశాల కంటే తక్కువన్నది గమనార్హం. ఉత్తర‌ప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో జననాల రేటు ప్రపంచ సగటు కన్నా కాస్త ఎక్కువగా వుంది. ఈ రాష్ట్రాల్లో జనాభా 56 కోట్ల పై మాటే. అలాగే సగటు సంతానోత్పత్తి 2.55. దేశంలో సంతానోత్పత్తి తగ్గుముఖం పట్టింది. కొన్ని రాష్ట్రాల్లో జనాభా క్షీణించగా, కొన్నింట మరో రెండు దశాబ్దాల పాటు నవతరాన్ని అందించగల కుటుంబ వ్యవస్థ నిలిచి వుంది.

అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ..

జనాభా పరివర్తన పెను సవాల్. దీన్ని స్వీకరించాలి. దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక రచించి, అమలు పరచాలి. బెల్జియం, ఫ్రాన్స్ తదితర పశ్చిమ యూరప్ దేశాలు 1760-1820 మధ్య కాలంలో పారిశ్రామిక దేశాలుగా అవతరించాయి. అనంతర కాలంలో జపాన్ ఇండస్ట్రియల్ కంట్రీగా ఎదిగింది. ఇవి పూర్తి స్థాయి పారిశ్రామిక దేశాలుగా స్థిరపడ్డాకనే ఆయా దేశాల్లో వృద్ధాప్య అల తాకింది. పారిశ్రామీకరణతో సంఘటిత ఉద్యోగ వ్యవస్థ కుదురుకొంది. విస్తృత పన్నుల వ్యవస్థ ఏర్పాటయింది. రిస్క్ ఎదుర్కొగల సంక్షేమ వ్యవస్థ ఏర్పాటు చేసుకొన్నారు. అయినప్పటికీ వృద్దాప్యం ఆ దేశాలను అతలాకుతలం చేసింది. ఒక్క జపాన్ దేశ ఋణం 200% పెరిగిందంటే ఏజింగ్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం. అయినప్పటికీ ఈ దశలోనే వృద్ధ జన దేశంగా పరివర్తన చెందింది. విపత్తులు తట్టుకొనే ఆర్ధిక స్థితి లేదని పర్ కెపిటా చెబుతోంది. పన్నుల వ్యవస్థ బలహీనం. ఆరు శాతం మంది మాత్రమే డైరెక్ట్ టాక్స్ చెల్లిస్తున్నారు. 28 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తెలంగాణా, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలే ధనిక రాష్ట్రాలు.. మిగతా 22 పేదవే.

కష్ట జీవులకు వృద్ధాప్య ఆర్ధిక భద్రత సున్నా..

ఇక ఉద్యోగ విఫణి భూమిక నెర్రలు విచ్చిన భూమి చందంగా వుంది. అధిక శాతం కార్మికుల జీవితాలు అసంఘటిత రంగంలోనే దుర్భరంగా గడచిపోతున్నాయి. కొంత మంది సెమీ ఇన్ఫార్మల్ రంగంలో పని చేస్తున్నారు. ఈ రంగాల కష్ట జీవులకు వృద్ధాప్య ఆర్ధిక భద్రత సున్నా. అమలులో ఉన్న ప్రభుత్వ సేఫ్టీ నెట్స్ దుర్భలత అమాత్యులకు ఎరుకే. నేటికీ ప్రభుత్వం అర్ధ వంతమైన ఆర్ధిక భద్రత కల్పించే దిశగా అడుగులు పడకపోవడం విచారకరం. అటల్ పింఛన్ యోజనతో అసంఘటిత కార్మికులకు ఒరిగేది నామమాత్రం. దశాబ్దాల కాలం పాటు డబ్బులు ఈ ఖాతాలో జమ చేయగల స్తోమత రోజు కూలీలకు ఉంటుందా?1995లో ప్రారంభించిన జాతీయ సామాజిక పింఛన్ స్కీమ్ 60-79 మధ్య వయసు వారికి 200 రూపాయలు ఇస్తున్నారు. 80 ఏళ్లు వస్తే 500 రూపాయలు ఇస్తారు. పేద వృద్ధులకు ఇంత తక్కువ మొత్తం సాయంతో ఆర్ధిక భద్రత కలుగు‌తుందా? నేటి ఖర్చులకు ఇది సరిపోతుందా? ఇది ప్రభుత్వానికి తెలియదనుకోగలమా?

వృద్ధులు ఎక్కువగా పెరిగితే..

భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబం తరాలుగా ఉంది. పిల్లల, వృద్దుల సేవలు మహిళలే చేశారు. ఇంక ఎన్నెన్నో వెలకట్టలేని సేవలు చేశారు. కాలం మారి పట్టణీకరణ, విద్య, అనేక సాంకేతిక సదుపాయాలతో పాటు, కుటుంబ ఖర్చులు, వలసలు, ఇంకా ఎన్నో అవసరాలు పెరిగి ఆ వ్యవస్థ దాదాపు కనుమరుగయింది. వృద్ధుల పరిస్థితి సంకట స్థితిలో పడింది. నేడు 60 పైబడ్డ వారు దేశంలో 150 మిలియనుల కంటే ఎక్కువే. 2050కి 350 మిలియనులకు చేరగలరని అంచనా. వయసు మళ్లిన వారు పెరిగితే ఆరోగ్య సేవల డిమాండ్ స్వభావం మారుతుంది. వేగంగా వృద్ధులు పెరిగే రాష్ట్రాల్లో శ్రామిక కొరత ఏర్పడుతుంది. యువ రాష్ట్రాల నుండి ఉద్యోగులను భర్తీ చేయాలి. యంగ్ స్టేట్స్ విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలపై దృష్టి సారించాలి. నైపుణ్యం ఉన్న యువతను సరఫరా చేయగలిగితే మంచి ఉపాధి లభిస్తుంది. ప్రజా వ్యవస్థలు ఈ సేవలు అందిస్తేనే తక్కువ సంతానోత్పత్తి వున్నా భవిష్యత్ స్థిరంగా సాగుతుంది.

-వి. వరదరాజు

94925 42033

Next Story