ఇంగ్లీష్ రాదు.. తెలుగు చదవలేరు.. అసర్ నివేదిక సంచలన రిపొర్ట్

by Disha edit |
ఇంగ్లీష్ రాదు.. తెలుగు చదవలేరు.. అసర్ నివేదిక సంచలన రిపొర్ట్
X

ప్రతమ్ ఎన్జీవో ఫౌండేషన్ వార్షిక నివేదిక అసర్ (ASER)రిపోర్ట్-2023 ప్రకారం భారత దేశంలోనీ 26 రాష్ట్రాల్లో 28 జిల్లాల్లో 34,745 మంది 14-18 వయసు గల వారిని సర్వే చేస్తే 42.7% ఇంగ్లీష్‌లో కనీసం రెండు వాక్యాలు చదువలేకపోతున్నారు. 2వ తరగతి పాఠ్య పుస్తకాలు ప్రాంతీయ భాషల్లో చదవడం లేదు. కేవలం 43% మాత్రమే అంకగణిత చతుర్విధ ప్రక్రియలు చేయగలుగుతున్నారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలు లోపించాయని స్పష్టంగా తెలుస్తుంది.

జాతీయస్థాయి ఫలితాలతో పోల్చుకుంటే తెలంగాణలో ప్రమాణాలు మరింతగా దిగజారాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 14-16 వయసు వారిలో 57.8%, 17-18 సం వయసు వారిలో 49.7% 2వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలు చదవలేకపోతున్నారు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. నివేదిక ప్రకారం బాలుర కన్నా బాలికలు భాషలోనూ, చతుర్విధ ప్రక్రియలను మెరుగైన నైపుణ్యాలు కలిగి ఉన్నారు.మౌలిక సౌకర్యాలు లేకపోవడం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం, పర్యవేక్షణ లోపించడమే దీనికి కారణం. విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పడిపోవడానికి కారణాలు అన్వేషించి వాటికి పరిష్కార మార్గాలు చూపాల్సిన అవసరం ఉంది.

విద్యా కమిషన్ సూచనలు అవసరం..

రాష్ట్రంలోని బాలలందరికీ నాణ్యమైన, సమగ్రమైన విద్యను అందించడానికి, ఉత్తమ పౌరులను తయారు చేయడానికి విద్యా కమిషన్ అవసరం. దీంతో ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను రాష్ట్రంలో అందించవచ్చు. రాబోయే తరాలకి ఎలాంటి విద్యను అందించాలో, పాఠ్య పుస్తకాల్లో, పాఠ్య ప్రణాళికల్లో చేయవలసిన మార్పులు, శాస్త్రీయ వైఖరులు పెంపొందించడానికి సూచనలు ఈ విద్యా కమిషన్ సూచనలు చేస్తుంది. అలాగే ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు విద్యా కమిషన్ దోహదపడుతుంది. అయితే, విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణాలను అన్వేషిస్తే మౌలిక సౌకర్యాలు లేకపోవడం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం, పర్యవేక్షణ లోపించడం, పూర్వ ప్రాథమిక, ప్రాథమిక బడులకు అనుసంధానం లోపించడం ముఖ్యంగా కనిపిస్తాయి. అందుకే విద్యార్థుల్లో ఆసక్తి కల్గించడానికైనా, ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్నా ముందుగా ప్రభుత్వం వీటిని పరిష్కరించాలి.

పుస్తకాలు చదివించడమే సమస్య

రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా గాని లేదా ఉన్నత పాఠశాలలు గాని మార్చాలి. అలాగే ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కోరత నివారించి నిబంధనలు కనుగుణంగా సబ్జెక్టు టీచర్లను నియమించాలి. ప్రతి ఉన్నత పాఠశాలకి తప్పనిసరిగా కంప్యూటర్ ఇన్స్పెక్టర్లను నియమించాలి. విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటు చాలా తగ్గిపోయింది స్మార్ట్ ఫోన్ వినియోగంలోకి వచ్చాక పుస్తకాలు చదవడం చాలా తగ్గించారు. పుస్తక పఠనం పెంచేలా పార్టీ ప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతున్నప్పటికీ కులాల వారీగా ఏర్పాటు చేసిన గురుకులాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉంది.వాటి పర్యవేక్షణ కూడా జిల్లా విద్యాశాఖాధికారులే చేసేలా మార్పులు చేయాలి.

రాష్ట్రంలో విద్యారంగ కేటాయింపులు గతంతో పోల్చుకుంటే ఈ బడ్జెట్ లో పెరిగినప్పటికీ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఈ కేటాయింపులు సరిపోవు. రాబోయే బడ్జెట్లో ఢిల్లీ, కేరళ మాదిరిగా విద్యకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. గాడి తప్పిన ప్రభుత్వ విద్యారంగాన్ని గాడిన పెట్టే బాధ్యత నూతన ప్రభుత్వంపై ఉంది.

పాకాల శంకర్ గౌడ్

విద్యా వేత్త

98483 77734



Next Story

Most Viewed