పేరు మార్పుతో పతనం!

by Disha edit |
పేరు మార్పుతో పతనం!
X

భారతదేశంలో 140 కోట్ల మందిని ప్రభావితం చేసే ఎన్నికలు ఇప్పుడు జరిగాయి. ఈ ఎన్నికలు 2024 ఏప్రియల్‌లో జరిగే భారత పార్లమెంటు ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని చెప్పుకుంటున్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణలో కుటుంబ పాలనను, తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు. ఆయన అంతర్గతంగా వెలమలను కూడా ఆర్గనైజ్ చేసి వెలమల సామ్రాజ్యపత్యంగా నడిపాడు. కులం, కుటుంబం ఈ రెండే రాజకీయ నాయకుల వ్యక్తిత్వాలను భారతదేశంలో విధ్వంసం చేశాయి. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఉద్యమ నాయక లక్షణాలన్నీ అంతరించిపోయాయి. కూతురు కవితను ఎక్కువగా ప్రేమించాడు. ఆమెను లిక్కర్ స్కాం నుండి బయట పడేయటానికి బీజేపీతో చేతులు కలిపాడు. ఒకనాడు మోడీని ఎదిరించిన ఒక ముఖ్యమంత్రిగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు అందరూ కేసీఆర్‌ను అభినందించారు. నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు బానిస అని, మతోన్మాద చర్యలకు పాల్పడుతున్నాడని, భారతదేశాన్ని అదానీ గ్రూపులకు అమ్ముతున్నాడని, కాంగ్రెస్ కూడా నిలదీయలేనంత బలంగా మోడీని నిలదీశాడు. దీంతో భారతదేశం మొత్తం ఒక్కసారిగా కేసీఆర్ వైపు చూసింది.

ప్రజలు చైతన్యవంతులవడంతో..

నిజానికి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును దెబ్బకొట్టి బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలంగాణా ప్రజల హృదయాల నుండి అప్పుడే తొలగిపోవడం ప్రారంభించాడు. నిజానికి తానొక చక్రవర్తిలా, కొడుకు ఒక యువరాజులా, అల్లుడు హరీష్‌రావు మరొక యువరాజులా వ్యవహరించి తెలంగాణ మా జాగీరు అన్నట్లు వ్యవహరించారు. అంతర్గతంగా వెలమ పారిశ్రామిక, భూస్వాములు తెలంగాణ సంపదనంతా దురాక్రమించడానికి అనేక వ్యూహాలు పొందాడు. ధర్నా చౌక్‌ను పరిపాలనకు వచ్చిన వెంటనే మూసివేయడంతో ఆయన అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనా బయటకు వచ్చేసింది. ప్రజలకు మాట్లాడే హక్కు, పోరాడే హక్కు చర్చించే హక్కును కాలరాశారు కేసీఆర్! రాజ్యాంగం హక్కులను కాలరాసినందుకు ఇందిరా గాంధీనే గద్దె దించారు ప్రజలు. దేశంలోని ప్రజలకు నియంతను భరించే శక్తి లేదు. అందుకే తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికల్లో చైతన్యవంతంగా వ్యవహరించారనక తప్పదు. కేసీఆర్ కుటుంబం పూర్తిగా నీతి తప్పింది. పైగా కుమార్తెను రక్షించడం కోసం బీజేపీతో కలవడం రాజకీయాల్లో పూర్తిగా దిగజారుడు లక్షణం. ఇకపోతే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు సూత్రాలు ఎంతో కొంత పనిచేశాయి. ముఖ్యంగా సోనియా గాంధీ నుండి స్త్రీని కేంద్రంగా చేసుకున్న హామీలు కొంత ప్రభావితం చేశాయి. ప్రధానంగా స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది, ప్రభుత్వ ఉద్యోగాలు దళిత బహుజనులకు ఇస్తాం అనేది బాగా ప్రభావితం చేశాయి.

కాంగ్రెస్ తీరు మారాలి

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సీట్లు ఇచ్చేటప్పుడు సామాజిక న్యాయం పాటించలేదు. స్త్రీలకు 33% అన్నారు. అతి తక్కువ సీట్లు ఇచ్చారు. అలాగే రెడ్లకు సీట్లు ఎక్కువ ఇచ్చారు. బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చారు. నిజానికి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ రెడ్ల రాజకీయ ఆధిపత్య పార్టీలా ఉంది. అయితే ఇప్పుడు వారు సామాజిక న్యాయం చేస్తాం అంటున్నారు. దళితులు, స్త్రీలు, మైనార్టీలు కాంగ్రెస్‌కు గిరిజనులు, ఆదివాసీలు కూడా ఓటింగ్ ఎక్కువ వేశారు. దళిత క్రిస్టియన్లు అయితే కాంగ్రెస్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన పాదయాత్రలో వాళ్ళు పాల్గొన్నారు. అయితే స్పష్టంగా హిందూ మతోన్మాదానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా లేకపోవడం కూడా బీజేపీ ఓటింగ్ పెరగడానికి కారణం అయ్యింది.

ఆ మార్గమే రాజ్యాధికార దిక్సూచి..

కులాధిపత్యాన్ని అంబేడ్కర్ తీవ్రంగా నిరసించారు.భారతదేశానికి ‘కులం’ ఒక శాపం వంటిది. ఇది బహు రూపాలలో బానిస జాతిగా తయారుచేసింది. సనాతన కుల వైషమ్యాలు అలా ఉండగానే ఇప్పుడు రాజకీయ విభేదాలు వీటికి తోడయ్యాయి. భారతీయులు తమ దేశం కంటే కుల, మత రాజకీయ భేదాలకు అధిక ప్రాధాన్యత ఇస్తే తిరిగి మనం స్వాతంత్య్రాన్ని కోల్పోవడం తధ్యం. చాతుర్వర్ణ సిద్ధాంతం నశించాలి. సవర్ణులు సకల భోగాలను అనుభవించడం, నిమ్నజాతివారు పరమ దరిద్రులుగా నశించిపోవడం నేను సహించను. రాజ్యాధికారాన్ని మన స్వహస్తాలలోకి తీసుకుంటేనే తప్ప నిమ్న వర్గాల సమస్యకు ఎప్పటికీ పరిష్కారం దొరకదని మనం గట్టిగా విశ్వసిస్తున్నాము'' అని అంబేడ్కర్ చెప్పారు. ఆయన ఆలోచనలతో రాబోయే ప్రభుత్వాలు నడిచినప్పుడే ప్రజలకు విముక్తి కలుగుతుంది. అది అత్యాసే అనుకున్నప్పుడు బహుజనులు రాజ్యాధికారం కోసం సన్నద్ధులు కండి. మన ఓటు మనం వేసుకోవడం ద్వారానే సామాజిక, సామ్యవాద, రాజకీయ పరిపాలన వ్యవస్థ ఏర్పడుతుంది. అంబేడ్కర్ మార్గమే అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ రాజ్యాధికార దిక్సూచి. ఆ మార్గంలో నడుద్దాం.

డాక్టర్ కత్తి పద్మారావు

దళిత ఉద్యమ నేత

98497 41695


Next Story

Most Viewed