బీసీల పట్ల బీజేపీకే చిత్తశుద్ధి!

by Disha edit |
బీసీల పట్ల బీజేపీకే చిత్తశుద్ధి!
X

స్వాతంత్ర పోరాటం, తెలంగాణ తొలి దశ పోరాటం మొదలుకొని నేటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ పోరాటం వరకు అమరులైన వారిలో, ఆత్మార్పణ చేసిన వారిలో బడుగు బలహీన వర్గాల త్యాగాలే అత్యధికం. వారి దృఢ సంకల్పం, త్యాగాల పునాదులపైనే నేటి సమాజం విరాజిల్లుతోంది. త్యాగాల తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో యాభై రెండు శాతానికి పైగా వున్న బీసీల స్థితిగతులలో గుణాత్మకమైన మార్పులు నేటికీ సాధించకపోవడం శోచనీయం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనే నినాదంతో సమిష్టిగా పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అధికారం ఒక్క కుటుంబం పాలైంది. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో సమాజంలో సమగ్ర వర్గాల అభివృద్ధి కొరవడి, బీసీల పరిస్థితి కేవలం గొర్రెలు, బర్రెలు, చేపలు, ఉచిత విద్యుత్తు, కొన్ని కులాలకు ఒక లక్ష రూపాయలు అనే తాత్కాలిక తాయిలాలకే పరిమితమైంది. బీసీ ఆత్మగౌరవ భవనాల పేరుతో బీసీ కులాల ఓట్లను దండుకునేలా వాయిదాల పద్దతిలో దాటవేసే ధోరణి తప్ప కార్యాచరణే కానరావడంలేదు. తాత్కాలిక సర్దుబాట్లు, ఎన్నికల మాటలతో తెరాస ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతూ బీసీలను చిన్నచూపు చూస్తూ అవసరానికి వాడుకుంటోంది.

వారిపై చిత్తశుద్ధితో

మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అన్ని వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో సంస్కరణలు చేపట్టి, బీసీలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించింది. ఓబీసీ క్రీమిలేయర్‌ను ఆరు లక్షల రూపాయల నుండి ఎనిమిది లక్షల రూపాయలకు పెంచింది. సైనిక్, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలలో ఓబీసీ విద్యార్థులకు 27% రిజర్వేషన్లు అమలు చేసింది. ఓబీసీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఆదాయ పరిమితిని పెంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు అందజేస్తోంది. ఓబీసీ విద్యార్థుల కోసం జేఆర్ఎఫ్ స్థాయి జాతీయ ఫెలోషిప్ నెలకు రూ.31,000, ఎస్ఆర్ఎఫ్ స్థాయి వారికి నెలకు రూ.35,000 అందజేస్తోంది. విదేశీ చదువుల కోసం విద్య రుణాలు తీసుకునే ఓబీసీ విద్యార్థులకు వడ్డీ రాయితీని బీజేపీ ప్రభుత్వం క్రమబద్దీకరించింది. నీట్‌లో ఓబీసీ విద్యార్థులకు 27% రిజర్వేషన్లు కల్పించింది. కేవీఐసీని బలోపేతం చేసి ఓబీసీలకు శిక్షణనిచ్చి సమర్థవంతులుగా తీర్చిదిద్దడమే గాక అత్యంత విలువైన అత్యాధునిక పరికరాలను, యంత్రాలను ఉచితంగా అందజేస్తోంది.

అలాగే, ఓబీసీ వెంచర్ క్యాపిటల్ ఫండ్, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, ఈపీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన వంటి ప్రత్యేకమైన పథకాలు ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 3500కు పైగా ఉన్న బీసీ కులాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఆయా బీసీ కులాలకు భిన్నమైన సమస్యలుంటాయని గుర్తించి 105 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓబీసీల జాబితాను రూపొందించే హక్కును కేంద్రం ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. డబ్బులతో ప్రమేయం లేకుండా బడుగు, బలహీన వర్గాల వారికీ గ్రామ సర్పంచ్ స్థాయి మొదలుకొని ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ స్థాయి వరకు బీజేపీ తమ పార్టీలో టిక్కెట్లు ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దుతోంది. బడుగు, బలహీన వర్గాల వారికీ రాజ్యాంగబద్ధమైన పదవులనిచ్చి, నామినేటెడ్ పదవులనిచ్చి గౌరవిస్తోంది. దేశచరిత్రలోనే మొట్టమొదటిసారి అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూనే, 27 మంది ఓబీసీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడమే గాక వారిలో ఐదుగురిని క్యాబినెట్ మంత్రులను చేయటం సమాజంలోని అన్నివర్గాలతో పాటు బీసీల పట్ల బీజేపీ ప్రత్యేక చిత్తశుద్ధికి నిదర్శనమైంది.

బీసీ రిజర్వేషన్లకు గండికొట్టి..

ఇలా నిష్పక్షపాతంగా అన్నివర్గాల అభివృద్ధి కోసం బీజేపీ ప్రయత్నిస్తుంటే తెలంగాణాలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వారి అవసరాల కోసం అన్నివర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. బీసీలను బీఆర్ఎస్ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించడం పరిపాటిగా మారింది. బీసీలను ఎన్నికలకు ముందు హామీలతో మభ్యపెట్టి, కట్టడిచేసి విధానాన్ని అలవర్చుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు గండికొట్టింది. బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసినా చట్టబద్దత మరిచి కాలయాపన చేస్తున్నది. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్‌లకు నిధుల కేటాయింపులే తప్ప ఖర్చు చేసింది మాత్రం అత్యల్పమే. అలాగే తమ మంత్రివర్గంలో గానీ నామినేటెడ్ పదవులలో గానీ కేవలం కొన్ని బీసీ కులాలకు, అదీ అత్యల్ప సంఖ్యలో అవకాశమిచ్చి బీసీలను దెబ్బతీస్తోంది. వారికి రాజ్యాధికారంలో సైతం సముచిత స్థానం కల్పించడమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టింది.

దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు దాదాపు కుటుంబానికి లేదా సమాజంలోని అగ్రవర్ణాలకు, మైనారిటీలకు మాత్రమే సంస్థాగతంగా అధ్యక్ష పదవులు కట్టబెట్టాయి. అయితే సంస్థాగత బాధ్యతలలో బడుగు బలహీన వర్గాలకు కూడా తమ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత, జాతీయ అధ్యక్ష బాధ్యతలే గాక మరెన్నో అత్యున్నతమైన బాధ్యతలిచ్చి గౌరవించడం కేవలం బీజేపీకే సాధ్యమైంది. 60 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పరిపాలనను, పది సంవత్సరాలుగా తెలంగాణను పాలిస్తున్న టీఆర్ఎస్ పాలనను, ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పాలనను నిశితంగా గమనిస్తున్న తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి బీసీలు బీజేపీ వైపు దృష్టిసారిస్తున్నారు. బీసీల సాధికారత, ప్రగతి బీజేపీతోనే సాధ్యమని బలంగా విశ్వసిస్తున్నారు.

సిలివేరు శంకర్ ప్రజాపతి

బీజేపీ ఓబీసీ మోర్చా

94417 37171


Next Story

Most Viewed