భూమిబంధు వర్సెస్ రైతుబంధు

by Disha edit |
భూమిబంధు వర్సెస్ రైతుబంధు
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కచ్చితంగా గతం కంటే వ్యవసాయం మెరుగైంది, కానీ జరగవలసింది చాలా ఉంది. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరా? లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పుణ్యమా? అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ స్థానంలో ఇంకో ముఖ్యమంత్రి, ముఖ్యంగా బీజేపీ ముఖ్యమంత్రి ఉండి ఉంటే సమగ్ర వ్యవసాయం (వ్యవసాయం, సూక్ష్మ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, మత్స్యసంపద, అమూల్ లాంటి పాలసంస్థలు, ఫార్మర్ ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పశుసంపద, హార్టీకల్చర్, విదేశీ వ్యవసాయం) ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.

రాజకీయ నాయకులకు రైతు ఎప్పుడు ఒక కాష్కౌ (డబ్బులిచ్చే ఆవు) లాంటివాడు. ఎవరికీ రాజకీయ భవిష్యత్తు కావాలన్నా, మెండుగా సొమ్ముచేసుకోవాలన్నా, వాడుకునేది రైతుపేరునే. ఎప్పుడు అరకకట్టనోడు, బురదమడిలో కాలుపెట్టనోడు, మోటబాయి అంటే తెలవనోడు, రైతుకష్టాలు ఎరగనోడు, వందల, వేల ఎకరాల భూస్వాములు అందరు నేను రైతు బిడ్డను అని బిల్డప్ ఇచ్చుకుంటారు . ఫార్మ్‌హౌస్‌లకు, పంటభూములకు తేడా తెలవనోడు కూడా నేను రైతును అని రాద్ధాంతం చేస్తారు. ఇక ప్రజల సొత్తుతో ఇచ్చే రైతుబంధు (భూమిబంధు) ఏదో కొట్లాడి పానిపట్టు యుద్ధంలో గెలిచినట్లు ఊరూరా డప్పుకొడతారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రైతుబంధునా లేక భూమిబంధునా?

ముఖ్యమంత్రి కేసీఆర్‌ని హిట్లర్ మీడియా మంత్రి గోబెల్స్ ఆత్మ పరిపూర్ణంగా ఆవరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్లర్ యూదులను ఊచకోత కోసి, అది వారిమేలు కోసమే చేశాను అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. రైతుబంధు ఒక తెలివైన పథకం. పేరు రైతుది, ఫలితం మాత్రం అత్యధిక భూమి ఉన్న భూస్వాములది. మొదట రూ, 12,000 కోట్లతో మొదలై ప్రస్తుతం రూ.15,000 కోట్లకు (పత్రికా ప్రకటన) చేరింది. మొదట 50 లక్షల మంది రైతులకు చెందేది ప్రస్తుతం అనూహ్యంగా 70 లక్షల రైతులకు ఈ పథకాన్ని పొడిగించారు. ఎకరాకు రూ.4000 లతో మొదలై, ఇప్పుడు ఎకరాకు 5000 రూపాయలు చొప్పున, ఏడాదికి 10,000 రూపాయలు చెల్లిస్తున్నారు. రైతు, వ్యవసాయం సంబంధం లేకుండా, సాగుచేసిన, సాకిలపడుకున్న, గుట్టలైనా, పుట్టలైనా, రాళ్లయినా , రప్పలైనా అర్హులు, అనర్హులు అనే తేడా లేకుండా కాకులనుకొట్టి, గద్దలకు పంచినట్టు, కనీసం ఏడాదికి 5000 కోట్లు అప్పనంగా అనర్హులకు దోచిపెడుతున్నారు.

రైతుబంధు అనిచెప్పే భూమిబంధు గురించి కొన్ని నిజాలు

1) భూమిఉన్నోడే రైతు కాదు, రైతులందరికీ భూమి ఉండాలని లేదు.

2) తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 లక్షలమంది రైతులు (భూ యజమానులతో కలసి) ఉంటే అందులో 35 లక్షలకు సగటున 1 ఎకరం, (3,500 కోట్లు), 13 లక్షలు రైతులకు సగటున 2 ఎకరాలు (2-5 ఎకరాలు) మొత్తం 45 లక్షల ఎకరాల భూమి అంటే 4,500 కోట్లు, ఇక కేవలం 7 లక్షలమందికి 70 లక్షల ఎకరాలు అంటే సింహభాగం 7000 కోట్లు దక్కుతుంది.

3) మొదట 50 లక్షలమంది ఉన్న భూయజమానులు ఇప్పుడు 70 లక్షలు అయ్యారు. కారణం వందలు, వేల ఎకరాలు ఉన్నభూస్వాములు తెలివిగా తమ భూమిని అందరూ కుటుంబసభ్యుల పేరు మీద తక్కువ చూపెట్టడానికి డివిజన్ చేసుకుంటున్నారు.

4) భూమిబందు పేరుమీద ఖర్చుపెట్టే రూ. 15,000 కోట్లలో అయిదు లేక ఆరు వేల కోట్లు భూస్వాములకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు, రియల్ఎస్టేట్ ఓనర్లకు దక్కుతుంది.

5) రాష్ట్రంలో వ్యవసాయం చేసేవారిలో 35.6 శాతం కౌలురైతులు ఉంటే, అందులో 69% మంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.

6) రాష్ట్రంలో రైతుభీమా పేరిట దాదాపు 35 లక్షల మంది రైతులకు 5 లక్షల భీమాచేస్తే, ఒక కుంట భూమిలేని 3 కోట్లమందికి ఒక్క రూపాయి భీమా లేదు.

కేసీఆర్ భూమిబంధు పేరుమీద మిగతావన్నీ బందుపెట్టిన వైనం!

నిజాయితీ లేని ,ప్రచారమే లక్ష్యం అయిన కేసీఆర్ పాలసీల వలన తెలంగాణ రైతు ఆదాయంలో దేశంలో 25వ ర్యాంకులో, అప్పుల్లో 5 ర్యాంకులో ఉంటోంది. రోజుకు రైతుకు దక్కేది 313 రూపాయలు (భవన నిర్మాణ కార్మికుల వేతనం రోజుకు రూ. 600 -700), ఇంకా ఒక్కోరైతు అప్పు సగటున రూ. 1.53 లక్షలకు పేరుకుపోయింది.

ఇక కేసీఆర్ బందుపెట్టిన ఇతర స్కీములు

1) పంటబీమాకు మంగళం (అతివృష్టి, అనావృష్టి సమయంలో పంట నష్టం)

2) సూక్ష్మపంట డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ స్వాహా

3) ఆర్గానిక్ వ్యవసాయానికి నిరాదరణ

4) సమీకృత వ్యవసాయానికి సున్నా

5) పాల ఉత్పత్తుల ప్రోత్సాహం గుండుసున్నా

6) రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తుల సంఘాలకు నిరాదరణ

మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పథకం వివరాలు

ఎరువుల సబ్సిడీ: 2014 ముందు ఎరువుల కొరత, బ్లాక్ మార్కెట్ సర్వసాధారణంగా ఉండేది. కానీ మోడీ అధికారం లోకి వచ్చాక యూరియా, డిఎపి ఎరువులు అసలు కొరత లేకుండా అందించారు. ఒకఎకరానికి, ఒకకారుకు ఎరువులపై దాదాపు రూ. 6000లను సబ్సిడీ ఇస్తున్నారు.

2) కిసాన్ సమ్మాన్ నిధి: ఒక్కోరైతుకు ₹6000 (రైతుకు ఒక కుంటభూమి ఉన్నా ఈ సబ్సిడీ అందిస్తున్నారు)

3) ప్రధానమంత్రి పంటభీమా : పంటనష్టం జరిగినప్పుడు రైతులు నష్టపోకుండా పంటభీమా వల్ల దాదాపు రూ. 1,29,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించారు. రైతు కేవలం 1.5% ప్రీమియం చెల్లించాలి , మిగతాది కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు 50: 50 పద్ధతిలో చెల్లిస్తాయి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణప్రభుత్వం ప్రీమియం చెల్లించడం ఇష్టంలేక చేతులు దులుపుకున్నారు. సగటున ఎకరాకు 2000 రూపాయలు మోడీ ఇస్తున్నారు.

4) రైతువడ్డీ సబ్సిడీ స్కీం : వ్యవసాయానికి స్వల్పకాలిక రుణాల కింద 5 -7% వడ్డీ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 19,800 కోట్లు ఏడాదికి ఖర్చుపెడుతుంది. అలానే దీర్ఘకాలిక వ్యవసాయలోన్లు తీసుకుంటే 2 కోట్ల వరకు, 7 సంవత్సరాల వ్యవధిపై 3% వడ్డీ సబ్సిడీని ఇస్తోంది.

5) రైతు రుణాలు : రైతులు వడ్డీవ్యాపారుల బారిన పడకుండా కేవలం 2022 లోనే 14.6 లక్షల కోట్ల రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరిగింది. అలానే అందులో 4% వడ్డీ కేంద్రం భరిస్తుంది. సకాలంలో అప్పు చెల్లిస్తే 7% వడ్డీ భరిస్తుంది. ఇది ఏడాదికి 20,000 - 30,000 కోట్ల ఖర్చు కేంద్రం భరిస్తుంది.

6) ఆయిల్ పామ్ : దేశంలో వంటనూనె దిగుమతి తగ్గించటానికి పామ్ఆయిల్ సాగు కోసం ఎకరాకు రూ. 36,000 సబ్సిడీ ఇస్తోంది. అలానే అంతర పంటలకు ఒక్కో హెక్టర్ (2. 5 ఎకరాలకు) మోటార్ , డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ. 50,000 సబ్సిడీ ఇస్తుంది.

రైతుకు, సేద్యానికి సంబంధం లేని రైతుబంధు

కౌలురైతుకు సంబంధంలేకుండా భూమిఉన్న ప్రతి భూయజమానికి లబ్దిపొందేలా కేసీఆర్ రైతు బంధును అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 14,000 కోట్లు ఖర్చుపెడితే, అందులో కనీసం రూ. 5,000 కోట్లు అనర్హులకు దోచిపెడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అమలుచేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సంయోజనతో సహా అన్ని వ్యవసాయ సబ్సిడీలు కలుపుకుంటే ఎకరాకు ఏడాదికి తక్కువలో తక్కువ, దాదాపు రూ. 60,000 ఖర్చుపెడుతున్నారు. ఇది కేవలం వ్యవసాయం చేసే రైతుకు, కౌలురైతుకు ఉపయోగం. దీనివలన రైతేరాజు అనే నినాదం మోడీ విధానంగా ఉంటోంది. ఇది కేవలం నినాదం కాదు. ఈరోజు ఎరువుల కొరత లేదు, గోదాములు ఫుల్లుగా ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు విరివిగా పెరుగుతున్నాయంటే దానికి నరేంద్రమోడీ అమలు చేస్తున్న విధానాలు కారణం. ఇక రైతుల పేరుచెప్పి ప్రాజెక్టుల పేరుమీద వేలకోట్లు దండుకోవడం, కేంద్రం అప్పనంగా ఇచ్చే ఉచిత బియ్యం రీసైక్లింగ్ చేయించి వేల కోట్లు గాదెకింద పందికొక్కుల్లా మెక్కేవారికి కాపలాకాసే నాయకులు కారు మోడీ.

డాక్టర్ బూరనర్సయ్య గౌడ్

మాజీ ఎంపీ - బోనగిరి

95505 55400

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

ఏపీపై కేసీఆర్ ఫోకస్.. ప్రజాభిప్రాయం కోసం సర్వే!



Next Story

Most Viewed