కాంగ్రెస్ పునర్ వైభవానికి ఒకప్పుడు వాడిన ఫార్ములా! నేడు అవసరమేనా?

by Disha edit |
కాంగ్రెస్ పునర్ వైభవానికి ఒకప్పుడు వాడిన ఫార్ములా! నేడు అవసరమేనా?
X

1962లో చైనాతో యుద్ధం తరువాత 1963లో జరిగిన ఎన్నికలలో పార్టీ బద్ధ వ్యతిరేకులు జేబీ కృపలానీ, రామ్‌మనోహర్ లోహియా గెలుపొందడంతో నెహ్రూ ప్రభుత్వం ప్రతిష్ట మసకబారిందని భావించారు. పార్టీ పునరుత్తేజానికి 'కామరాజ్ ఫార్ములా'ను అమలు పరిచారు. దీని ప్రకారం సీనియర్ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేసి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి. ఈ ఫార్ములానే అప్పుడు పార్టీ పునరుత్తేజానికి ఉపయోగపడింది. ఇప్పుడదే పరిస్థితిని పార్టీ ఎదుర్కొంటుంది. అందుకే, మరోసారి కామరాజ్ ఫార్ములా వంటి వ్యూహాంతో ప్రజలలోకి రావాలి. ప్రశాంత్‌కిషోర్ వంటి వ్యూహకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకోలేకపోయింది. ప్రణబ్‌ముఖర్టీ తర్వాత పార్టీకి వ్యూహకర్తలు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం యాత్రతోనే అద్భుతాలు జరుగుతాయని నమ్మితే అది తప్పిదమే అవుతుంది.

దేశాన్ని అత్యధిక కాలం పాలించి చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నడూ లేనంతగా రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నది. 1969లో రెండుగా చీలిపుడుగానీ, 1975లో ఎమర్జెన్సీ తర్వాత ఓటమి చెందినపుడుగానీ, 1992లో రాజీవ్‌గాంధీ మరణం తరువాతగానీ పార్టీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో వరుస ఓటముల తరువాత మాత్రం కోలుకోలేక పోతున్నది. నాయకత్వ సమస్యలతో తన ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నది.

ఒకనాడు దేశాన్ని ఒంటి చేతితో ఏలిన పార్టీ నేడు లోక్‌సభలో కేవలం 52 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను సైతం పొందలేని స్థితికి చేరింది. బీజేపీ అంటున్నట్లు 'ముక్త్ భారత్' నినాదం వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు కన్పిస్తున్నది.

వారి ప్రభావం పడకుండా

2014లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్, అప్పటి నుంచి పార్టీ పునరుత్తేజానికి చేపట్టిన చర్యలు పెద్దగా లేవు, ప్రజా సమస్యలపై పోరాడిన దాఖలాలూ లేవు. దశాబ్దాలుగా అధికారానికి అలవాటుపడిన కాంగ్రెస్ ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా నిలబడలేకపోయింది. 2019 ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడింది. ఈ సమయంలో బీజేపీ మత, భాష, విద్వేష రాజకీయాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి యత్నాలు ప్రారంభించింది. దీనికి ప్రతిగా ఐక్యత కోసం, విద్వేష రాజకీయాలను ఎదిరించడం కోసం 'రాహుల్‌గాంధీ' కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 12 రాష్ట్రాల గుండా 3,570 కిలోమీటర్ల మేర 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించారు. ఈ యాత్ర ఆ పార్టీకి పూర్వ వైభవం తెస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

ఈ యాత్రతో ఇపుడు ఆదరణ పెరిగినట్టు కనిపిస్తున్నది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీ బలం పుంజుకుంటుందని భావిస్తున్నారు. యాత్ర ప్రారంభానికి ముందే సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసినా, ప్రారంభమయ్యాక గోవాలో ఎనిమిది మంది శాసనసభ్యులు బీజేపీలో చేరినా దాని ప్రభావం యాత్రపై పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ యాత్ర పార్టీని బలోపేతం చేయడమే కాక రాహుల్ నాయకత్వంపై ప్రజలలో విశ్వాసాన్ని పెంచుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. ఈ యాత్ర పార్టీకి సంజీవని లాంటిదని, యాత్ర తరువాత కొత్త జవసత్వాలు కాంగ్రెస్ గొంతుకగా మారుతాయని అనుకుంటున్నారు.

ఆ అపవాదు రాకుండా

1885 నుంచి ఇప్పటివరకు పార్టీకి గాంధీ కుటుంబేతరులు 11 మంది అధ్యక్షులుగా వ్యవహరించారు. అయినా, గాంధీ కుటుంబమే పార్టీ మీద బలమైన ముద్ర వేయగలిగింది. 1998-2017 వరకు సోనియాగాంధీ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమె కాలంలో పార్టీ వరుసగా అధికారంలోకి వచ్చింది. 2017లో రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక దారుణమైన ఓటములను చవిచూసింది. దీంతో ఆయన రాజీనామా చేశారు. సోనియా తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

బలమైన నాయకత్వం అవసరమని భావించిన జి-23 నేతలు రాహుల్‌ను చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించమని కోరారు. ఆయన సుముఖంగా లేకపోవడంతో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపాలని నిశ్చయించారు. 'పరివార్ పార్టీ (కుటుంబ పార్టీ)' అనే బీజేపీ విమర్శకు సమాధానంగా ఉండాలనుకోవడం కూడా ఇందుకు ఒక కారణం. అధ్యక్ష పదవికి శశిధరూర్, మల్లికార్జున్ ఖర్గే నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికలు ఈ నెల 17న జరిగి 19 న ఫలితాలు వస్తాయి. అయితే, గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు ఉన్నా గాంధీ కుటుంబం కనుసన్నలలోనే పని చేస్తారనే అపవాదు రాకుండా చూసుకోకపోతే దీంతో పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఆ ఫార్ములా ఉపయోగించి

1962లో చైనాతో యుద్ధం తరువాత 1963లో జరిగిన ఎన్నికలలో పార్టీ బద్ధ వ్యతిరేకులు జేబీ కృపలానీ, రామ్‌మనోహర్ లోహియా గెలుపొందడంతో నెహ్రూ ప్రభుత్వం ప్రతిష్ట మసకబారిందని భావించారు. పార్టీ పునరుత్తేజానికి 'కామరాజ్ ఫార్ములా'ను అమలు పరిచారు. దీని ప్రకారం సీనియర్ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేసి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి. ఈ ఫార్ములానే అప్పుడు పార్టీ పునరుత్తేజానికి ఉపయోగపడింది. ఇప్పుడదే పరిస్థితిని పార్టీ ఎదుర్కొంటుంది.

అందుకే, మరోసారి కామరాజ్ ఫార్ములా వంటి వ్యూహాంతో ప్రజలలోకి రావాలి. ప్రశాంత్‌కిషోర్ వంటి వ్యూహకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకోలేకపోయింది. ప్రణబ్‌ముఖర్టీ తర్వాత పార్టీకి వ్యూహకర్తలు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం యాత్రతోనే అద్భుతాలు జరుగుతాయని నమ్మితే అది తప్పిదమే అవుతుంది. పార్టీ పునరుత్తేజానికి సంఘటితంగా పోరాడాలి. 2024 లోక్‌సభ సాధారణ ఎన్నికలకు ముందు వచ్చే కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల ఎన్నికలలో గెలిస్తే లోక్‌సభ ఎన్నికలలో పార్టీకి కొంత సహాయంగా ఉంటుంది.


డా. తిరునహరి శేషు

రాజకీయ విశ్లేషకులు

కేయూ, వరంగల్

98854 65877


Next Story

Most Viewed