నూతన సంస్కరణలతో బీజేపీ పార్టీకి వచ్చే మూడు ప్రయోజనాలేంటి?

by Disha edit |
నూతన సంస్కరణలతో బీజేపీ పార్టీకి వచ్చే మూడు ప్రయోజనాలేంటి?
X

ధరల విషయంలో నియంత్రణ లేక స్థానిక విద్యుత్ సంస్థలు దివాళా తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ రంగంలో శాశ్వత ఉద్యోగాలకు స్థానం ఉండదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ అయ్యే అవకాశాలను కోల్పోతారు. కరెంటు కొరత ఏర్పడితే గ్రామీణ ప్రాంతాలకు ముందుగా కోతలు విధిస్తారు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వవు. ఇది ప్రజలకు అన్ని విధాలుగా అత్యంత హానికరమైనది. ఈ వ్యవస్థను ప్రతిఘటించడానికి విశాలమైన ప్రజాసమూహాల మద్దతు కలిగిన బలమైన కార్మికోద్యమాల నిర్మాణం జరగాలి. నిలకడ కలిగిన సమరశీల పోరాటాలే పరిష్కార మార్గం.

కేంద్ర ప్రభుత్వం 2022 ఆగస్టు 8న విద్యుత్ చట్ట సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనికి దేశంలో ప్రజల నుండి, కొన్ని రాష్ట్రాల నుండి నిరసన వ్యక్తమవుతోంది. వాస్తవానికి 'విద్యుత్ చట్ట సవరణ బిల్లు-2020' మే 17న ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. బిల్లుకు అవసరమైన సూచనలను, సలహాలను కోరుతూ జూన్ 5 వరకు గడువు ఇచ్చింది. ప్రభుత్వాలు సలహాలు, సూచనలు కోరడం లాంఛనప్రాయమే.

విద్యుత్ చట్ట సవరణల బిల్లుపై చర్చ స్వల్పస్థాయిలోనే జరిగింది. కొన్ని అంశాలకే పరిమితమై సాగుతోంది. ఈ సమస్య కేంద్ర, రాష్ట్రాల హక్కులకు సంబంధించినది మాత్రమే కాదు. భవిష్యత్ కాలంలో విద్యుత్ రంగం ఎవరి ఆధీనంలో ఉండబోతుందన్నదే ఇందులో కీలకం.

అంబేడ్కర్ సూచన మేరకు

1948లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సారథ్యంలో 'విద్యుత్ పాలసీ -1948 రూపొందింది. ఈ పాలసీని రూపొందించిన సందర్భంలో 'విద్యుత్ రంగం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ప్రభుత్వరంగ పరిశ్రమగా ఉండాలని' అంబేద్కర్ పేర్కొన్నారు. భారత యూనియన్ ఫెడరల్ స్వభావం కలిగి ఉన్నందున ఆయా రాష్ట్రాల పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధికి, ప్రజల వినియోగానికి సౌలభ్యతతో అందుబాటులో ఉండటానికి ఇది తప్పనిసరి అని ఆనాడు భావించారు. అందువల్ల ఈ అంశాన్ని రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో చేర్చారు.

విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలలో విద్యుత్ బోర్డులు ఏర్పడ్డాయి. 1975లో ఎన్టీపీసీ, నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. దీనితో 1950-90 మధ్యకాలంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగానే పెరిగింది. ఉత్పాదక క సామర్థ్యం మెరుగైంది. 1974-84 మధ్య కాలంలో కేంద్రస్థాయిలో విద్యుత్ సంస్థలు రావడంతో ఉత్పత్తి మరింతగా పెరిగింది. ప్రజల తలసరి వినియోగం తో పాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో వినియోగం కూడా పెరిగింది.

ఇప్పుడు ఎందుకీ మార్పులు

బీజేపీ ప్రభుత్వం 2003 విద్యుత్ చట్టానికి సవరణలు తీసుకురావడంలో కొన్ని నిర్దిష్ట ప్రయోజనాలు ఉన్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా కార్పొరేట్ ఆర్థిక సంస్థలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం. సమాఖ్య భావ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాలకు ఉండే హక్కులను లాక్కొని, తద్వారా రాష్ట్రాలను బలహీనపరచడం, సంస్థాగతంగా బీజేపీకి ఉండే రాజకీయ ప్రయోజనాలు. ఈ మూడు రకాల ప్రయోజనాల సాకారం కోసమే ప్రస్తుత విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ద్రవ్య సంస్థలు 90వ దశకం నుండే తీవ్ర వత్తిడిని తేవడం మొదలయింది.

వాస్తవానికి భారత విద్యుత్ రంగం మీద 1980 దశకం నుండే స్వదేశీ, విదేశీ బడా పెట్టుబడిదారులు దృష్టి సారించారు. 2005లో అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఒప్పందంలో మన దేశం సంతకం చేయడంతో ప్రైవేట్ పెట్టుబడి శక్తులకు సానుకూలంగా విద్యుత్ రంగం పాలసీలలో మార్పులకు ఒత్తిడి పెరిగింది. మే 2003 కు పూర్వం ఉనికిలో ఉన్న కేంద్రచట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టమే 2003 విద్యుత్ చట్టం. అప్పటి వరకూ కొనసాగుతున్న రాష్ట్ర చట్టాలు కొనసాగుతాయని పేర్కొంటూ ఈ చట్టాలన్నీ విద్యుత్ చట్టం-2003 కు లోబడి ఉండాలని కూడా స్పష్టం చేసింది. ఈ అంశంపై చట్టం చేసి, నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర, రాష్ట్రాలు రెండింటికీ ఉంటుంది.

వారి ఒత్తిడితోనే

కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల ఒత్తిడితోనే 2014లో కేంద్రం విద్యుత్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లు సమాంతర విద్యుత్ పంపిణీ సంస్థలను పెట్టుకొనేవారికి, ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లు అద్దెకు వాడుకోవడానికి వీలు కల్పిస్తూ సవరణ చేసింది. మరో కీలక అంశం ప్రస్తుతం ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను పంపిణీ, సప్లై అనే రెండు భాగాలుగా విభజించారు. పంపిణీ సంస్థ విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను నిర్వహిస్తుంది. సప్లై సంస్థ ఈ విద్యుత్ లైన్లను, సబ్ స్టేషన్లను వాడుకొని విద్యుత్ను వినియోగదారులకు అందిస్తుంది. ఇది ప్రైవేట్ సంస్థలకు అనుకూలమైన సవరణ.

కంపెనీలు పెట్టుకొనే ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ విద్యుత్ లైన్లను, సబ్ స్టేషన్లను అప్పగించేందుకు చేసిన సవరణ. ఈ సవరణలపై ప్రజా ప్రతికూలత, రాష్ట్రాల వ్యతిరేకతతో కేంద్రం ఆశించిన ఫలితాలు రాలేదు. దీనితో విద్యుత్ రంగంలో సమూల మార్పులు అనివార్యమని కేంద్ర పాలకులు భావించారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల నిర్వహణ బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకోవాలన్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ఒత్తిడి ఉండగానే, విద్యుత్ ఉత్పత్తి రంగం పూర్తిగా ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోయింది. గ్యాస్, బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ వస్తోంది.

చార్జీల భారం తప్పదు

ప్రభుత్వ రంగంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఒక మెగావాట్ కి సగటున రూ. 4-6 కోట్లు ఖర్చు అవుతుంటే ప్రైవేట్ కంపెనీలు రూ. 8-12 కోట్లుగా చూపించి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతున్నాయి. నూతన విధానం అమలుకు వస్తే పేద ప్రజలు చీకటిలో మగ్గాల్సిందే. డిస్కమ్లను పూర్తిగా ప్రైవేటీకరించి, కొన్ని ప్రాంతాలను ఫ్రాంచైజీలకు అప్పగించే అవకాశం ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య ఉండే వైరుధ్యాలు, వాటి రాజకీయ ప్రయోజనాలు, ఉన్న చట్టాలు పూర్తిస్థాయిలో ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా లేకపోవడం, ప్రజల వ్యతిరేకత వంటి కారణాలు ప్రైవేట్ సంస్థలు విద్యుత్ రంగంలోకి ప్రవేశించకపోవడానికి అడ్డంకిగా ఉన్నాయి. అందువల్లనే 2003 చట్టంలో మొత్తం 39 సవరణలు చేశారు. వీటిలో ఆరేడు సవరణలు చాల కీలకమైనవి.

1999 జనవరిలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ బోర్డును రెండుగా విభజించింది. 2004 ఏప్రిల్‌లో ఆరు విభాగాలుగా విభజించింది. సబ్సిడీలను రద్దు చేసి వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపింది. డిస్కంలను బలహీన పరుస్తూ ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ పంపిణీ వ్యవస్థను అప్పగించే వైఖరి తీసుకున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీతో పాటు వాణిజ్యం (బిల్లులు వేయడం, వసూలుతో పాటు బిల్లులు చెల్లించకపోతే కేసులు నమోదు చేసి జరిమానా, జైలు శిక్షలు వేయడం ప్రైవేట్ కంపెనీలకు పదేళ్ల క్రితమే కట్టబెట్టారు. టారెంట్, అదానీ, రిలయన్స్ ఎనర్జీలకు ఈ ఒప్పందాలు ఉన్నాయి. ప్రతి మూడు నెలలకు చార్జీలు పెంచుకోవడానికి వాటికి అవకాశం ఉంది. ఇప్పుడీ ప్రయోగం దేశమంతా అమలులోకి తేవడానికి ప్రయత్నం జరుగుతోంది.

రాయితీలుండవు

సబ్సిడీలన్నీ ఎత్తివేస్తారు. రైతాంగం, గృహ వినియోగదారులు విద్యుత్ వినియోగానికి సంబంధించి ఎన్ని యూనిట్లు ఉపయోగించుకుంటే దానికయ్యే మొత్తం ఖర్చును ముందుగా చెల్లించాలి. ప్రస్తుతం 100 యూనిట్లులోపు వారికి రూ. 3.30 నుంచి రూ.6.87కు పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 1,13,19,594 మంది గృహ వినియోగదారులున్నారు. వీరిలో 97,60,728 మంది సబ్సిడీ పొందుతున్నారు. సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులపై భారం మరింత పడుతుంది. రాష్ట్రంలో 24.4 లక్షల పంపుసెట్లున్నాయి. వీటన్నింటికీ మీటర్లు బిగిస్తారు. ఒక రైతు పంపు సెట్ రోజుకు 30 యూనిట్లు ఖర్చు చేస్తే యూనిటు రూ 6.87 చెల్లించవలసి ఉంటుంది. అంటే సంవత్సరానికి యాభై, అరవై వేల రూపాయలు చెల్లించాలి.

రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇతర దేశాల నుంచి విద్యుత్ కొనుగోలు, ఎగుమతి వంటి బాధ్యత పూర్తిగా కేంద్రానికే ఉంటుంది. ధరల విషయంలో నియంత్రణ లేక స్థానిక విద్యుత్ సంస్థలు దివాళా తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ రంగంలో శాశ్వత ఉద్యోగాలకు స్థానం ఉండదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మినెంట్ అయ్యే అవకాశాలను కోల్పోతారు. కరెంటు కొరత ఏర్పడితే గ్రామీణ ప్రాంతాలకు ముందుగా కోతలు విధిస్తారు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వవు. ఇది ప్రజలకు అన్ని విధాలుగా అత్యంత హానికరమైనది. ఈ వ్యవస్థను ప్రతిఘటించడానికి విశాలమైన ప్రజా సమూహాల మద్దతు కలిగిన బలమైన కార్మికోద్యమాల నిర్మాణం జరగాలి. నిలకడ కలిగిన సమరశీల పోరాటాలే పరిష్కార మార్గం.


మారుపాక అనిల్ కుమార్

9440482429



Next Story