బీడీపై నిషేధాలు- మద్యపానానికి ఆహ్వానాలా!?

by Viswanth |
బీడీపై నిషేధాలు- మద్యపానానికి ఆహ్వానాలా!?
X

క్క తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది బీడీ కార్మికులకు, దేశంలో రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ రంగం భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన COTPA - 2019 (సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్) చట్ట సవరణలతో ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు మద్యం పాలసీలతో ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతూ ఆర్థిక-సామాజిక విధ్వంసానికి, నేరాలకు కారణమవుతున్న పాలకులు ప్రజల ఆరోగ్యాల పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లు పొగాకు ఉత్పత్తుల గురించి రోజుకో చట్టం చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల సాకుతో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించకుండానే చేస్తున్న చట్టాలపై బీడీ కార్మిక సంఘాలన్నీ ఆందోళన బాటపట్టాయి. కోవిడ్‌తో అల్లాడుతున్న ప్రజలను అదును చూసి దెబ్బ కొట్టినట్టు రైతు వ్యతిరేక మార్కెట్ చట్టాలు, కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించడం మొదలుకొని, COTPA చట్టానికి సవరణలు ఒకటి వెంట ఒకటి వెలుగులోకి వచ్చాయి. 2021 సంవత్సరమంతా లక్షలాది బీడీ కార్మికులు వీధుల్లొకొచ్చారు. ఆ సంవత్సరం మార్చినెలలో బీడీ కార్మికులకు సంఘీభావంగా నాతోపాటు అరుణోదయ కళాకారులంతా ఎర్రటి ఎండలతో పోటీపడ్డాము. బీడీ కార్మికులు 40 రోజుల పాటు సమ్మె చేసి 2012లోనే జి.ఓ.ఎం.ఎస్.నెం.41 ద్వారా సాధించుకున్న కనీస వేతనాల నిర్ణయాన్ని అమలు చేయకుండా నిలిపేశారు. బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇంకా అమలుకు రాలేదు. అందుకే 2023 మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా బీడీ కార్మికుల న్యాయమైన పోరాటానికి సంఘీభావంగా, మద్యం ఉత్పత్తులన్నీ దేశవ్యాప్తంగా నిషేధించాలని రాష్ట్రమంతా పలు కార్యక్రమాలు జరుగుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.

బీడీ కార్మికుల నడ్డి విరుస్తున్నారు

ప్రపంచీకరణ యుగంలో కార్మికుల కంటే యజమానులకే బేరమాడే శక్తి పెరుగుతున్న కాలం ఇది. నూటికి 99 శాతం మహిళలే కార్మికులుగా ఉన్న బీడీ రంగం గురించి తెలంగాణలో ప్రత్యేక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ‘‘బొంబాయి- దుబాయ్-బొగ్గు బాయి ‘‘అంటూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ కాలంలో జరిగిన చర్చలాగా బీడీ కార్మికుల సమస్యలపై, వారి జీవితాలపై చర్చ జరగలేదు. వ్యవసాయం, చేనేత రంగాలు వరుసగా తెలంగాణ నేలపై దెబ్బతిన్న సమయంలో బీడీ రంగం ప్రజలకు పెద్ద బాసటగా నిలిచింది. అచ్చంగా దేశీయ పరిశ్రమగా పేరుగాంచిన బీడీ రంగాన్ని దెబ్బతీయడానికి మినీ సిగరెట్లు అంటూ, అలాగే దీన్ని క్రమబద్ధీకరించే పేరిట పుర్రె గుర్తు అంటూ కొంతకాలం వేధించారు. ఇప్పుడు ఏకంగా సిగరెట్ ఉత్పత్తులు, ప్రకటనలు, ఎగుమతులు, దిగుమతులు, అన్నీ నిషేదించాలన్న కేంద్రం తలంపు బీడీకార్మికులు హక్కుల పోరాటం చేయకుండా ఆత్మరక్షణలోనికి, అభద్రత లోనికి నెట్టి వేస్తుంది. కానీ మద్యం ఉత్పత్తుల అమ్మకాలను మాత్రం టార్గెట్ పెడుతూ మరీ పెంచుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

ఓట్లను కొల్లగొట్టే ఆయుధమిదే!

లాభాల వేటలో పెరుగుతున్న కర్బన ఉద్ఘారాలు, వాయు కాలుష్యం, కార్బన్ డైయాక్సైడ్ ఆధారంగా తయారవుతున్న శీతల పానీయాలు, ఆహార ఉత్పత్తుల్లో ఎరువులు- క్రిమి సంహారక మందులు, అన్నిట్లో కల్తీ సర్వ సాధారమైపోతున్న స్థితిలో ప్రభుత్వ విధానాలు గొంగట్లో తినుకుంటూ వెంట్రుకలు ఏరుతున్నట్లున్నాయి. ప్రమాదకరమైన మద్యం అమ్మకాలకు టార్గెట్లు నిర్ణయిస్తూ, ధరలు పెంచుతున్న పాలకులు మద్యపానం నిషేధంపై ఎన్నికల వాగ్దానాలు తప్ప ఎక్కడా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఎందుకంటే ప్రజలకు తాపించి సంక్షేమ పథకాలు నడుపుకునే దుస్థితి ఏర్పడింది. 2022 జనవరి నుండి డిసెంబర్ 31 వరకు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రూ. 34,142 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి 29,000కోట్ల రూ.ల ఆదాయం సమకూరిందని ఒక అంచనా. ఈసారి బడ్జెట్‌లో ఎక్సైజ్ ఆదాయం 14 శాతంగా అంచనా కట్టారు. మద్యం మనిషిని నిర్వీర్యపరిచే సాధనంగానే గాకుండా, ఓట్లను కొల్లగొట్టే రాజకీయ ఆయుధంగా కూడా మారింది.

బీడీ రంగం, గాజుల తయారీ, అగర్బత్తీలు, కొవ్వొత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, గృహ నిర్మాణరంగం మొదలుకొని ఐటీ రంగంలోనూ మహిళా కార్మికుల శ్రమ అపారంగా దాగి ఉంది. అటు ఉత్పత్తిలోనూ, పునరుత్పత్తిలోనూ, గృహ చాకిరికిలోనూ, పిల్లల పెంపకంలోనూ విశేష పాత్ర నిర్వహిస్తున్న మహిళలు రాజకీయాల్లోనూ ప్రతిభా పాటవాలు చూపుతున్నారు. కానీ ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం, శ్రమకు దగ్గ ఫలితం మగ్యమైపోతున్నది. నేటికీ తునికాకు (ముడిసరుకు) కొని పెట్టే దుస్థితిలో, ఎలాంటి చట్టబద్ధ హక్కులు పొందలేక బీడీలతో, రోగాలు, నొప్పులతో కాలం వెళ్లదీస్తున్న బీడీ కార్మికులతో భుజం కలుపుదాం. దేశవ్యాప్తంగా మద్య నిషేధంతో సమాజాన్ని నేర ప్రవృత్తి నుండి కాపాడుకుందాం.

విమలక్క

88868 41280

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Next Story