జర్నలిజంలో ఏఐ.. లాభమా? నష్టమా?

by Ravi |   (  Updated:2026-06-26 01:03:45  IST  )

పత్రికా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశంతో జర్నలిజం ఎలా మారుతోంది, అల్గారిథంల ప్రభావం, నకిలీ వార్తల ప్రమాదం, ఉద్యోగాలపై ప్రభావం, మీడియా భవిష్యత్తు సవాళ్లను ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

జర్నలిజంలో ఏఐ.. లాభమా? నష్టమా?
X

ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని శాసిస్తున్నది. అయితే, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచిన పత్రికా రంగంలోకి ఏఐ ప్రవేశించడం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నది. వార్తలను సేకరించడం, రాయడం, ఎడిట్ చేయడం.. చివరికి ఏ సమాచారాన్ని పాఠకుడికి చేర్చాలో కూడా ‘అల్గారిథం’లే నిర్ణయిస్తున్న రోజులివి. పత్రికల న్యూస్ మీటింగుల్లో పాత్రికేయుల ఆలోచనలు, మేధోమథనంతో తయారయ్యే ఎడిటోరియల్స్, విశ్లేషణలు ఇప్పుడు కేవలం ‘ఒక్క క్లిక్’ లేదా ఒక ‘ప్రాంప్ట్’తో క్షణాల వ్యవధిలో సిద్ధమవుతున్నాయి.

సాధారణంగా ఈ వేగవంతమైన మార్పు సమాచార విస్ఫోటనానికి దారితీస్తున్నప్పటికీ, జర్నలిజం ప్రాథమిక సూత్రాలకే సవాలుగా మారుతున్నది. సాంకేతికత జర్న లిస్టుకు సహాయక సాధనంగా మారాలా? లేక జర్నలిస్టునే ప్రత్యామ్నాయంగా మార్చాలా? అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మీడియా వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది.

సృజనాత్మకత.. భావోద్వేగాల లేమి

జర్నలిజం అనేది కేవలం సమాచారాన్ని ఒకచోట చేర్చి ఇవ్వడం కాదు.. దానికి మానవీయ కోణం, క్షేత్రస్థాయి పరిశీలన, సామాజిక స్పృహ అవసరం. ఏఐ టూల్స్ అంత ర్జాలంలో లభ్యమయ్యే పాత డేటాను ఆధారంగా చేసుకుని కొత్త వ్యాసాలు రాయగలవు తప్ప, ఒక మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజల కళ్లలోని కన్నీళ్లను, గుండెల్లోని ఆవేదనను అర్థం చేసుకోలేవు. ఉదాహరణకు ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తండ్రి-కూతుళ్ల వయస్సు వ్యత్యాసం తక్కువగా ఉందనే క్లరికల్ తప్పులు లేక సామాజిక వాస్తవాలను ఏఐ అల్గారిథంలు గుర్తించలేక ఓటర్ల జాబితా నుంచి ఏకపక్షంగా లక్షల్లో ఓట్లను తొల గించిన ఉదాహరణలు చూశాం. జర్నలిజంలో కూడా కేవలం డేటాపాయింట్ల ఆధారంగా వార్తలు రాస్తే.. అందులో మానవీయకోణం లోపించి, అక్షరాలు కేవలం యంత్రాలుగా మారిపోయే ప్రమాదం ఉంది.

ప్రశ్నార్థకంగా విశ్వసనీయత..

ప్రస్తుతం మీడియా రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఐడెంటిటీ, కాపీరైట్ ఉల్లంఘన. గ్లోబల్ టెక్ కంపెనీలకు చెందిన ఏఐ మోడల్స్, రాత్రింబగళ్లు కష్టపడి జర్న లిస్టులు రాసిన ప్రత్యేక కథనాలు, పరిశోధనాత్మక విశ్లేషణలను వారి అనుమతి లేకుండానే స్క్రాప్ చేసి వాడుకుంటున్నాయి. దీనివల్ల పత్రికల, ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ల మేధోసంపత్తి హక్కులకు తీవ్ర భంగం కలుగుతున్నది. మరోవైపు, ఏఐ సృష్టించే సమాచారంలో ‘హాలూసినేషన్’ (లేని సమాచారాన్ని ఉన్నట్లుగా భ్రమపడి తప్పుడు నిజాలు సృష్టించడం) వల్ల నకిలీ వార్తలు విపరీతంగా వ్యాప్తి చెందుతు‌న్నాయి. ఫలితంగా సమాజంలో పాత్రికేయ వ్యవస్థపై ఉన్న నమ్మకం, విశ్వసనీయత సడలిపోయే ప్రమాదం ఏర్పడింది.

మీడియాలో ఏఐ వైఫల్యాలు..

జర్నలిజంలో ఏఐని గుడ్డిగా నమ్ముకుంటే జరిగే ప్రమాదాలకు అంతర్జాతీయంగా కొన్ని బలమైన కేస్ స్టడీలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ మ్యాగజైన్ సీనెట్, ల్యాబ్స్ పరీక్షల పేరిట ఆర్థిక సంబంధిత వ్యాసాల రచనకు ఏఐని వాడింది. అయితే, ఆ వ్యాసాల్లో వడ్డీ రేట్లు, రుణాల నిబంధనలపై వందలాది ప్రాథమిక తప్పులు దొర్లాయి. ఈ విషయంలో పాఠకులు నిరసన తెలప‌డంతో సదరు మీడియా సంస్థ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. దీంతో ఆ వ్యాసాలను తొలగించాల్సి రావడంతో పత్రిక ఇమేజ్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఏఐ విశ్వసనీయతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటిదే మరో సంఘటన ప్రముఖ మీడియా నెట్‌వర్క్ సంస్థ గిజ్మోడో‌కు ఎదురైంది. అమెరికాలో ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ పత్రిక, న్యూస్ వెబ్‌సైట్. ఈ సంస్థ స్టార్ వార్స్ సినిమాల హిస్టరీపై ఏఐతో ఒక ఆర్టికల్ రాయించింది. కానీ ఆ అల్గారిథం.. సినిమాలోని పాత్రల కాలక్రమాన్ని తారుమారు చేసి తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది. అది యథాతథంగా ప్రచురితం కావడంతో.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేశారు. దీంతో జర్నలిజంలో ఫ్యాక్ట్-చెకింగ్‌కు మానవ మేధస్సు ఎంత అవసరమో రుజువైంది.

అల్గారిథం ఉచ్చు..

అమెరికాకు చెందిన ప్రొఫెసర్, ప్రసిద్ధ డిజిటల్ మీడియా విశ్లేషకుడు ఎలి పారిజర్ తన పుస్తకం ‘ద ఫిల్టర్ బబుల్: వాట్ ద ఇంటర్నెట్ ఈజ్ హైడింగ్ ఫ్రం యూ’లో ఫిల్టర్ బబుల్ అనే సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన విషయాన్ని హెచ్చరించారు. ‘ఏఐ అల్గారిథంలు పాఠకుడికి కేవలం అతడు ఇష్టపడే కంటెంట్‌ను మాత్రమే చూపిస్తాయి. దీనివల్ల సమాజంలో భిన్న దృక్పథాలు కనుమరుగై, పక్షపాత వైఖరి పెరుగుతుంది. జర్నలిజం తన నిష్పాక్షికతను కోల్పోవడానికి ఇది మొదటి అడుగు’ అని పేర్కొన్నారు.

ఉపాధి సంక్షోభం.. జర్నలిస్టుల భవితవ్యం!

ఏఐ రాకతో ఖర్చులు తగ్గించుకునేందుకు అంతర్జాతీయ మీడియా సంస్థల నుంచి ప్రాంతీయ పత్రికల వరకు డిజిటల్ డెస్క్‌లలో లే-ఆఫ్స్ విధిస్తున్నాయి. సాధారణ అనువాదాలు, బ్రీఫ్ నోట్స్, ప్రెస్ నోట్లను వార్తలుగా మార్చే పనులను ఏఐ సులభంగా చేస్తుండటంతో సబ్-ఎడిటర్ల ఉపాధి దెబ్బతింటున్నది. కేవలం సోషల్ మీడియాలో ‘రీచ్’ వస్తున్నదనో లేదా తక్కువ ఖర్చుతో ఎక్కువ కంటెంట్ వస్తున్నదనో ఏఐని నమ్ముకుంటే, అది లాంగ్ రన్‌లో పత్రికా రంగాన్నే నిర్వీర్యం చేస్తుంది.

ఏఐ ఒక టూల్.. క్రియేటర్ కాదు!

సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ఏ రంగానికైనా సాధ్యం కాదు. జర్నలిజంలో కూడా స్పెల్లింగ్ తప్పులను సరిదిద్దడానికి, ఆడియోను టెక్స్ట్‌గా మార్చడా నికి, పెద్ద నివేదికల నుంచి డేటాను సులువుగా విశ్లేషిం చడానికి ఏఐని ఒక ‘సహాయక సాధనం’ (టూల్)లా వాడుకోవడంలో తప్పులేదు. కానీ, ఏఐనే కంటెంట్ రైటర్‌గా మార్చి జర్నలిస్టు బాధ్యతలు అప్పగిస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే ముప్పుగా మారుతుంది. వంద ఏఐ టూల్స్ వచ్చినా ఒక నిజాయితీ గల జర్నలిస్టు కలం నుండి వచ్చే సత్యానికి, సమాజంపై చూపే ప్రభావానికి అవి సాటిరావు. సాంకేతికత అక్షరాన్ని సులువు చేయాలి కానీ, అక్షరం వెనుక ఉన్న ఆలోచనను చంపేయకూడదు. పారదర్శకత, నైతికత లేని ఏఐ వినియోగం జర్నలిజానికి శాపంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా యాజమాన్యాలు, సంపాదకులపై ఉంది.

-హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story