దేశంలోని యువతకు ఉద్యోగాలు కష్టమేనా?

by Disha edit |
దేశంలోని యువతకు ఉద్యోగాలు కష్టమేనా?
X

భారత దేశంలో నిరుద్యోగ యువతలో చాలామంది రాజకీయ పార్టీల నాయకుల వెంట ప్రచారంలో తిరుగుతున్నారు. ఎన్నికల్లో పార్టీ ప్రచారంలో జనాలను ర్యాలీలకు సభలకు జనాన్ని సమీకరించడంలో, ఓటర్లకు నేతలు ఇచ్చిన డబ్బులు, ఇతరత్రా వస్తువుల పంపిణీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మూడు నుంచి నాలుగు శాతం పదవులు కూడా కొట్టేస్తున్న వారు ఉన్నారు. ప్రస్తుతం యువత దేశంలో ఉద్యోగాలు లేవు, అవి వచ్చే అవకాశం లేదని రాజకీయాల్లో తిరుగుతున్నారు.

ప్రచారానికి ఎసెట్‌గా యువత..

ఒక సర్వే ప్రకారం దేశంలోని ప్రతి జిల్లాలో యావరేజ్‌గా ఒక లక్ష75 వేల నుంచి 2 లక్షల మంది యువత ఆయా రాజకీయ పార్టీల నాయకుల వెంట ఉంటున్నారు. వీరందరూ నిరుద్యోగులే కావడం గమనార్హం. 6కోట్ల మంది నిరుద్యోగులు దేశంలోని ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోగా అందులో 27 లక్షల మందికే ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఒక యూపీ లోనే 2 కోట్ల 35 లక్షల మంది నిరుద్యోగులు రాజకీయ నాయకుల వెంట ఉన్న దాఖలాలు ఉన్నాయి. బీహార్‌లోని 38 జిల్లాల్లో 80 లక్షల మంది. మధ్యప్రదేశ్ లోని 52 జిల్లాలలో జిల్లాకు 2 లక్షల మంది యువత అంటే నిరుద్యోగులు రాజకీయాల్లో నేతల పార్టీల వెంట ఉన్నారు.

నిరుద్యోగ సైన్యం రాజకీయ నాయకులకు, పార్టీల ప్రచారానికి ఎసెట్‌గా మారారు. బీహార్‌లో అయితే 100 మంది డిప్లమా తదితర క్వాలిఫై అయిన వారిలో 15 మందికే ఉద్యోగాలు ఉన్నాయి. 2021 నాటికి దేశంలో పీజీ చేసిన వారి సంఖ్య 61 లక్షలు.. డిగ్రీ చేసినవారు 19 లక్షలు.. ఇంటర్, ఇతర కోర్సులు చేసినవారు 15 లక్షల మంది. కాగా 10వ తరగతి చదివిన వారి సంఖ్య రెండున్నర కోట్లు ఉంది. ఇలా చదువుకున్న నిరుద్యోగ యువత మొత్తంగా 23 కోట్లు ఉంటుంది అనేది లెక్కలు చెబుతున్నాయి. దేశంలో 18 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి నెలకొంది. ప్రధాన మంత్రి ప్రచార ఖర్చు ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు కాగా సైన్స్ మీద ఏడేండ్లలో 300 కోట్ల రూపాయలు.. రీసెర్చ్.. ఇన్నోవేషన్‌పై 188 కోట్లు ఖర్చు చేసారు. 7 సంవత్సరాలలో ఇండియా వదిలి చదువులకు విదేశాలకు వెళ్లిన వారు 18 లక్షల 19 వేల 8 మంది ఉండగా మన దేశానికి వచ్చిన వారి సంఖ్య 2 లక్షల 71 వేల 533 గా ఉంది.

వచ్చే పదేండ్లలో మరింత కష్టం!

దేశానిది ఎలాంటి ఎకానమీ మోడలో అంతుచిక్కని విషయం.. ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఏడేండ్ల పాలనలో 264 పథకాలను, ఆ తర్వాత రెండు ఏండ్లలో మరి కొన్ని పథకాలను ప్రకటించారు. 80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయలేదు. రాజకీయాల కోసం, ఎన్నికల్లో, ఈ తొమ్మిది ఏండ్లలో ఖర్చు చేసిన డబ్బుతో 80 లక్షల ఉద్యోగాలు ఇచ్చి వారికి 10 ఏండ్లు జీతాలు ఇచ్చి పెన్షన్ ఇత్యాది సౌకర్యాలు కూడా కల్పించే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పని పాలకులు చేయరు. ఎందుకంటే ఎన్నికలు.. ఎన్నికల్లో గెలవడం అధికారం నిలబెట్టుకోవడమే వారికి ముఖ్యం.. ఓబీసీలు 62 లక్షల మంది ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 1 లక్ష 71600 మందికి.. వచ్చాయి. ఓబీసీలు 6 కోట్ల మంది.. 3.5కోట్ల మంది అగ్ర కులాలు వారు..3కోట్ల మంది దళితులు నిరుద్యోగులుగా ఉన్నారు. 2020 లోనే 2.5కోట్ల మంది నిరుద్యోగులు పెరిగారు. ప్రపంచంలోని 16 దేశాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఉద్యోగాల కోసం యువత ఆందోళన చేసి అక్కడి ప్రభుత్వాలను మార్చేసింది.

దేశంలో ఆకలి.. నిరుద్యోగం, అసమానతలు, అధిక ధరలు,తదితర సమస్యలను పరిష్కరించడానికి భుజాలపై మోయడానికి పాలకులు సిద్ధంగా లేరు. సీఎంఐఈ డేటా చూస్తే ఆందోళన వ్యక్తం అవుతోంది.. 2021 నుంచి కొత్త డేటా అసలు అందుబాటులో లేదు. పాత డేటా ప్రకారం ఉద్యోగాలు కోల్పోయిన వారు లక్షల్లో ఉన్నారు. ఎస్సీ.. ఎస్టీ.. ఓబీసీ.. అప్పర్ క్యాస్ట్ రాజకీయాలు.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం..అమ్మి వేయడం చూస్తుంటే మరో పదేండ్లలో స్కూల్.. కాలేజీ చదువులు పూర్తి చేసుకొని వచ్చే యువతకు కనీసం అసంఘటిత రంగంలోనైనా ఉద్యోగం లభించే అవకాశం పరిస్థితి ఉంటుందా? అనే అనుమానం వ్యక్తమయ్యి ఆందోళన కలుగుతుంది.

కోట్లల్లో ఇస్తామని, లక్షల్లో..

ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే దేశ భవిష్యత్తు‌పై అపనమ్మకం కలుగుతున్నది. ఇప్పటికే ఆకలి అధికంగా ఉన్న 107 దేశాల్లో మన సంఖ్య 94 గా ఉంది. పీఎస్‌యూలలో 6 లక్షల మంది.. బ్యాంకుల్లో 4 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. 67శాతం అసంఘటిత కార్మికులకు ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి ఏర్పడింది. యూనివర్సిటీలలో 38,646 ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ సెలెక్షన్స్‌లో12కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటే 2లక్షల14 వేల 601 మందికి ఉద్యోగాలు వచ్చాయి. యూపీఎస్‌సీలో 8.5 కోట్ల మంది జాబ్స్ కోసం పోటీ పడితే 25 వేల 627 మందికి జాబ్స్ వచ్చాయి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ తొమ్మిది ఏండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. కానీ లక్షల్లో కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఖాళీలను భర్తీ చేయలేదు. ఉన్న ఉద్యోగాలు కార్పొరేటీకరణ ఫలితంగా ఊడుతున్నాయి.. దేశంలో ఎమర్జెన్సీ కాలంలోను రెండున్నర శాతం నిరుద్యోగం ఉంటే ఈ తొమ్మిది ఏండ్లలో 11 శాతం అయింది.. ప్రధాని నరేంద్ర మోదీ బర్త్‌డేను ఘనంగా బీజేపీ నేతలు జరుపు కున్నారు. నిరుద్యోగ యవత అదే రోజు ఉపాధి హామీ ఏమైంది? అంటూ షరా మాములుగా నేషనల్ ఎంప్లాయిస్ డే ను నిర్వహిస్తూ, ఆందోళనలు చేపట్టి తూర్పార పట్టారు!

ఎండి. మునీర్

సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు

99518 65223



Next Story

Most Viewed