విపక్షాల ఆత్మస్థైర్యం పెరిగింది!

by Ravi |
విపక్షాల ఆత్మస్థైర్యం పెరిగింది!
X

ర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన గెలుపు దేశంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాల ఆత్మస్థైర్యాన్ని పెంచింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పినట్లు కన్నడిగులు విద్వేషాల మార్కెట్‌ను తిరస్కరించి ప్రేమ దుకాణాన్ని ఓపెన్ చేశారు. కులమతాలకు అతీతంగా జీవిస్తున్న ప్రజలను కేవలం ఓట్లు, అధికారం కోసం, ఏక పక్ష హిందుత్వ ఎజండాను అమలు చేస్తున్న బీజేపీకి అద్భుతంగా దేశం అంతా మేల్కొనే విధంగా తీర్పు చెప్పారు. భారతదేశంలో మనుషుల శవాల మీద పైసలు పోగు చేసుకునే అవినీతిపరులు, బరియల్ గ్రౌండ్‌లను సైతం ఆక్రమించుకునే నేతలకు ఇక కాలం చెల్లనుంది. ఓటర్లు బుద్ధిజీవులు అయిపోతున్నారు. ఓటుకు నోటు రాజకీయానికి కూడా ఇక కాలం చెల్లే పరిస్థితి ఉంది. దేశంలో ప్రజల అవసరాలు ఏమిటి, సామాన్యుడు ఏం కోరుకుంటున్నాడు అనేది వదిలేసి మత, కుల రాజకీయాలు చేస్తే దేశ ప్రజలు ఎంతకాలమని భరిస్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని చెబితే, దానిని బజరంగ్ దళ్ కు వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడుతున్నారని పీఎం సహా బీజేపీ నేతలందరూ పల్లవిని అందుకున్నారు. అయినా జనం ఓడించారు. విద్వేషాల, అబద్ధపు హామీల, ఆరోపణల ఉపన్యాసాలు ఎంతకాలం నమ్ముతారు? నిజానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంలోనే కర్ణాటకలో 22 రోజులు ఉన్నపుడే, ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు.

వన్ ఆన్ వన్ తో మార్పు సాధ్యం

భారతదేశంలో బీజేపీని గెలిపించడం అంటే తనని గెలిపించడం అనే అర్దం వచ్చే విధంగా ఏ ఎన్నికల సభల్లో అయినా పీఎం నరేంద్ర మోడీ తనకు ఓటు వేయాలని కోరుతూ ఉంటారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రచారం ఇదే విధంగా కొనసాగింది. హిందుత్వ ఎజెండాతో జరిగింది. తనకు ఓటు వేయాలని కోరారు. మరోవైపున వన్ ఆన్ వన్ పోటీ వల్లే కర్ణాటక లో కాంగ్రెస్‌కు మంచి మెజారిటీ వచ్చింది. రేపు విపక్షాలు అన్నీ ఒక్కటి అయినా, లీడర్ ఎవరూ, పీఎం అభ్యర్థి ఎవరూ అని పోటీ పడి, ఐక్యతను చెడగొట్టుకోకుండా, ఎవరికీ ఏ రాష్ట్రంలో బలం ఉందో ముందు దాని మీద చర్చించుకుని ఒక జట్టుగా ఏర్పడాలి. స్థానిక విషయాలు, ప్రజల, రాష్ట్ర సమస్యల ఎజెండాతో ఒక ప్రణాళిక ప్రకారం ఎన్నికల్లో పోరాడాలి. నువ్వు, నేను లాంటి అహంతో కూడిన వ్యవహారాలకు వెళ్లకుండా ఐక్యతకు కృషి జరగాలి. అనవసరంగా నువ్వా, నేనా అనే వాదనకు వెళ్లి, ఎవరు పెద్ద, అనే విషయాలకు వెళ్లకుండా, కాస్త విశాలంగా ఆలోచించాలి. కాంగ్రెస్ మాత్రమే ఈ విపక్షాల ఐక్యతకు కృషి చేయాలి. ఆ పార్టీకే ఆ సత్తా ఉన్న విషయాన్ని అందరూ అంగీకరించాలి. బీజేపీకి తానే బాహుబలిగా, 56 ఇంచుల ఛాతి గల నేతగా చెప్పుకునే పీఎం నరేంద్ర మోడీని కర్ణాటక ఓటర్లు ఓడించారు. మోడీ ఎలాంటి కార్డును ఉపయోగించినా వారు వినలేదు. ఇలాగే పార్లమెంట్ ఎన్నికల్లోను ఓటమి తప్పదు. అయితే పోటీ వన్ ఆన్ వన్ ఉండాలి. పీపుల్ ఎజెండా ఉండాలి.

నెత్తిన పెట్టుకున్నోళ్లే నేలకేసి కొడతారు

ఏ ఎన్నికల్లో అయినా స్థానిక సమస్యలే ప్రధానం అవుతాయి. ఓటర్ల ప్రయారిటీ అలాగే ఉంటుంది. ఇప్పుడు మనిషి జీవించడానికి అవసరం అయిన విద్యుత్, మంచినీరు, ఉపాధి, అన్నం, ధరల పెరుగుదల,పెరుగుతున్న పేదరికం, అన్నింటికీ మించి సాటి మనిషి సహాయం ఒకరికొకరు అందుకునే, కులమతాలకు అతీతమైన, సోదరి సోదర భావం గల సమాజం వైపు ప్రజలు ఆలోచిస్తున్నారు. విద్వేషాలకు దూరంగా ప్రేమను పంచే సమాజం వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఇచ్చిన ఈ సందేశాన్ని దేశం ఆమోదిస్తుంది. అందుకే రాహుల్ బీజేపీకి టార్గెట్ అయ్యాడు. రాజకీయాల్లో ప్రత్యర్థి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా. ప్రజలు ఏది చేయాలని నిర్ణయం తీసుకుంటారో అదే జరుగుతుంది. ఎవరిని ఎలా? ఎప్పుడు మట్టి కరిపించాలో,ఎప్పుడు? ఎలా బుద్ది చెప్పాలో? వారికి తెలుసు. దానినే కాలం నిర్ణయం అంటారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ లో ఫాదర్ ఆఫ్ పవర్,అక్రమాలు,అవినీతి, సమస్యలు, దాష్టికాల సంఖ్య పెరిగినపుడు,తమ విలువైన ఓటు ద్వారా నెత్తిన ఎక్కించుకున్నోళ్లే నేలకేసి కొడతారు. చివరికి ప్రజలు ఆశించేది. కోరుకునేది. జరుగుతుంది. ప్రజా తీర్పుకు మించింది లేదు. ఉండదు. అంటే అతిశయోక్తి కాదు.

యావద్దేశానికి హీరో కర్ణాటక

మొత్తానికి కర్ణాటక ఓటర్లు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోయే మార్పుకు బాట వేసేసారు. అంతకు ముందు జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను బీజేపీకి ఇదే తీర్పును జనం నుంచి ఎదుర్కోక తప్పదు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈ దేశం భావి నేతగా జనం అంగీకరించే విధంగా ముందుకు తెచ్చారని అనక తప్పదు. భారత ప్రజల పట్ల రాహుల్‌కు ఉన్న గౌరవం, ఆయన ప్రేమ సందేశం ముందు బీజేపీ శ్రేణుల విద్వేష రాజకీయాలు విఫలం అయిపోయాయి. కర్ణాటకలో 22 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో 80 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం చూస్తే రాహుల్ ప్రభావం ఎంత ఉందో తేలిపోయింది. ఇది దేశం మొత్తానికి వ్యాపిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. రాహుల్ జీ. ప్రొసీడ్ 'హమ్' ఆప్ కే సాత్ అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు. దేశమంతా ఇదే పరిస్థితి ఉంది. అధికారం, తానాషాహీ గిరి శాశ్వతం కాదు. కులం, మతం కుచ్చితాలు పెంచుతుంది కానీ ఆకలి తీర్చదు. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, అధిక ధరలను రూపుమాపదు. అని ఘంటాపథంగా చెప్పిన కర్ణాటక ఇప్పుడు దేశానికీ హీరో అయింది. చివర ఒక్క మాట, ఇది ప్రజాస్వామ్య దేశం. మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఫాదర్ ఆఫ్ పవర్ చాలా జాగ్రత్త పాటించాలి. లేని పక్షంలో ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ప్రజలు అయిదేళ్ల తర్వాత మీ అధికార పీఠాలను కూల్చేస్తారు. ఇందుకు ఎవరూ అతీతం కాదు.

ఎండి.మునీర్

99518 65223

Advertisement

Next Story