- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసమానతలు పెరుగుతున్న ప్రపంచం.. ఇది అభివృద్ధేనా?
సమాజం ఎంత అభివృద్ధి చెందితే, అసమానత అంత తగ్గాలి’ అనేది సాధారణ అంచనా. కానీ 21వ శతాబ్దపు ప్రపంచ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అపూర్వంగా విస్త రించినప్పటికీ ఆదాయం, సంపద, అవకాశాలు, సాంకేతికత, రాజకీయ ప్రభావం ఇలా అన్ని రంగాల్లోనూ ధనికులు, పేదల మధ్య అంతరం విస్తరిస్తోంది. ఈ అసమానత కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్థిరత్వం, మానవ గౌరవంతో ముడిపడిన మౌలిక సమస్య..

‘సమాజం ఎంత అభివృద్ధి చెందితే, అసమానత అంత తగ్గాలి’ అనేది సాధారణ అంచనా. కానీ 21వ శతాబ్దపు ప్రపంచ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అపూర్వంగా విస్త రించినప్పటికీ ఆదాయం, సంపద, అవకాశాలు, సాంకేతికత, రాజకీయ ప్రభావం ఇలా అన్ని రంగాల్లోనూ ధనికులు, పేదల మధ్య అంతరం విస్తరిస్తోంది. ఈ అసమానత కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య స్థిరత్వం, మానవ గౌరవంతో ముడిపడిన మౌలిక సమస్య.. ఈ సమస్యలు తీరాలంటే ప్రపంచానికి మానవ గౌరవాన్ని నిలబెట్టే అభివృద్ధి నమూనా అవసరం..
ప్రపంచ అసమానత తీవ్రతను గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచ జనాభాలోని 10 శాతం మంది, మొత్తం సంపదలో దాదాపు మూడు వంతులు కలిగి ఉన్నారు.. దిగువ 50 శాతం ప్రజల వద్ద స్వల్ప సంపద మాత్రమే ఉంది. ఇది మార్కెట్ శక్తుల సహజ ఫలితంగా కాకుండా, మూలధన ఆధారిత వ్యవస్థలు శ్రమ ఆధారిత ఆదాయాన్ని మించి వేగంగా పెరు గుతున్నదానికి సంకేతం.
ప్రపంచ స్థాయి అసమానత..
థామస్ పికెట్టి పేర్కొన్నట్లుగా, మూలధన లాభాల వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి కంటే ఎక్కువగా ఉన్నంత కాలం అసమానత పెరుగుతూనే ఉంటుంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో మూలధనం ప్రధాన శక్తిగా మారింది. భూమి, ఆస్తులు, పెట్టుబడులు కలిగినవారు తమ సంపదను తరతరాలుగా పెంచుకుంటున్నారు. ఇక ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం వంటివి అధిక నైపుణ్యం ఉన్నవారికి లాభం చేకూర్చగా, తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులను వ్యవస్థ నుంచి బయటకు నెట్టేస్తోంది. అనేక దేశాల్లో పన్ను విధానాలు అసమానతను తగ్గించడంలో విఫలమవుతున్నాయి. వినియోగ పన్నులు పేదల ఆదాయాన్ని కుదించగా, మూలధన లాభాలకు ఇచ్చే రాయితీలు ధనికులను మరింత బలపరుస్తున్నాయి. విద్య, ఆరోగ్యం వంటి మానవ మూలధన రంగాల్లో పెట్టుబడి లోపం సామాజిక అభివృద్ధిని పరిమితం చేస్తోంది.
పేదరికం చారిత్రక మూలాలు..
పేదరికం చరిత్ర మానవ నాగరికత చరిత్రతో సమానంగా ఉండేంత పురాతనమైంది. వ్యవసాయం ప్రారంభమైన తర్వాత భూమి యాజమాన్యం కొద్దిమందిలోనే కేంద్రీకృతమైంది. సామంత విధానం, బానిస వ్యవస్థలు శ్రమ దోపిడీని వ్యవస్థీకృతం చేశాయి. పరిశ్రమల విప్లవం తరువాత ఉత్పత్తి పెరిగినా, లాభాలు మూలధన యజమానులకే చేరాయి. ఇక వలస పాలన దేశాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసి దీర్ఘకాలిక పేదరికానికి బీజం వేసింది. ఈ చారిత్రక కారణాలన్నీ కలిసి పేదరికాన్ని ఒక తాత్కాలిక సమస్యగా కాకుండా, వ్యవస్థాత్మక సమస్యగా మార్చాయి. పేదలు పేదరికం నుంచి బయటపడలేకపోవడానికి ప్రధాన కారణం అవకాశాలు లేకపోవడం. పేద కుటుంబాల్లో పుట్టినవారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక భద్రత లభించదు.. ఫలితంగా వారు తక్కువ ఆదాయ ఉపాధుల్లోనే పరిమితమవుతారు.. ఇది తరతరాలుగా కొనసాగుతూ ‘పేదరిక చక్రం’గా మారుతుంది. కులం, లింగం, ప్రాంతీయ వివక్షలు ఈ పరిస్థితిని మరింత బలపరుస్తున్నాయి. అనధికార రంగాల్లో పనిచేసే కోట్లాది మంది భీమా, పెన్షన్ వంటి రక్షణ లేకుండా జీవిస్తున్నారు. అప్పుల ఉచ్చు కూడా పేదరికం నుంచి బయటపడే మార్గాన్ని మూసేస్తోంది.
పరిష్కార మార్గాలు..
భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. తీవ్రమైన పేదరికం తగ్గిన ప్పటికీ, గ్రామీణ, పట్టణ విభజన, వ్యవసాయంపై అధిక ఆధారపడటం, విద్యా నాణ్యతలో వ్యత్యాసాలు ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. ప్రభుత్వం ఉపాధి హామీ పథకాలు, సంక్షేమ పథకాలు, ఆహార భద్రత పథకాల ద్వారా పేద రికాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచంలోని కొన్ని దేశాలు అసమానతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. నార్డిక్ దేశాలు అధిక పన్నులు వసూలు చేసి, ఉచిత విద్య, ఆరోగ్య సేవలు అందిస్తూ సమాన అవకాశాలను కల్పి స్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు పేద కుటుంబాలకు షరతు లతో నగదు సహాయం అందిస్తూ మానవ మూలధనాన్ని బలపరిచాయి. ఈ అనుభవాలు నేర్పేది ఏమిటంటే, మార్కెట్ వృద్ధితో పాటు బలమైన ప్రభుత్వ జోక్యం అవసరం. ప్రగతిశీల పన్నులు, సామాజిక భద్రత, మానవ మూలధనంలో పెట్టుబడి ఇవన్నీ కలిసి పనిచేయాలి.
ఇది నిజమైన అభివృద్ధి కాదు..
ప్రపంచంలో పేదరికం తగ్గాలంటే మానవ గౌరవాన్ని నిలబెట్టే అభివృద్ధి నమూనా అవసరం. పెరుగుతున్న అసమానత ఆధునిక ప్రపంచానికి అతిపెద్ద ముప్పుల్లో ఒకటి.. ఇది కేవలం ఆర్థిక గణాంకాల సమస్య కాదు.. ఇది సామాజిక స్థిరత్వం, ప్రజాస్వామ్య విశ్వసనీయత, మానవ గౌరవానికి సంబంధించిన సమస్య. సరైన పన్ను విధానం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, విస్తృత ఉపాధి అవకాశాలు, సమర్థవంతమైన సంక్షేమ వ్యవస్థలు అమలైతే అసమానతను తగ్గించవచ్చు. అభివృద్ధి కొద్దిమందికి మాత్రమే పరిమితమైతే అది నిజమైన అభివృద్ధి కాదు. సమానత్వం, న్యాయం, అవకాశాల సమాన పంపిణీతో కూడిన వృద్ధే సుస్థిరమైన అభివృద్ధి. అదే 21వ శతాబ్దపు నిజమైన విజయం.
- గిలకత్తుల వెంకటరమణ గౌడ్
98668 78769






