24 ఫ్రేమ్స్:సినిమాకు ప్రచారమే చాలా!?

by Disha edit |
24 ఫ్రేమ్స్:సినిమాకు ప్రచారమే చాలా!?
X

గతంలో సినిమా రీళ్లను బాక్సులలో పెట్టి బస్సులలో ఊర్లకు తరలించి ప్రదర్శించేవారు. ఎంతో శ్రమ. అందుకే ఫిలిం ప్రింటులు తక్కువ. ఎ- గ్రేడ్ సెంటర్లు, బి-గ్రేడ్, సి-గ్రేడ్ సెంటర్లు అని విభజించేవాళ్లు. సినిమాల విడుదల అట్లే జరిగేది. ఇవాళ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అంతా డిజిటల్ అయిపోయింది. ఏక కాలంలో 1000 నుంచి 1500 హాళ్లల్లో ఒకేసారి సినిమా విడుదలయ్యే స్థితి వచ్చింది. వారంలో సినిమా హిట్టా ఫట్టా అన్నది తేలిపోతున్నది. ఈ నేపథ్యంలో సినిమాలు తీసేవాళ్లకు, ప్రదర్శించేవాళ్లకు, చూసేవాళ్లకు ఎవరికీ తీరిక లేదు. అంతా వేగం, ఒక రకంగా అంతా గాంబ్లింగ్. ఇక మంచి అర్థవంతమైన సినిమాలను ఊహించడం, ఆశించడం అత్యాశేమో. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. మార్పు సహజం. మంచి సినిమాల కోసం మంచి ప్రేక్షకులను తయారు చేద్దాం.

పాన్ ఇండియన్ సినిమా, వంద కోట్ల సినిమా, వందల కోట్ల కలెక్షన్స్' ఇలాంటి మాటలతో, ప్రచారాలతో ఇటీవల మన తెలుగు సినిమా రంగం ఆర్భాటంగా ఊదరగొడుతూ సాగుతున్నది. మరో పక్క రెండు విజయాలూ నాలుగు ఫ్లాప్‌లతో విలసిల్లుతున్నది. 'ఆచార్య'లాంటి వైఫల్యాలతో కునారిల్లుతున్న టాలీవుడ్ రంగం బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ 'పృథ్వీరాజ్', అజయ్ దేవగన్ 'రణ్వే 34' లాంటి సినిమాల అట్టర్ ఫ్లాప్‌లను చూసి కొంత మానసిక ఉపశమనాన్ని పొందుతున్నది. మొత్తం మీద ప్రేక్షకుల పల్స్ అందుకునే క్రమంలో అన్ని భారతీయ ప్రధాన స్రవంతి సినిమా రంగాలు పెద్ద కన్ఫ్యూజన్‌లో పడ్డట్టు కనిపిస్తున్నది. కేవలం హంగూ ఆర్భాటం, పెద్ద స్టార్స్, ఊదరగొట్టే ప్రచారం మాత్రమే సినిమాను ఆర్థికంగా నిలబెట్టలేవు అన్న నిజం మరోసారి స్పష్టమవుతున్నది.

ఒక సినిమా ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించడానికి మంచి కథ, కొంతయినా మంచి కథనం ఎంతైనా అవసరం అన్నది మన తెలుగు సినిమా ప్రపంచం తెలుసుకోవలసిన అవసరం వుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చూసిన రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం. అవి మరీ గొప్ప సినిమాలు కావు కానీ, ఆయా దర్శకులు నిర్మాతలు ఎంచుకున్న సబ్జెక్టులు గొప్పవి. వర్తమాన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో వారిని అభినందించాలి. అవి ఒకటి 'అంటే సుందరానికి' రెండవది 'విరాటపర్వం' ఆయా సినిమాల రూపకర్తల గత ప్రయత్నాల గురించి నాకంతగా తెలీదు కానీ ఈ సినిమాలలో వారు ఎంచుకున్న కథాంశాలు మాత్రం అవసరమైనవి.

మత విద్వేషాల నడుమ

'అంటే సుందరానికి' సినిమా విషయానికి వస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా మతానికి సంబంధించి ఒక విద్వేష పూరిత వాతావరణం నెలకొని వున్నది. దేశం ఒక ఐక్య వాతావరణం నుండి భావ, విశ్వాస, సామాజిక విభజన వైపు మరలుతున్నది. ఆ స్థితిలో మూర్ఖపు అంధ విశ్వాసాలతో వున్న రెండు భిన్న మతాలకు చెందిన రెండు కుటుంబాల నడుమ వియ్యం అందుకోవడానికి సంబంధించిన కథను ఎంపిక చేసుకోవడమే ఈ సినిమాకున్న వైవిధ్యం. రూపకర్తల ధైర్యం. ఇద్దరు యువతీ యువకుల నడుమ ప్రేమ, మత విశ్వాసాల పరంగా కుటుంబాలలో వచ్చే అభ్యంతరాలను ఊహించి ఆ జంట అబద్ధం చెబుతారు. మొత్తంగా సినిమాలో హాస్యాన్ని ప్రధాన కాన్వాస్‌గా చేసుకుని నడిపించిన తీరు చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ పారలల్ నరేషన్ టెక్నిక్ వాడుతూ దర్శకుడు సినిమాను ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా నడిపాడు. సినిమా మొత్తంగా గ్రిప్పింగా లేదు. కానీ, నాని అన్నిమార్కులూ కొట్టేశాడు.

వారి చొరవ అభినందనీయం

ఇక 'విరాట పర్వం' ఇవ్వాళ సినిమా రంగంలో పూర్తి వ్యాపార ధోరణి నెలకొని వుంది. ఆ స్థితిలో ఉత్తర తెలంగాణా జిల్లాలలో పెల్లుబికిన నక్సలైట్ ఉద్యమాన్ని తన సినిమాకు భూమికగా తీసుకోవడంలోనే నిర్మాత, దర్శకుల చొరవ ధైర్యం కనిపిస్తాయి. వాస్తవంగా జరిగిన ఒక విషయాన్ని అనేక సినిమాటిక్ లిబర్టీలు తీసుకుని నిర్మించినప్పటికీ మంచి సినిమా ప్రయత్నమేనని అనిపించింది. దళ నాయకుడి రచనలపైన ఆరాధనని, అతని పైన ప్రేమను గ్లోరిఫయి చేసి రొమాంటిక్ సినిమాగా ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసారు. సమ్మయ్య సంఘటన లాంటి అనేక అంశాలు తీసుకుని వాస్తవీకరించారు. మొత్తం మీద 'విరాటపర్వం' నేటి వాతావరణంలో చాలా గొప్ప ప్రయత్నం. అయితే, ఈ రెండు సినిమాలూ కమర్షియల్ సినిమా హాళ్లలో పెద్దగా ఆడలేదంటున్నారు. కానీ, ఓటీటీలో సక్సెస్‌ఫుల్ గా వున్నాయి.

బాధ్యత అంతా వారిదేనా?

ఇట్లా తెలుగులో అర్థవంతమైన సినిమాల నిర్మాణం విరివిగా జరగక పోవడానికీ, ఒకవేళ ఎవరయినా తీసినా అవి ఆర్థిక విజయాలు సాధించకపోవడానికీ కారణాలు వెతకాల్సిన అవసరం వుంది. ప్రధానంగా 'సినిమాలు చాలా పాడైపోయాయి. గతంలో చాలా గొప్ప సినిమాలు వచ్చాయి, ఇప్పుడంతా వ్యాపారమే' అన్న వాదన వినిపిస్తున్నది. దానికి పూర్తిగా సినిమా వాళ్లదే బాధ్యత అనే అభిప్రాయమూ వుంది. ఇది కొంత నిజమే అయినప్పటికీ, పూర్తి సత్యం కాదు. నేరం మొత్తం సినిమా వాళ్ల మీదే మోపడమూ సమంజసం కాదు. ఎందుకంటే సినిమాలనేవి ఏ ఆకాశంలో నుంచో రావు. అవీ మన సమాజంలో అంతర్భాగమే, మారిన సామాజిక ప్రాధాన్యతలూ, విలువలూ సినిమాల్ని కూడా ప్రభావితం చేస్తాయి. సినిమా ప్రధానంగా జనబాహుళ్య మాధ్యమం. అంటే ప్రేక్షకులు పోషించే వినోద పరిశ్రమ.

ప్రేక్షకులు మారారు, అభిరుచి మారింది

ఒకసారి మన ప్రేక్షకులలో వచ్చిన మార్పులను చూద్దాం. నాలుగైదు దశాబ్దాల క్రితం సినిమాలకు ప్రేక్షకులు ప్రధానంగా మహిళలు, పురుషులు. అంటే పెద్దవాళ్లు. అందుకే సినిమా మొదలైన మొదటి 50-60 సంవత్సరాల పాటు హీరోలూ, హీరోయిన్లూ పెద్దవాళ్లుగానే వుండేవాళ్లు. అంటే they were men and women, అంతేకాదు, అప్పటి తెరమీది హీరోలు డాక్టర్, టీచర్, లాయర్, ఇంజినీర్ ఇట్లా ఏదో ఒక ఉద్యోగం చేసేవాళ్లు. కుటుంబాలూ, ప్రేమలూ అనుబంధాలూ ప్రధానాంశాలుగా ఉండేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రేక్షకులలో 80-90 శాతం నవ యువకులు. ముఖ్యంగా 25 లోపువారే. దాంతో హీరోలు కూడా అదే వయసువాళ్లు కావాల్సి వచ్చింది. అట్లైతేనే యువ ప్రేక్షకులు హీరోలతో తమని తాము ఐడెంటిఫై కాగలిగారు. అలాంటి యూత్ ఫుల్ సినిమాలే విజయవంతమయ్యాయి. దాంతో ముఖ్యంగా 90 తర్వాత పోరలు హీరోలు అయ్యారు.

యువ హీరోలకు ఉద్యోగం, సద్యోగం ఏమీ వుండదు. గాలికి తిరుగుతారు. అమ్మాయిల వెంట పడడం. లేదా క్రిమినల్ కార్యక్రమాలు చేయడం ప్రధానాంశాలు అయ్యాయి. అలాంటివే ఆర్థిక విజయాలు సాధించడం జరగింది. మరో విషయం ఏమిటి అంటే, ప్రేక్షకుల ఆర్థిక స్థితి. దశాబ్దాల క్రితం మా చిన్నప్పుడు సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో నేల టికెట్ 35 పైసలుండేది. అలాంటి స్థితిలో కూడా నెలకు ఒక సినిమాకు వెళ్లడం గగనంగా వుండేది. ఇవ్వాళ మల్టీప్లెక్స్‌లు వచ్చాయి. ఒక సినిమాకు 300 నుంచి 500 రూపాయల వరకు ఖర్చుపెట్టే యువ ప్రేక్షకులున్నారు. టికెట్టే కాకుండా ఇంటర్‌వెల్‌లో స్నాక్స్ అవీ ఇవీ కలిపితే ఇంకా ఎక్కువే ఖర్చు చేసే స్థితి వుంది. అంతలా ఖర్చు చేసే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి అంతే రిచ్ సినిమాలతో పాటు యువకుల సెన్సెస్ (ఇంద్రియాలను) ప్రేరేపించి ఉద్రేక పరిచే సినిమాలు కావాలి. అవే వస్తున్నాయి. అంటే కోట్లు పెట్టి కోట్లు సంపాదించే పనికి సినిమావాళ్లు అలవాటు పడ్డారు.

వేగంతో పెరిగిన మార్పులు

దానికి తోడు గతంలో సినిమా రీళ్లను బాక్సులలో పెట్టి బస్సులలో ఊర్లకు తరలించి ప్రదర్శించేవారు. ఎంతో శ్రమ. అందుకే ఫిలిం ప్రింటులు తక్కువ. ఎ- గ్రేడ్ సెంటర్లు, బి-గ్రేడ్, సి-గ్రేడ్ సెంటర్లు అని విభజించే వాళ్లు. సినిమాల విడుదల అట్లే జరిగేది. ఇవాళ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అంతా డిజిటల్ అయిపోయింది. ఏక కాలంలో 1000 నుంచి 1500 హాళ్లల్లో ఒకేసారి సినిమా విడుదలయ్యే స్థితి వచ్చింది. వారంలో సినిమా హిట్టా ఫట్టా అన్నది తేలిపోతున్నది. ఈ నేపథ్యంలో సినిమాలు తీసేవాళ్లకు, ప్రదర్శించే వాళ్లకు, చూసేవాళ్లకు ఎవరికీ తీరిక లేదు. అంతా వేగం, ఒక రకంగా అంతా గాంబ్లింగ్. ఇక మంచి అర్థవంతమైన సినిమాలను ఊహించడం, ఆశించడం అత్యాశేమో. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు. మార్పు సహజం. మంచి సినిమాల కోసం మంచి ప్రేక్షకులను తయారు చేద్దాం.

వారాల ఆనంద్

94405 01281



Next Story