నా ఎజెండా ఇదే : ఈటల సంచలన కామెంట్స్

by  |
etala-1
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈటల రాజేందర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. సోమవారం ఢిల్లీలో పార్టీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తానొక్కడినే పాలిస్తే బాగుండేదన్న మనస్తత్వంతో కేసీఆర్ ఉంటారన్నారు. సంపూర్ణ మెజార్టీ ఉన్నా కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నారని, 87 సీట్లు గెలిచినా 3 నెలల పాటు కేబినెట్‌ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయిస్తే విమర్శించిన కేసీఆర్ నేడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో ఒక్క మంత్రైనా ప్రశాంతంగా పని చేయగలుగుతున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి కేసీఆర్‌ ఏనాడూ విలువ ఇవ్వలేదన్నారు. ఇతరుల అభిప్రాయాలను కేసీఆర్‌ గౌరవించరని, రేపటి నుంచి తెలంగాణలోని ఉద్యమకారులంతా బీజేపీలో పనిచేస్తారని ఈటల ప్రకటించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, రాబోయే కాలంలో అన్ని జిల్లాల నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయని ఈటల అన్నారు.

రాచరిక ఫ్యూడల్ మనస్థత్వం తప్ప మరోటి కాదని, ప్రగతి భవన్‌లో రాసిచ్చిన నోట్లను ప్రెస్‌మీట్లో మాట్లాడటం తప్ప, ఆత్మ విశ్వాసంతో వ్యవహరించడం లేదని ఈటల ఆరోపించారు. ‘అయినోళ్లకు ఆకులో పెట్టి కానోళ్లకు కంచంలో పెట్టాడని.. ఇంట్లోడు బయటోడు అయి, బయటోడు ఇంట్లోడు అయ్యాడన్నారు’. అనేక విషయాల గురించి తాము అడగిన సందర్భాలు ఉన్నాయని, రేషన్ కార్డులు, ఫించన్లు ఇవ్వలేకపోతున్నామని కూడా అడిగామని ఈటల వివరించారు. అనేక రకాలుగా ఘర్షణలు పడ్డ తరువాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక పాలనను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. వేల కోట్ల డబ్బు సంచులు వచ్చినా ప్రజలను చైతన్య వంతులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దుర్మార్గమైన పాలనను కూలదోయడమే నా ఎజెండా అని అందుకే బీజేపీలో చేరానని రాజేందర్ స్పష్టం చేశారు. ఏ మార్పుకైనా తెలంగాణాలో కరీంనగరే కేంద్ర బిందువని రానున్న మార్పు తథ్యమని ఈటల అన్నారు. చైతన్యానికి మారు పేరైన సంఘాలు ఉండాలని చాలా కాలంగా చెప్తున్నానని, భూ విషయంలో నా భార్య కూడా ఇప్పటికే చెప్పిందని, ఒక ఎకరం భూమి అసైన్డ్ భూమి ఉన్న ముక్కు భూమికి రాస్తానని ప్రకటించారు. భూ వ్యవహారాలపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కానీ, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉండదని, చట్టం నీ చేతుల్లోనే ఉన్నందున దమ్ముంటే విచారణ చేసుకోవాలని ఈటల రాజేందర్ కేసీఆర్‌కు సవాల్ విసిరారు.


Next Story