ప్రభుత్వ సహకారం కావాలి : వొడాఫోన్ ఐడియా!

by  |
Reliance Jio
X

దిశ, వెబ్‌డెస్క్ : సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్) బకాయిలను పూర్తీస్థాయిలో చెల్లించే పరిస్థితిలో కంపెనీ లేదని వొడాఫోన్ ఐడియా టెలికాం విభాగానికి లేఖ రాసింది. సుంకాలు, చెల్లింపుల అంశంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటేగానీ చెల్లించడం సాధ్యపడదని సంస్థ తెలిపింది.

వొడాఫోన్ ఐడియా మొత్తం ఏజీఆర్ బకాయిల కింద రూ. 56,709 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికి కేవలం 7 శాతమే చెల్లించినట్టు టెలికాం విభాగానికి ఇచ్చిన లేఖలో పేర్కొంది. ప్రభుత్వం జీఎస్టీ క్రెడిట్ రూ. 8,000 కోట్లు చెల్లిస్తే ఏజీఆర్ బకాయిలు చెల్లించడానికి వీలవుతుందని వివరించింది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి ఆరు శాతం వడ్డితో 15 ఏళ్ల గడువు ఇవ్వాలని అభ్యర్థించింది. అంతేకాకుండా లైసెన్స్ ఫీజును 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని, స్పెక్ట్రమ్ ఛార్జీలను జీరోగా మార్చాలని కోరింది.

సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) చట్టబద్ధమైన బకాయిలను చెల్లించేందుకు సులభమైన నిబంధనలు కోరుతూ ప్రభుత్వానికి లేఖ పంపించింది. ఏజీఆర్ బకాయిలను తగ్గించడానికి తక్కువ రేట్లతో ఋణాలను పొడిగించి టెలికాం రంగాన్ని కాపాడాలని లేఖలో పేర్కోంది. టెలికాం రంగానికి సంబంధించి రిస్క్ తీసుకోవడానికి బ్యాంకులు ఇష్టపడకపోవడంతో సీవోఏఐ స్పష్టమైన లేఖ రాసింది. లైసెన్స్ ఫీజు చెల్లింపులను పొందడానికి ఫైనాన్సియల్ బ్యాంకుల హామీ అవసరాన్ని తొలగించాలని పేర్కొంది. ఒకవేళ టెలికాం విభాగం ఫైనాన్సియల్ బ్యాంకుల గ్యారంటీలు అవసరమని అభిప్రాయపడితే, పరిశ్రమను బట్టి లైసెన్స్ ఫీజులో నాలుగింట ఒక వంతు తగ్గించాలని పేర్కొంది.

గతేడాది సుప్రీం కోర్టు ఏజీఆర్ బకాయిలు రూ. 1.47 లక్షల కోట్లను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం జనవరి 23 గడువు విధించినప్పటికీ టెలికాం సంస్థలు చెల్లింపుల్లో ఆలస్యం చేశాయి. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించడానికి గడువు పొడిగించాలని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ పిటిషన్ వేశాయి. దాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed