శాటిలైట్లకు పొంచివున్న ప్రమాదం ?

by  |
శాటిలైట్లకు పొంచివున్న ప్రమాదం ?
X

బలహీనపడుతున్న భూ అయస్కాంత క్షేత్రం

భూ అయస్కాంత క్షేత్రం నెమ్మదిగా బలహీనపడుతోందని, తద్వారా భూమి చుట్టూ తిరుగుతున్న కొన్ని శాటిలైట్లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద జీవనానికి అయస్కాంత క్షేత్రం చాలా ముఖ్యమైంది. సూర్యుని నుంచి కాస్మిక్ రేడియేషన్, చార్జ్‌డ్ కణాలు భూమ్మీదకి రాకుండా ఈ అయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది. 3000 కి.మీ.ల లోతున భూఅంతర్భాగంలోని బయటి కేంద్రంలో గల వేడి ఇనుము ద్రవం వల్ల ఈ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ చెప్పిన ప్రకారం దీని కారణంగానే ఎలక్ట్రిక్ ప్రవాహాలు ఉత్పన్నమై విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.

కాగా, 200 ఏళ్ల నుంచి ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావం 9 శాతం బలహీనపడినట్లుగా తెలుస్తోంది. జర్మన్ రీసెర్చి సెంటర్ ఫర్ జియోసైన్సెస్ శాస్త్రవేత్తలు 1970 నుంచి 2020 వరకు అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని పరిశోధించి ఈ విషయం కనిపెట్టారు. సౌత్ అట్లాంటిక్ అనామలీ అని పిలిచే ఆఫ్రికా నుంచి సౌత్ అమెరికా మధ్య ప్రాంతానికి చెందినవారు ఈ పరిశోధన చేపట్టి అయస్కాంత క్షేత్ర బలహీనతను ధ్రువీకరించారు. ఏడాదికి 20 కి.మీ.ల చొప్పున ఈ అనామలీ పడమర వైపుకి కదిలిందని వారు తెలుసుకున్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందనే విషయం మాత్రం వాళ్లకు ఇంకా తెలియరాలేదు. ఇది తెలుసుకోవడానికి వారు యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి స్వార్మ్ ఉపగ్రహాల సాయం తీసుకుంటున్నారు. వీటి ద్వారా అయస్కాంత బలాలను కచ్చితంగా రికార్డు చేయవచ్చు.

అయితే ఇలా జరగడానికి అయస్కాంత ధ్రువాల మార్పిడి కారణం అయ్యుండొచ్చని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ అభిప్రాయపడుతోంది. అంటే ఉత్తర ధ్రువం దక్షిణానికి, దక్షిణ ధ్రువం ఉత్తరానికి మారే ప్రక్రియ అన్నమాట. భూచరిత్రలో ఇలా చాలా సార్లు జరిగింది. ప్రతి 2,50,000 సంవత్సరాలకు ఒకసారి ఇలా ధ్రువాల మార్పిడి జరుగుతుందని జియోసైన్స్ పుస్తకాల్లో ఉంది. కానీ గత 7,80,000 సంవత్సరాలుగా ఇలా జరిగినట్లు ఆధారాలు లేవు. ఆ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్న కారణంగానే ఇలా అయస్కాంత క్షేత్రం బలహీనపడి ఉండొచ్చని స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. ఇలా జరిగితే ప్రధానంగా దెబ్బతినేది టెలీ కమ్యూనికేషన్స్ శాటిలైట్లే. అంటే మొబైల్ ఫోన్స్ వాడకానికి చాలా ఇబ్బందులు కలగొచ్చు. అంతేకాకుండా భూఅయస్కాంత క్షేత్రం ఆధారంగా గమనాన్ని సాగించే పావురాలు, తాబేళ్లు వంటి జంతువులకు కూడా ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.



Next Story

Most Viewed