నేడే దుబ్బాక పోలింగ్.. వారి మీదే ఆశలు!

by  |
నేడే దుబ్బాక పోలింగ్.. వారి మీదే ఆశలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : దుబ్బాక ఉప ఎన్నికకు మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా బాధితులకు, క్వారంటైన్‌లో ఉన్నవారికి సాయంత్రం అదనంగా సమయం కేటాయించనున్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు సిద్దిపేట పోలీసు కమిషనర్ పటిష్ట చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 89 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఇక్కడ కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరిస్తున్నామని కమిషనర్, పోలీసు పరిశీలకులు సరోజ్ కుమార్ ఠాకూర్ తెలిపారు. సుమారు రెండు వేల మంది పోలీసులను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ప్రచార గడువు ముగియడంతో అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా ఓటర్లను సంప్రదిస్తున్నారు. వారిని ప్రలోభపెట్టడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. తాయిలాలు ప్రకటిస్తున్నారు. పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ప్రచారం పోలీసుల కంట పడకుండా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. పోలింగ్ శాతం మీద కూడా వారు అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరిగితే ఎంత లాభం, తగ్గితే ఏమవుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

సైలెంట్ ఓటింగ్‌..

ఈసారి దుబ్బాక ఎన్నికలో సైలెంట్ ఓటింగ్ జరగొచ్చని అభ్యర్థులకు అనుమానాలు బలంగానే ఉన్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో గుమికూడిన జనంలో స్థానికులెవరో, స్థానికేతరులు ఎవరో అభ్యర్థులకు స్పష్టంగా తెలుసు. స్థానిక ఓటర్లను ఇంటింటికీ వెళ్లి కలిసిన సందర్భంలో ఎదురైన అనుభవాన్ని అభ్యర్థులు నెమరు వేసుకుంటున్నారు. మొహమాటం కోసం గెలుస్తామని బయటకు చెబుతున్నప్పటికీ, మనసులో మాత్రం సందేహం వెంటాడుతోంది. నిర్దిష్టంగా ఎవరి ఓటు ఎవరికి పడుతుందో స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నారు. గతంలో ప్రజల నాడి ప్రచారం సమయంలోనూ, ఆ తర్వాత పోలింగ్ రోజునా తెలిసిపోయేది. ఈసారి మాత్రం దానికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇదే అభ్యర్థులను గందరగోళానికి, ఆందోళనకు గురిచేస్తోంది.

వారి మీదే ఆశలు..

ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల విషయంలో పార్టీలకు పెద్దగా భిన్నాభిప్రాయం లేకపోయినప్పటికీ తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగుల ఓటు ఎటువైపు అనే అంశంలో మాత్రం ఏ పార్టీకీ స్పష్టత లేదు. ఈ ఓట్లే నిర్ణయాత్మకం కానున్నాయి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో తమకే పడతాయని బీజేపీ గట్టి విశ్వాసంతోనే ఉంది. సంక్షేమ పథకాలు అందుకుంటున్నవారంతా తమవైపే నిలబడతారని, మద్దతు ఇస్తారని టీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో చేసిన అభివృద్ధి తమకే లబ్ధి చేకూరుస్తుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. అధికార పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమోననే అనుమానంతో చాలాచోట్ల ఓటర్లు తప్పకుండా వేస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ, ఏ పార్టీకి ఓటు వేసినా పథకాలు ఆగవనే విషయం విస్తృతంగా క్షేత్రస్థాయిలో వెళ్లడంతో ఏ అభ్యర్థికి ఓటు వేయాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటున్నారు. గతంలోలాగా చివరి నిమిషం వరకూ ఊగిసలాటలో ఉండి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకునే పరిస్థితి ఈసారి ఉండకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.

నగదు పంపిణీలో పోటాపోటీ…

అన్ని పార్టీల అభ్యర్థులూ ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి నోట్లపై భారీ నమ్మకాలే పెట్టుకున్నారు. ఓటర్ల నాడికి అనుగుణంగా ఓటుకు ధరను నిర్ణయిస్తున్నారు. ప్రాంతాలనుబట్టి ఒక్కో ఓటుకు రూ.500 నుంచి సుమారు రూ.4 వేల దాకా పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఎంత పోలీసు నిఘా ఉన్నా, ఎంతమంది ఎన్నికల పరిశీలకులు ఉన్నా పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా ఈ రహస్య ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నాయి. మద్యం, బిర్యానీ పంపిణీ సరేసరి. కొన్నిచోట్ల ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చడానికి వాహనాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.

డేగ కళ్ల నిఘా…

పోలింగ్ కేంద్రాలకు సోమవారం ఉదయం నుంచే బ్యాలెట్ యూనిట్లను, కంట్రోల్ యూనిట్లను తరలించారు. 400 మంది పీఓలు, 400 మంది ఏపీఓలు 800 మంది అదనపు పోలింగ్ అధికారులను నియమించారు. 315 ఈవీఎంలు అవసరం కాగా, అదనంగా మరో 120 ఏర్పాటు చేశారు. 6,150 మంది వృద్ధులు ఉండగా, వీరిలో 80 ఏళ్ల పైబడి ఉన్నవారు 1,550 మంది ఉన్నారు. ఇందులో 1,340 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంధులకు బ్రెయిలీ లిపితో కూడిన బ్యాలెట్ పత్రాలను సిద్ధంగా ఉంచారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న 130 మందిలో 93 మంది దరఖాస్తులు ఇవ్వగా 73 మంది అర్హులను గుర్తించారు. పోలింగ్ సమయం ముగిసే ఆఖరి గంటకు ముందు వీరు ఓటు వేసేందుకు అనుమతించనున్నారు. 104 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 98 కేంద్రాల్లో వీడియోగ్రాఫర్స్, 113 కేంద్రాల్లో అన్ మ్యాన్డ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 80 మంది సూక్ష్మ పరిశీలకులు 32 మంది సెక్టార్ ఆఫీసర్లు, 32 మంది అసిస్టెంట్ సెక్టార్ ఆఫీసర్లు, ఐదు వేల మంది రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. 750 మంది పోలీసు సిబ్బంది, 100 మంది హోంగార్డులు మంది, 200 మంది స్థానిక సాయుధ బలగాల నుంచి, సీఆర్పీ ఒక కంపెనీ, స్పెషల్ పోలీస్ మూడు కంపెనీలు, మొత్తంగా రెండు వేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed