'ఈజీగా రూ. కోట్లు సంపాదించే ఛాన్స్ ఉందని.. ఇలా చేస్తున్న యువకులు'

by  |
Drags1
X

దిశ, శేరిలింగంపల్లి: హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ మాఫియా వదలడం లేదు. ఏదో ఒక రూపంలో సరఫరాదారులు తమపని తాము చేసుకుపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వాటిని తీసుకొచ్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రాము మత్తు మందు ధర వేలల్లో పలుకుతుండడంతో తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే ఛాన్స్ ఉందని ఈ బిజినెస్ ఊబిలోకి దిగుతున్నారు. పేద, ధనిక అనే తేడా లేకుండా డ్రగ్స్ కు బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న శుభకార్యాలలోనూ ఏదో ఒకరకమైన డ్రగ్స్ తీసుకుని ఎంజాయ్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ఇక ఇయర్ ఎండ్ వస్తుందంటే చాలు మహానగరాన్ని మత్తులో ముంచెత్తడానికి డ్రగ్స్ ముఠాలు రెడీ అయిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి.

పెరుగుతున్న డ్రగ్స్ కల్చర్

న్యూఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైపోతోంది. ఎవరి ప్లాన్లు వారు చేసుకుంటున్నారు. ఎలా ఎంజాయ్ చేయాలి అన్నదానిపై ఎవరికి తోచిన విధంగా వారు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే సందట్లో సడేమియాలా యూత్ మత్తులో ఊగేలా చేసేందుకు డ్రగ్స్ సరఫరాదారులు సైతం పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో నగరంలో ‘ఏదో ఒకచోట తరచూ డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. వీరందరి టార్గెట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీదనే.. ఇయర్ ఎండ్ పార్టీల మీద ఫోకస్ చేసిన విక్రయదారులు గోవా, కశ్మీర్, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆయా రాష్ట్రాల నుంచి డ్రగ్స్ ను నగరానికి తెప్పించడంలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు నగర శివారుల్లోనూ లోకల్ మేడ్ గా తయారు చేస్తూ ఈ ఇయర్ ఎండ్ లో వీలైనంత ఎక్కువగా సప్లై చేసి రూ. కోట్లకు పడగెత్తాలని కొందరు అక్రమార్కులు ఈ బిజినెస్ లోకి దిగుతున్నారు. ఇలాంటి వారికి పాత ఫార్మా కంపెనీలు అడ్డాగా మారాయి. అందులోని ల్యాబ్ లలో పలు రకాల మాదకద్రవ్యాలను తయారు చేస్తున్న ముఠాలు యూత్ మీదకు వదులుతున్నాయి. వీటి మత్తులో పడ్డ యూత్, విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

అడ్డాగా హైదరాబాద్

ఇదివరకు చిన్నా చితకా గంజాయి కేసులు నమోదయ్యే హైదరాబాద్ లో ఇప్పుడు గంజాయి కంటే డ్రగ్స్ కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే ఒకప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డాయి అంటే ఆఫ్రికన్ల అరెస్టులు ఉండేవి. ఇప్పుడు లోకల్ ముఠాలే డ్రగ్స్ తయారు చేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ వినియోగంలో గోవా, ఢిల్లీ నగరాల తర్వాత… హైదరాబాద్ మూడో స్థానంలో ఉందంటే అతిశయోక్తికాదు. ప్రతీ చిన్న పార్టీలో కూడా డ్రగ్స్ వాడకం కామన్ గా మారింది. పబ్లు, బార్లు, రిసార్టులు, ఫామ్ హౌస్ లలో చాలాకాలంగా ఈ దందా సాగుతుండగా ఈ మధ్య ఈ కల్చర్ అన్నిచోట్లకు పాకింది. బర్త్ డే వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలు ఏదో ఒకరకమైన డ్రగ్స్ లేకపోతే నామోషీగా ఫీలవుతున్నారు కొందరు. అదేదో స్టేటస్ సింబల్ అన్నట్లు పోజ్ కొడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే డ్రగ్స్ వాడకం అనేది ఇప్పుడు నయా ట్రెండ్ అంటున్నారు యూత్. ఆయా జిల్లాల్లో లభించే గంజాయితో పాటు కొకైన్, హెరాయిన్, చరాస్, ఎండీఎంఏ బ్లోట్స్, ఓపియం, ఎఫెడ్రోన్, ఎల్ఎస్ఏ స్ట్రిప్స్, ఎలీసీ బ్లోట్స్ నగరానికి వస్తున్నట్లు సమాచారం.

అందరికీ అందుబాటులో..

గతంలో సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ మత్తు మందులు ఇప్పుడు సామాన్యుల చెంతకు కూడా చేరాయి. చివరికి స్కూల్ విద్యార్థులకు సైతం మత్తుమందులు దొరుకుతున్నాయంటే ఈ డ్రగ్స్ ముఠాలు ఏ స్థాయిలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. చిత్రసీమను, ఐటీ ఎంప్లాయిస్ ను టార్గెట్ గా చేసుకుని రంగంలోకి దిగిన డ్రగ్స్ ముఠాలు.. సామాన్యులను సైతం తమ ఉచ్చులోకి లాగుతున్నాయి. వారికి ఏదో ఓరూపంలో అందిస్తూ విద్యార్థి దశ నుంచి డ్రగ్స్ కు దాసోహం అనేలా చేస్తున్నాయి. ఇదివరకు నైజీరియా, ఉగాండా లాంటి ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అయ్యే అత్యంత ఖరీదైన మత్తు పదార్థాలు ఇప్పుడు లోకల్ గానే లభిస్తున్నాయి. గోవా, జమ్మూకశ్మీర్, పంజాబ్ నుంచి ఖరీదైన డ్రగ్స్ హైదరాబాద్ వచ్చి చేరుతున్నాయి. వీటి సరఫరా కోసం పటిష్టమైన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు సరఫరాదారులు. ఎప్పటికప్పుడు పోలీసులకు దొరక్కుండా కొత్త కొత్త పద్ధతుల్లో ఈ డ్రగ్స్ దందాను కంటిన్యూ చేస్తున్నారు.

ఎన్నెన్నో రకాలు..

మాదక ద్రవ్యాల్లో అనేక రకాలున్నాయి. వాటి క్వాలిటీ ఇచ్చే కిక్కును బట్టి వాటి విలువ కూడా మారుతూ ఉంటుంది. ఇదివరకు నగరంలో కేవలం గంజాయి దొరకడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు దేశ విదేశాలకు చెందిన డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు అక్రమార్కులు. కొకైన్, ఓపియం, హెరాయిన్, ఎల్ఎస్, ఎండీఎంఏ, బ్రౌన్ షుగర్, చరస్, వంటి డ్రగ్స్ కు హైదరాబాద్ లో మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

శాఖల మధ్య సమన్వయ లోపం

నగరంలో తరుచూ ఏదో ఒకచోట డ్రగ్స్ ముఠాలు పట్టుబడుతూనే ఉన్నాయి. అయినా అధికారులు నియంత్రణలో సీరియస్ గా వ్యవహరించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నార్కోటిక్ సెల్, డ్రగ్ కంట్రోల్ బోర్డ్, డీఆర్ఐ, సీఐడీలోని యాంటీ నార్కోటిక్ సెల్, ఎక్సైజ్ శాఖలు ఉన్నా, సరైన నిఘా లేక సరఫ రాదారులు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇయర్ ఎండ్ టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వారిని అధికారులు ఎలా కట్టడి చేస్తారన్నది ఇప్పుడు శేషప్రశ్నగా మారింది.



Next Story

Most Viewed