జోగిపేటవాసుల ఆందోళన.. డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్ల పంపిణీ వాయిదా

by  |
జోగిపేటవాసుల ఆందోళన.. డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్ల పంపిణీ వాయిదా
X

దిశ, ఆందోల్: ఆందోల్‌లో డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్ల పంపిణీ పక్రియ వాయిదా పడింది. పట్టణంలోని 324, డాకురులోని 104 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు.. ఆర్డీవో అంబదాసు రాజేశ్వర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆందోల్-జోగిపేట మున్సిపల్‌కు సంబంధించి ఆందోల్‌లో నిర్మించిన 324 ఇండ్లను కేవలం 5 వార్డుల పరిధిలోనే దరఖాస్తులు తీసుకున్నారు. 15 వార్డులు కలిగిన జోగిపేట నుంచి ఒక్క దరఖాస్తు కూడా ఎందుకు తీసుకోలేదని జోగిపేటకు చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానికులు ఆర్డీవోను నిలదీశారు. ఆందోల్‌లోని 4 వ వార్డులో కేవలం 20 మందిని మాత్రమే ఎంపిక చేశారని, మిగతా వార్డుల్లో 50 నుంచి 70 వరకు లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అయినందుకే వివక్ష చూపించారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని 4వ, 17వ వార్డు కౌన్సిల‌ర్‌లు హరికృష్ణ గౌడ్, చిట్టిబాబు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. సమావేశం వద్ద ప్రజలు కూడా ఆందోళన చేయడంతో పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మరోసారి లబ్ధిదారుల ఎంపిక సమావేశాన్ని నిర్వహిస్తామని, ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. అలాగే డాకురుకు సంబంధించిన 104 ఇండ్లకు గాను 113 మందిని అర్హులుగా గుర్తించిన అధికారులు లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించారు. అయితే అదే గ్రామానికి చెందిన మొగులయ్య అనే వ్యక్తి అనర్హులు చాలా మంది ఉన్నారని, జాబితాలో తన పేరు ఉండగా కొందరు కావాలనే తొలగించారన్నారు. మరోసారి పరిశీలించిన తర్వాతనే ఇండ్ల కేటాయింపు జరపాలని ఆపే ప్రయత్నం చేయగా, పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అశోక్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed