డోస్ లేదంటే స్కూల్‌కు నో ఎంట్రీ..

by  |
డోస్ లేదంటే స్కూల్‌కు నో ఎంట్రీ..
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్కూళ్లను ప్రారంభిస్తే టీకా తీసుకున్నోళ్లను మాత్రమే అనుమతించాలని వైద్యశాఖ ప్రభుత్వాన్ని కోరింది. పిల్లల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. పాఠశాలలకు వచ్చే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు పేరెంట్లకూ టీకాను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను జారీ చేయాలన్నది. లేదంటే పెద్దల ద్వారా పిల్లల్లో వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి అంతర్గత నివేదికను అందించింది. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూ ఈ నిబంధనలు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నది.

ఇప్పటికే ఏపీ, మహరాష్ర్ట వంటి పొరుగు రాష్ర్టాల్లో వందలాది మంది చిన్నారులు వైరస్ బారిన పడుతున్నారని వైద్యశాఖ గుర్తుచేసింది. దీంతో పాఠశాలలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నది. స్కూల్స్ తెరిచే లోపు టీచర్లు, ఇతర సిబ్బందిలు కనీసం ఒక్క డోసు అయినా తీసుకోవాలని వైద్యశాఖ సూచించింది. పాక్షిక డోసుతో కొంత వరకు రక్షణ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.

6 లక్షల మంది టీచర్లకు టీకా..

రాష్ర్ట వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది టీచర్లకు వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. వీరిలో 50 శాతం ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉపాధ్యాయులూ ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు మరో 2 లక్షల మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌కు డోసులు ఇచ్చినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. అయితే ఇప్పటి వరకు టీకా తీసుకోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ తప్పనిసరిగా టీకా పొందాలని వైద్యశాఖ సూచించింది. టీకా పొందాలనుకునే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తమను సంప్రదిస్తే స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సిన్‌ను అందిస్తామని పేర్కొన్నది.

15 రోజులకోసారి టెస్టులు చేయించుకోవాలి..

పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, ఇతర సిబ్బంది ప్రతీ 15 రోజులకోసారి కరోనా టెస్టులు చేసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు అవసరమైన సౌకర్యాలను వైద్యశాఖ సమకూర్చుతుందని స్పష్టం చేసింది. జిల్లా వైద్యాధికారికి స్కూళ్ల వివరాలు ఇస్తే ప్రత్యేక టీంలు వచ్చి పరీక్షలు నిర్వహిస్తారన్నది. స్కూల్స్‌కు వచ్చే చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని ఆరోగ్యశాఖ నొక్కి చెప్పింది. పిల్లల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం తీసుకోవద్దని వివరించింది.

గతేడాది అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి

పాఠశాలలు ప్రారంభించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెల్త్ ఆఫీసర్లు వివరించారు. గతేడాది స్కూళ్ల ద్వారా వ్యాప్తి జరిగిన అంశాన్ని గుర్తుచేసుకోవాలన్నది. స్కూల్స్ తెరిచిన ఒకటిరెండ్రు నెలల్లోనే వందలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడ్డారని వైద్యశాఖ గుర్తుచేసింది. దీంతో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తు.చ తప్పక పాటించాలన్నది. ప్రతీ స్కూళ్లో థర్మల్ స్క్రీనింగ్, మాస్కు, భౌతికదూరం వంటి సూత్రాలు పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నది.

Next Story

Most Viewed