వైరల్ అవుతున్న ‘దొరకునా ఇటువంటి సేవ’మూవీ పోస్టర్

by  |
వైరల్ అవుతున్న ‘దొరకునా ఇటువంటి సేవ’మూవీ పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: కళాత్మక దృశ్యకావ్యంగా తెలుగు మూవీ హిస్టరీలో స‌రికొత్త అధ్యాయాన్ని సృష్టించిన చిత్రం ‘శంక‌రాభ‌ర‌ణం’. కళాతపస్వి కె.విశ్వనాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జె.వి.సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రంలోని పాట ‘దొరకునా ఇటువంటి సేవ’. ఈ పాటలోని మొదటి లైన్ తీసుకుని టైటిల్ పెట్టారు. ఈ పేరుతో ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌లో నటీనటులు ఎవరూ లేరు. టైటిల్ కోసమే వైరల్ అవుతుందా? అంటే..కాదని చెప్పాలి. టైటిల్ మీద ‘ఇన్‌క్రెడిబుల్ రివెంజ్ ఇన్ దిస్’ అని క్యాప్షన్‌లో ‘DIS’ అక్షరాలను పెద్దగా డిజైన్ చేయించడం, ముఖ్యంగా ‘I’లో అమ్మాయి షాడో..ముగ్గురు పురుషుల చూపుడు వేలును ఓ అమ్మాయి పట్టుకొని ఉంది. దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను నటుడు టి.ఎన్.ఆర్ విడుదల చేశారు.

టీజర్ విడుదలయ్యే వరకూ నటీనటులు ఎవరనేది సస్పెన్సని నిర్మాత దేవ్ మహేశ్వరం తెలిపారు. కొత్త నటీనటులతో చేశామా? పాత నటీనటులతో చేశామా? అనేది టీజర్ చూసి తెలుసుకోవాలని సూచించారు. రచయిత, దర్శకుడు రామచంద్ర రాగిపిండి మాట్లాడుతూ వివాహేతర సంబంధాలకు సంబంధించిన కథతో సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా సినిమాను రూపొందించామన్నారు. ఇటీవల ఓ డేటింగ్ యాప్ చేసిన సర్వేలో ప్రతి పదిమందిలో ఏడుగురు వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపిస్తున్నారని తేలిందని, ఆ ఏడుగురిలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ శాతం ఉన్నారనే విషయం తెలిసి షాకయ్యానని చెప్పాడు. మరో సర్వేలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల్లో వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న నేరాలు మొదటి స్థానంలో ఉన్నాయని వివరించారు. వివాహేతర సంబంధాలు పెట్టుకున్న మనుషుల వల్ల సంబంధం లేని వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అనే అంశంతో మూడు కథల సంకలనం (యాంథాలజీ)గా నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో సినిమాను రూపొందించామని చెప్పారు. ఈ మూవీకి ఎడిటర్ చోటా కె.ప్రసాద్ కాగా, సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నారు.



Next Story

Most Viewed