కీరదోస తొక్కల నుంచి ప్యాకేజింగ్ మెటీరియల్..

by  |
కీరదోస తొక్కల నుంచి ప్యాకేజింగ్ మెటీరియల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు కొనడం పెరిగిన తర్వాత వాటి ప్యాకేజింగ్ సమస్యగా మారింది. ప్రతి చిన్న పదార్థాన్ని చక్కగా ప్యాక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. ఆహార పదార్థాలకు ఎకో-ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ అవసరం కాబట్టి దాని కోసం కంపెనీలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ సమస్యకు కీరదోస పరిష్కారాన్ని చూపించింది. తేలిగ్గా తీసి పారేసే కీరదోస తొక్కతో పర్యావరణహిత ప్యాకేజింగ్ మెటీరియల్‌ను తయారు చేయొచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు నిరూపించారు. వేరే కూరగాయల తొక్కలలో కంటే కీరదోస తొక్కలో ఎక్కువ శాతం సెల్యూలోజ్ ఉన్న కారణంగా ఇది సాధ్యమైందని వారు తెలిపారు.

ఈ తొక్కల నుంచి తీసిన సెల్యూలోజ్ నానోక్రిస్టల్‌లతో పర్యావరణహితమైన, బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ మెటీరియల్‌ను వారు తయారుచేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గించాలనుకున్నా, మారుతున్న పరిస్థితుల కారణంగా అది తగ్గడం లేదని అసిస్టెంట్ ప్రొఫెసర్ జయీత మిత్ర అన్నారు. అలాగే సహజ పాలిమర్లతో ప్యాకేజింగ్ మెటీరియల్‌ను తయారుచేయడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కంపెనీలు ముందుకు రావడం లేదని, ఇప్పుడు తమ పరిశోధన వల్ల ప్యాకేజింగ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. భారతదేశంలో ముఖ్యంగా పచ్చళ్లు, సలాడ్లు, ఉడికించిన కూరగాయలు, కాఫీలు, టీలు ప్యాక్ చేసుకోవడానికి ఈ కీరదోస నుంచి తయారుచేసిన ప్యాకేజింగ్ మెటీరియల్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed