అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు: ఎర్రోళ్ల శ్రీనివాస్

by  |
అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు: ఎర్రోళ్ల శ్రీనివాస్
X

దిశ – మెదక్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు అలసత్వం ప్రదర్శించ వద్దని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు. స్థానిక ఆర్అండ్ బి అతిథి గృహంలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్ రాం బాలనాయక్ లీలాదేవి లతో కలిసి ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ…తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త పంథాలో ఈ కమిషన్ ముందుకు సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో దళిత గిరిజనులపై అణిచివేత, అసమానత్వం, అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కమిషన్ నిరంతరం పనిచేస్తోందని చైర్మన్ వెల్లడించారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 10 వేల 500 అట్రాసిటీ కేసులు నమోదు కాగా సెప్టెంబర్ నాటికి ఎనిమిది వేల కేసులు పరిష్కరించి 56 కోట్ల 50 లక్షల రిహాబిలిటేషన్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో కమిషన్ అంటే కాగితాలకు ఆఫీస్ కు మాత్రమే పరిమితమయ్యేదనీ.. కానీ నేడు కమిషన్ అన్ని జిల్లాలు తిరుగుతూ క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తోందన్నారు. దళితులు గిరిజనుల పై దాడులు అరికట్టడానికి తహశీల్దార్ స్థాయి నుండి కలెక్టర్, ఎస్ఐ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ప్రతి నెలలో ఒకరోజు పౌర హక్కుల దినోత్సవం జరపాలని సూచించారు. రాష్ట్రంలో 12వేలకు గాను 8600 గ్రామపంచాయతీల్లో పౌర హక్కుల దినోత్సవం జరుపుకొని భారతదేశంలో అగ్రభాగాన నిలిచానమని ఆయన తెలిపారు. కమిషన్ కు ఎనిమిది వేల దరఖాస్తులు రాగా 85 శాతం కేసులు ఆయా జిల్లాలకు పంపి పరిష్కరించామని చైర్మన్ తెలిపారు. ప్రజల మధ్య అధికారుల సమక్షంలో జన అదాలత్ గురు శుక్రవారాల్లో సంగారెడ్డి పట్టణంలో నిర్వహించనున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పది కేసులను విని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed