అధికార పార్టీలో అసంతృప్తి సెగలు

by  |
అధికార పార్టీలో అసంతృప్తి సెగలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అధికార పార్టీలోని అసంతృప్తి నేతలు పరేషాన్ అవుతున్నారు. పార్టీలో ఉన్నా ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని, డబ్బు ఖర్చు చేసినా గుర్తింపు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. నామినేటెడ్ పదవులూ వచ్చే అవకాశం లేకపోవడంతో టీఆర్ఎస్‌లో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ అంధకారమేనా..? అని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బీజేపీవైపు గులాబీ నేతలు చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీలో చేరారు. దీనికితోడు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌లో బీజేపీకి సరెండర్ అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతుండడంతో బీజేపీలోకి వెళ్లేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీతో టచ్‌లోకి..

టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలంతా బీజేపీతో టచ్ లోకి వెళ్లుతున్నట్లు సమాచారం. ఆ పార్టీ ముఖ్య నాయకులతో ఉన్న పరిచయాలు, కామన్ ఫ్రెండ్స్ ద్వారా ములఖాత్ అవుతున్నట్లు తెలిసింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ టీఆర్ఎస్ నేత ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా బేటీ అయినట్లు తెలిసింది. శివారు ప్రాంతంలో తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి బర్త్ డే వేడుకలకు హాజరైన సదరు ఎమ్మెల్యేతో రహస్యంగా మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఆ ఎన్నికల్లో భారీ మొత్తంలో ఖర్చు పెట్టుకొని, రాజకీయాల్లో కీలకంగా వ్యవహారిస్తున్నా.. తన సేవలకు గుర్తింపు లేదని సదరు ఎమ్మెల్యేతో వాపోయినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ సీటు కోసం అడిగిన సరైన సమాధానం రావడం లేదు.

కనీసం ఏదైనా నామినేటేడ్ పదవి ఇస్తారని ఆశించిన అధిష్ఠానం పట్టించుకోవడం లేదని, ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ప్రొటో కాల్ సమస్య వస్తుందని, పార్లమెంట్ సెగ్ మెంట్ పరిధిలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు దూరం పెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో సదరు ఎమ్మెల్యే బీజేపీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే జమలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.

అయితే తన సమీప బంధువు మంత్రి కావడంతో ఏమి చేయాలో పాలుపోక సదరు నేత సన్నిహితులు, రాజకీయ విశ్లేషకులతో తాజా రాజకీయ పరిణామాలపై అరా తీస్తున్నట్లు తెలిసింది. అతడు ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా నగరానికి చెందిన ఓ మంత్రి తన నియోజకవర్గంలో బీజేపీకి చెందిన ఓ మహిళ కార్పొరేటర్ గెలుపునకు సహకరించారని ప్రచారం జరుగుతోంది. సదరు మహిళ కార్పొరేటర్ భర్త నిత్యం మంత్రి బంధువుతోనే తిరుగుతుండడం, తాజా కార్పొరేటర్ బంధువు సైతం మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండడంతో ఈ వాదనకు బలం చేకూర్చుతోంది.

తెలంగాణపై కమలం ఫోకస్..

తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ అధిష్టానం నిర్థిష్ట కార్యాచరణతో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం తదితర రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై పూర్తిస్థాయిలో నజర్ పెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేఖతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, నిర్వాకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది కమలనాథుల వ్యూహంగా కన్పిస్తోంది. లక్ష్యం కేసీఆరే అయినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని టార్గెట్ చేయాలన్నది బీజేపీ నిర్ణయంగా కన్పిస్తోంది. సర్కారు తీసుకున్న, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలు వివిధాంశాలపై అనుసరిస్తున్న వైఖరి మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర పార్టీ నేతలు పలు దఫాలు చర్చించారు.

ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుందని వీరు అభిప్రాయపడ్డారు. వచ్చే ఆరునెలలూ కీలకంగా మారబోతున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్వాకాలను అన్ని రీతుల్లో హైలైట్‌ చేయాలని, అంటే అటు కోర్టులు, దర్యాప్తు సంస్థలను కూడా రంగంలోకి దించాలని వీరు భావిస్తున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్న ఈ ఆరు సంవత్సరాల్లో కేసీఆర్‌ పరిపాలన ఇంతగా ఎన్నడూ అప్రతిష్టపాలు కాలేదని, బలహీనంగానే ఉన్న సమయంలోనే ఆయనను రాజకీయంగా దెబ్బతీయాలని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ ఈ మధ్య ఢిల్లీ వెళ్లి ప్రధానితో సమావేశమైన సమయంలో రాజీయత్నాలు జరిగాయని, కానీ అవేవీ నెరవేరలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

బీజేపీయే ప్రత్యామ్నాయం..!

తెలంగాణలో టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని మార్చేందుకు ఈ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలని బీజేపీ నిశ్చయించినట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ బలహీనపడిందని, టీఆర్‌ఎస్ ను ఎదుర్కొనే సత్తా తమకు మాత్రమే ఉందని, ప్రజల్లోకి తీసికెళ్లాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి-రహిత, నిర్ణయాత్మక పాలనను ప్రజల్లో ప్రచారం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరకుండా కేసీఆర్‌ ప్రభుత్వం ఎలా అడ్డుపడుతుందో వివరిస్తూ ధాటిగా ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. కేసీఆర్‌ సర్కార్‌ పనితీరు, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి గవర్నర్‌ తమిళిసై ఇప్పటికే కేంద్రానికి నివేదిక సమర్పించగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అమిత్‌ షా, జేపీ నడ్డాలకు నివేదిస్తున్నారు.

త్వరలో కేసీఆర్‌ సర్కార్‌ అంతర్గత సంక్షోభంలో పడే అవకాశాలు కూడా ఉన్నాయని బీజేపీ సీనియర్‌ నాయకుడొకరు చెప్పారు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామల నేపథ్యంలో టీఆర్ఎస్ కంటే బీజేపీయే మేలని పలువురు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమకు ఉన్న పరిచయాలు, సన్నిహితులతో బీజేపీ నేతలను కలుస్తుండడం… పరోక్షంగా వారికి అన్ని విషయాల్లో సహకరిస్తూ.. ప్రత్యామ్నాయ భవిష్యత్ రాజకీయ కార్యచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.



Next Story