గాంధీ ఆస్పత్రిలో ‘డైరెక్టు ’అడ్మిషన్లు బంద్!

by  |
గాంధీ ఆస్పత్రిలో ‘డైరెక్టు ’అడ్మిషన్లు బంద్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అతి త్వరలో గాంధీ ఆసుపత్రిలో నేరుగా అడ్మిషన్లు పొందే అవకాశం బంద్ కానున్నది. ఈ ఒక్క ఆసుపత్రే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లోనూ ఇదే పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. స్థానికంగా ఉండే పల్లే, బస్తీ దవఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా, జిల్లా ఆసుపత్రుల నుంచి రిఫరల్ ఉంటేనే టీచింగ్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అత్యవసర కేసులకు మాత్రం ఎలాంటి షరతులు లేకుండానే చేర్చుకోనున్నారు. ఆ తర్వాత ఆ జిల్లా వైద్యాధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వనున్నారు. హాస్పిటల్స్ లో తీసుకువస్తున్న ఈ నూతన లింక్ విధానంతో పెద్దాసుపత్రుల్లో రద్దీ తగ్గడమే కాకుండా పేషెంట్లకూ వేగంగా వైద్యం అందుతోందని ఆరోగ్యశాఖ ఉన్నతాకారులు పేర్కొంటున్నారు.

ఎందుకీ నిర్ణయం..?

చాలా మంది చిన్నపాటి జ్వరం, గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా నేరుగా గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఎంజీఎం హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. దీంతో ఆసుపత్రుల్లో రద్దీ పెరగడమే కాకుండా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతున్నది. దీంతో సకాలంలో వైద్యం అందాల్సిన వారికి ట్రీట్మెంట్ జరగడం లేదు. అంతేగాక మందులు కొరత కూడా ఏర్పడుతున్నది. ఇక నిర్ధారణ పరీక్షల్లోనూ ఆలస్యమవుతున్నది. తద్వార కొందరి పేషెంట్లకు ఆరోగ్య పరిస్థితులు విషమిస్తున్నాయి. అంతేగాక వార్డులు, వెయింటింగ్ హాళ్లు రోగులు, వారి సహయకులతో నిండిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నది. ఈ సమస్యలను లింక్ సిస్టంతోనే పరిష్కరించవచ్చని వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదించారు. జ్వరాలు, ఇతర సాధారణ రోగాలకు స్థానికంగా ఉండే ప్రభుత్వాసుపత్రుల్లోనే ట్రీట్మెంట్ అందిస్తే రోగులతో పాటు డాక్టర్లకూ మేలు జరుగుతుందని ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి వివరించింది. రెండ్రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఈ విధానానికి ఓకే చెప్పినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. సాధ్యసాధ్యలపై పూర్తిస్థాయి నివేదిక ను అందజేయాలన్నారు. దీంతో పాటు లింక్ సిస్టం తో వచ్చే సమస్యలను కూడా ఆ రిపోర్టులో క్రోడీకరించాలని సీఎం సూచించినట్టు ఓ అధికారి ‘దిశ’కు చెప్పారు.

లింక్ ఇలా…

ఎవరికైనా జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలుంటే మొదట పల్లే, బస్తీ దవాఖానాలకు వెళ్లాలి. అక్కడ ప్రాథమిక పరీక్షలు నిర్వహించి సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇతర హాస్పిటల్స్ కు పంపించనున్నారు. టెస్టుల నిర్ధారణకు తెలంగాణ డయాగ్నస్టిక్తో అనుసంధానం చేయనున్నారు. పల్లే, బస్తీ దవాఖానాలు అందుబాటులో లేని వారు నేరుగా పీహెచ్ సీలకు వెళ్లొచ్చు. ఇలా పల్లే దవాఖాన నుంచి మెడికల్ కాలేజీల వరకు లింక్ విధానం ఉంటుంది. ఆయా ఆసుపత్రుల్లో పరిష్కారం కానీ సమస్యలకు గాంధీ, ఉస్మానియా లకు రిఫర్ చేసేలా ప్లాన్ తయారు చేయనున్నారు. ఈ ఆసుపత్రులన్నింటినీ ఆన్ లైన్ విధానంతో అనుసంధానం చేయనున్నారు.

అత్యవసర కేసులకు ఎంతో ఉపయోగకరం

ప్రభుత్వం నూతనంగా తీసుకురాబోతున్న ఈ విధానంతో అత్యవసర కేసులకు సకాలంలో వైద్యం అందుతోంది. తద్వారా గోల్డెన్ అవర్ మిస్ కాదు. దీంతో రోగి వేగంగా కోలుకోవడానికి సులువుగా ఉంటుంది. అంతేగాక వైద్యులు మానిటరింగ్ కూడా మెరుగ్గా ఉంటుంది.

Next Story

Most Viewed