అయోమయం… గందరగోళం

by  |
అయోమయం… గందరగోళం
X

వ్యవసాయేత ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన సర్వే గందరగోళంగా సాగుతోంది. సర్వే కోసం జీహెచ్ఎంసీ పరిధిలో పలువురు సిబ్బందిని కేటాయించారు. వివరాలను నమోదు చేశాక పాస్‌ బుక్‌లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భవిష్యత్‌లో అనేక అవసరాలకు ఈ డేటా ఉపయోగపడుతుందని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన సర్వే లోపభూయిష్టంగా జరుగుతోంది. ఎలాంటి ప్రణాళిక లేకుండా, అనుభవం లేని సిబ్బందిని ఇందుకోసం వినియోగిస్తున్నారు. ‘దిశ’ ప్రతినిధి సర్వే సిబ్బందితో కలిసి సోమవారం పలు ప్రాంతాలలో పర్యటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్తుల సేకరణ సర్వే అయోమయంగా తయారైంది. సిబ్బందికి మొబైల్ యాప్‌పై అవగాహన కలిగించలేదు, శిక్షణ అంతకన్నా ఇవ్వలేదు. వివరాలు తప్పుల తడకగా రికార్డుల్లోకి ఎక్కుతున్నా యి. భవిష్యత్‌లో కొత్త సమస్యలు తలెత్తేలా ఉన్నాయి. సర్వే సిబ్బంది సైతం స్వయంగా ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతినిధి ఉప్పల్ సర్కిల్‌లోని చిలకానగర్ ఏడో వార్డు, గోషామహల్ సర్కిల్‌లోని ఫీల్‌ఖానా ఐదో వార్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సర్వే సిబ్బందిని అనుసరించారు. అందులో అనేక ఆసక్తికర విషయాలు తెలిశాయి.

వ్యవసాయేతర ఆస్తులను రికార్డు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నిర్ధిష్టంగా, సమగ్రంగా ఉండేలా ప్లాన్ చేసింది. సర్వే కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగడుగునా సమస్యలే ఎదురవుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సర్వే కోసం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నవారిని నియమించారు. వారికి మొబైల్ యాప్‌లో వివరాలను ఎలా నమోదు చేయాలో తెలియదు. ఎంటమాలజీ, శానిటేషన్, స్పోర్ట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో సర్వే చేయిస్తున్నారు. ఇళ్ల యజమానులు ఇచ్చిన సమాధానాలను వీరు యాప్‌లో అప్లోడ్ చేయలేకపోతున్నారు. సర్వే ప్రాధాన్యం గురించిగానీ, యజమానుల నుంచి తీసుకోవాల్సిన వివరాల గురించి వారికి శిక్షణ కూడా ఇవ్వలేదు. “ఈ సర్వే ప్రభుత్వం చేయిస్తోందా. లేక ప్రైవేట్ సంస్థ చేస్తోందా” అంటూ ఒకరు ప్రశ్నించారు. ఒక్కొక్కరు 30 ఇళ్లను సర్వే చేయాలని అధికారులు ఆదేశించారు. ఐదు ఇళ్లను కూడా చేయలేక పోతున్నారు.

పర్యవేక్షణ లోపం

సర్కిల్‌కు ఇద్దరు లేదా ముగ్గురు బిల్ కలెక్టర్లను సర్వే పర్యవేక్షణ కోసం కేటాయించారు. ఒక్కొక్కరు కనీసంగా రెండు వేల ఇండ్ల నుంచి వివరాలను నమోదు చేయాలి. వీరికి తలా పది మందిని సహాయకులుగా నియమించారు. వీరి మధ్య పని విభజన జరగలేదు. ఒకరు వెళ్లిన ఇంటికే మరుసటి రోజు మరొకరు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. వివరాలను తీసుకున్న ఇండ్లకు గుర్తింపు మార్కు కూడా పెట్టడం లేదు. యాప్‌లో ఎంట్రీ పూర్తయిందనే వార్నింగ్ కూడా రావడం లేదు. ఒకే ఇంటికి రెండుసార్లు వెళ్ళినప్పుడు సర్వే సిబ్బందికి, యజమానులకు వాదన జరుగుతోంది. ఏ రోజుకారోజు ఎక్కడెక్కడ ఎంత మేరకు సర్వే పనులు పూర్తయ్యాయో పర్యవేక్షించే వ్యవస్థ కూడా లేదు. ఈ నెల పదికల్లా సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రోజుకు 20 ఇండ్ల చొప్పున ఒక సర్కిల్ పరిధిలో సర్వే పూర్తి కావాలంటే కనీసం వంద రోజుల పైనే పడుతుందని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కొన్ని ఇండ్లకు తాళం వేసి ఉంటోంది. రెండో రోజూ చూస్తారు. ఆపైన ఆ ఇంటికి సర్వే ఉండదు. సర్వే ఎందుకు? మీకెందుకు వివరాలు చెప్పాలి? అసలు మీరు జీహెచ్ఎంసీ వాళ్లేనా? కాదా? ఎవరికీ తెలుసు? అని అడుగుతున్నారు. కొంద రైతే అసభ్య పదజాలంతో తిడుతూ వెళ్లగొడుతున్నారని సిబ్బంది వాపోయారు. అలాంటి ఇండ్లలో సర్వే చేయడం కుదరడం లేదని చెప్పారు. కొన్నిచోట్ల ఉర్దూలో, మరికొన్నిచోట్ల ఇంగ్లిషులో అడిగే ప్రశ్నల్లో సిబ్బందికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వారు చెప్పిందే రాసుకుని

సర్వే కోసం వాడుతున్న మొబైళ్లన్నీ సిబ్బంది వాడుతున్నవే. ఇండ్ల కొలతలను కూడా చూస్తామంటూ ప్రభుత్వం చెప్పినా, ఇప్పుడు మాత్రం ఇళ్ళ యజమానులు చెప్పిందే రాసుకుని వెళ్లిపో తున్నారు. ఆధార్ కార్డ్ నెంబర్‌‌తో పాటు యజమాని ఫోటో తీయాల్సి ఉన్నా, ఆప్షనల్ కావడంతో చాలాచోట్ల తీసుకోవడంలేదు. కొన్ని చోట్ల అద్దెకు ఉంటున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. సర్వే ఎందుకు జరుగుతుందో అద్దెకుండేవారికి తెలియడం లేదు. వారు అద్దెకుండేవారా లేక భవనం యజమానులా అనేది సిబ్బంది తెలుసుకోవడంలేదు. ఒకసారి నమోదయిన ఇంటి నెంబర్, ఆధార్ కార్డు వివరాలు ఆ యాప్‌లో సేవ్ అయ్యి ఉండాలి. ఎన్నిసార్లు సర్వే చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసే తీరులోనే ఉంటోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడంతప్ప తాము చే యగలిగిందేమీలేదని సర్వేలో పాల్గొన్న ఎంటమాలజీ సిబ్బంది ఒకరు చెప్పారు. ఓ ఇంటి యజమాని కనీసం ఇంట్లోకి కూడా రానివ్వకుండా బూతులు తిడుతూ బయటనుంచే పంపించివేశా రని చెప్పారు. ‘‘ఇప్పుడయితే సర్వే చేస్తున్నాం. అందులో తప్పులున్నట్టు యజమాని గుర్తిస్తే ఏమవుతుందో తెలియదు. అప్పుడు మాపైన ఎలాంటి యాక్షన్ ఉంటుందో తెలియదు. తప్పుడు వివరాలు నమోదుచేశామంటూ మా ఉద్యోగాన్ని పీకేస్తారేమో! ” అని తన బాధను వెళ్లగక్కాడు.

Next Story

Most Viewed