సీఎం దత్తత గ్రామంలోనే ‘ధరణి పోర్టల్’ లాంచ్!

by  |
సీఎం దత్తత గ్రామంలోనే ‘ధరణి పోర్టల్’ లాంచ్!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ధరణి పోర్టల్ ప్రారంభానికి సర్వం సిధ్దమైంది. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దత్తత గ్రామం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఇందుకోసం సిద్ధం చేశారు. ఈ నెల 29 గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ పోర్టల్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

బుధవారం ప్రారంభోత్సవ ఏర్పాట్లను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జెడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ సుత్తానియా, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అరవింద్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌చార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి పోలీసు అధికారులు, అదనపు కలెక్టర్ విద్యాసాగర్, జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం ధరణి పోర్టల్‌ ప్రారంభం అనంతరం మూడు చింతల పల్లి శివారులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ధరణి పోర్టల్‌కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయనున్నారని అధికారులు తెలిపారు.


Next Story

Most Viewed