ధనలక్ష్మి బ్యాంక్ త్రైమాసిక నికర లాభం 69 శాతం క్షీణత!

by  |
ధనలక్ష్మి బ్యాంక్ త్రైమాసిక నికర లాభం 69 శాతం క్షీణత!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రైవేట్ రంగం బ్యాంకు ధనలక్ష్మి 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో నికర లాభం 69 శాతం క్షీణించి రూ. 6.09 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 19.84 కోట్లను ఆర్జించింది. ఇక, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 256.75 కోట్ల నుంచి రూ. 278.62 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫలింగ్‌లో పేర్కొంది. ఇక, వడ్డీ ఆదాయం ఈ త్రైమాసికంలో రూ. 236.65 కోట్లకు తగ్గింది.

గత ఆర్థిక సంవత్సరం ఇది రూ. 240.43 కోట్లుగా ఉంది. రాని బాకీలు, ఇతరాల కోసం బ్యాంకు కేటాయింపులు రూ. 37.02 కోట్లకు పెరిగాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 9.27 కోట్లుగా ఉంది. అయితే, మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ. 56.89 కోట్లుగా ఉంది. అలాగే, జూన్ 30 నాటికి బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 6.89 శాతానికి పడిపోయాయని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం ఎన్‌పీఏలు 7.61 శాతంగా ఉంది. ఇక, నికర ఎన్‌పీఏలు ఈ త్రైమాసికంలో 2.18 శాతం ఉండగా, గత ఆర్థిక సంవత్సరం ఇది 2.35 శాతంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ బ్యాంకు ద్రవ్యతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం లేదని ధనలక్ష్మీ బ్యాంక్ తెలిపింది.

Next Story

Most Viewed