శాపగ్రస్త ఆలయం.. అక్కడికి వెళ్ళారంటే బలి కావాల్సిందే..

by Disha Web Desk 20 |
శాపగ్రస్త ఆలయం.. అక్కడికి వెళ్ళారంటే బలి కావాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : భక్తులు తమ కోరికలు తీరాలని, సుఖసంతోషాలను పొందాలని దేవున్ని పూజిస్తారు. దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని భక్తులు గుడికి వెళతారు. అంతే కాదు భక్తులు తెలిసీ తెలియక ఏమైనా తప్పులు, పాపాలు చేసి ఉంటే అవి అన్నీ తొలగిపోవాలని దేవుడిని పూజిస్తారు.

భక్తులకు అంటిన పాపాలు పోగొట్టే ఆలయాన్ని మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ శాపగ్రస్త దేవాలయాన్ని ఎప్పుడైనా చూశారా. పోనీ ఆ ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి అలాంటి ఆలయాలు కూడా ఉంటాయా అనిపిస్తుంది కదా. కానీ అది నిజం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయాన్ని ఎందుకు శాపగ్రస్త దేవాలయంగా భావిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలయానికి శాపం..?

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ లో శాపగ్రస్త దుర్గామాత ఆలయం ఉంది. ఈ ఆలయానికి రావాలంటేనే ప్రజలు భయపడుతుంటారు. ఈ దుర్గాదేవి ఆలయానికి శాపం ఉందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ ఆలయంలో అకస్మాత్తుగా భయానక శబ్దాలు వినిపిస్తాయట. సింహగర్జనలు, గంటల శబ్దం వినిపిస్తుందని అక్కడి ప్రజలు చెబుతుంటారు. అలాగే సాయంకాలం వేళ ఆ ఆలయానికి ఎవరూ కూడా వెళ్లరట. ఒక వేళ ఎవరైనా వెళితే వారు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తారట. ఎవరైనా చెడు ఆలోచనలతో ఆలయానికి వచ్చినా, చెడు దృష్టితో వెళ్లినా అమ్మవారు శిక్షిస్తుందట. నవరాత్రులలో కూడా భక్తులు నేరుగా ఆలయం లోపలికి వెళ్లకుండా బయట నిలబడి తల వంచి దండాలు పెడతారట.

శాపగ్రస్త ఆలయ రహస్యం ?

మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న ఈ దుర్గామాత ఆలయం సంవత్సరాలుగా శాపంలో ఉందని అక్కడి భక్తులు చెబుతారు. దేవాస్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయిన వెంటనే రాజ కుటుంబంలో కొన్ని అనూహ్యకరమైన సంఘటనలు జరగడం ప్రారంభించాయి. మనుషుల మరణాల వార్తలు రావడం మొదలయ్యాయి. రాజ కుటుంబానికి చెందిన చాలా మందితో పాటు రాజు కుమార్తె మరణించింది.

రాజు కూతురు సేనాధిపతితో ప్రేమలో పడింది. కానీ రాజుకు మాత్రం వారి ప్రేమ వ్యవహారం నచ్చలేదు. ఆ ఇద్దరినీ విడదీసేందుకు రాజు తన సొంత కూతురినే జైల్లో పెట్టాడట. అయితే రాకుమారి ప్రేమికుడికి దూరం కావడాన్ని తట్టుకోలేక తాను జైల్లోనే మృతి చెందింది. ఆ విషయం తెలుసుకున్న రాజు దుఃఖంలో మునిగిపోయాడు.

ఇక యువరాణి మరణవార్త విన్న సేనాపతి దు:ఖంలో మునిగిపోయాడు. తాను కూడా తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా దుర్గామాత ఆలయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే పూజారి రాజుకు సమాచారం అందించాడు. ఆలయంలో సేనాపతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆలయం అపవిత్రం అయిందని భావించి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిలిపివేశారు. అప్పటి నుండి ఈ మా దుర్గా ఆలయం శాపగ్రస్త ఆలయంగా మారిపోయింది.

ఉజ్జయినికి తరలిన దుర్గామాత విగ్రహం..

ఈ సంఘటన తర్వాత దుర్గామాత విగ్రహాన్ని ఇక్కడి నుండి ఉజ్జయిని గణేష్ ఆలయానికి మార్చారు. దీంతో దేవాస్‌లో ఉన్న ఈ దుర్గాదేవి ఆలయానికి తాళం వేశారు. ఇప్పుడు ఇక్కడ దర్శనం కోసం భక్తులెవరూ వెళ్లరని, ఎవరైనా వచ్చినా బలి ఇవ్వాల్సిందేనని నమ్ముతారు. నేటికీ ఆలయం లోపల సేనాధిపతి ఆత్మ సంచరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Next Story