సమూలంగా మారుస్తున్నాం -డిప్యూటీ సీఎం 

by  |
సమూలంగా మారుస్తున్నాం -డిప్యూటీ సీఎం 
X

దిశ, ఏపీ బ్యూరో: పేదరికంతో విద్యకు దూరం కాకూడదనే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో పలు పథకాలకు శ్రీకారం చుట్టిందని ఉపముఖ్యమంత్రి ఎస్ బీ అంజాద్ బాషా తెలిపారు. గురువారం కడపలోని జయనగర్ కాలనీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ… విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిన సీఎం జగన్ విద్యార్థుల సంక్షేమం కోసం ఎన్నోరకాల పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పేద విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు ఏ మాత్రం భారం కాకూడదనే అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 2,63,717 మంది విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సామగ్రిని అందుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వాటి అనుబంధ వసతి గృహాలను అధునాతన వసతులతో సమూలంగా మారుస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంఇఓ నారాయణ, గ్రంధాలయ మాజీ డైరెక్టర్ హమీద్ బుఖారీ పాల్గొన్నారు.

Next Story

Most Viewed