సాత్విక్, ఉష లకు డిప్యూటీ సీఎం అభినందనలు

by  |
సాత్విక్, ఉష లకు డిప్యూటీ సీఎం అభినందనలు
X

దిశ, ఏపీ బ్యూరో: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయి సాత్విక్, బాక్సర్ నగిశెట్టి ఉష భారత ప్రభుత్వ అత్యున్నత క్రీడా పురస్కారాలకు ఎంపిక కావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఒక ప్రకటనలో సాత్విక్ అర్జున అవార్డుతోనూ, ఉష ధ్యాన్ చంద్ అవార్డుతో రాష్ట్ర కీర్తిని ఇనుమడింప చేసినట్లు పేర్కొన్నారు. వారి క్రీడా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు.

బ్యాట్మింటన్ క్రీడాకారునిగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన సాయి సాత్విక్ అర్జున అవార్డు సాధించడం ఎందరిలోనో స్ఫూర్తి నింపిందన్నారు. 2021టోక్యో ఒలింపిక్స్ లో పథకమే లక్ష్యంగా సాగుతున్న సాత్విక్ భారత కీర్తి పతాకను రెపరెపలాడించాలని ఆకాంక్షించారు. అలాగే విశాఖపట్టణం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బాక్సర్ నగిశెట్టి ఉష ద్యాన్ చంద్ అవార్డుకు ఎంపిక కావడం కూడా ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు.

ఉష వరల్డ్ చాంపియన్షిప్ లో రెండు కాంస్య పతకాలు గెలవడమే కాకుండా, 2008 ఆసియా గేమ్స్ లో బంగారు పతకాన్ని సాధించినట్లు గుర్తు చేశారు. ఆమె ప్రస్తుతం ఔత్సాహిక బాక్సర్ల కోసం విశాఖలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా బాక్సింగ్ శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నందుకు అభినందించారు. క్రీడాకారిణిగా రిటైరై క్రీడాభివృద్ధికి తోడ్పడే వారికి అందించే ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య అవార్డు తొలిసారి నవ్యాంధ్రప్రదేశ్ కు, ఉత్తరాంధ్రకు చెందిన ఉషాకు రావడం ఎంతో గర్వకారణమన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు అందజేస్తోందని కృష్ణదాస్ పేర్కొన్నారు.



Next Story