పాకీ పని కోసం కొత్త యంత్రం కనిపెట్టిన స్కూల్ పిల్లలు

by  |
news cleaner
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక యంత్రాలు అన్నిచోట్లా అందుబాటులో లేనందున.. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో మురుగునీటి కాల్వలను మాన్యువల్‌గా క్లీన్ చేయాల్సి వస్తోంది. దీని వల్ల పారిశుధ్య కార్మికులు ప్రమాదాల బారిన పడటంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థుల బృందం ‘సీవేజ్ స్క్వాడ్’ పేరుతో ఒక యంత్రాన్ని రూపొందించారు. లైట్ వెయిట్, తక్కువ ఖర్చు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ప్రొటోపైప్‌ను తయారుచేయగా.. ఇది మాన్యువల్‌ క్లీనింగ్‌ నుంచి విముక్తి కలిగిస్తుంది.

భారీగా పేరుకుపోయిన మురుగునీటి కణాలను చీల్చి, బురదను కత్తిరించే లోహ కట్టర్లతో పాటు కాలువల నుంచి బురదను బయటకు పీల్చేందుకు సక్షన్ పంపును కలిగి ఉండే ఈ మిషన్.. వాటర్ జెట్ మెకానిజంపై పనిచేస్తుంది. కాగా పదో తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు ‘అన్ష్ గుప్తా, అనవి కొఠారి, బహార్ ధింగ్రా, పాలక్ యాదవ్, సార్థక్ ఆచార్య’ ఈ ప్రొటోటైప్‌పై పనిచేశారు.

కాంపాక్ట్ అండ్ సింపుల్ డిజైన్

కాంపాక్ట్ అండ్ బేసిక్ డిజైన్‌లో రూపొందించిన ఈ మెషిన్‌ను.. ‘భారీ, ఇండస్ట్రియల్-గ్రేడ్ క్లీనింగ్ యంత్రాలు చేరుకోలేని ఇరుకైన సందుల్లోనూ ఉపయోగించవచ్చు. ఈ ఆవిష్కరణ ‘శివ్ నాడార్ స్కూల్‌’ వార్షిక టెక్ ఈవెంట్, కొలోక్వియమ్‌లో ప్రదర్శించబడింది. ఈ మెషిన్‌లోని ఇన్-బిల్ట్ ఆడియో సిస్టమ్.. వివిధ మెకానిజమ్స్ ఉపయోగించడంపై మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మరోవైపు కెమెరా, LED లైట్.. చిన్న LCD స్క్రీన్‌పై యూజర్‌కు టార్గెటెడ్ ఏరియా విజువల్స్‌ను చూపెడుతుందని మేకర్స్‌లో ఒకరైన ఆచార్య చెప్పాడు. ఈ ప్రొడక్ట్‌లోని గ్యాస్ డిటెక్షన్ సిస్టమ్, విషపూరిత వాయువుల స్థాయిని అంచనా వేసేందుకు సాయపడటంతో పాటు సరైన రక్షణను నిర్ధారిస్తుందని పేర్కొన్నాడు.

‘ఈ అమానవీయ పద్ధతిని నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో మా బృందం ఈ సమస్యను ఎంచుకుంది. ప్రస్తుతం ప్రోటోటైప్‌ను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ ఇంప్లిమెంటేషన్ తర్వాత సమీపంలోని మురుగు కాలువల్లో పరీక్షిస్తాం. ఈ క్రమంలో కొన్ని NGOల సహకారంతో పలువురు మాన్యువల్ స్కావెంజర్ల అభిప్రాయాన్ని తీసుకుంటాం’ అని విద్యార్థు్ల్లో ఒకరైన ధింగ్రా చెప్పారు. మాన్యువల్‌ స్కావెంజర్లు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా వినియోగించుకునే విధంగా ఈ యంత్రాలను రూపొందించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ప్రోటోటైప్ ధర ప్రస్తుతం రూ. 10,000-రూ. 11,000. అయితే, ఒక్కసారి ఇండస్ట్రియల్‌ గ్రేడ్‌గా రూపాంతరం చెందితే, ధర దాదాపు రూ.15,000-20,000 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.

కాగా అధికారిక రికార్డుల ప్రకారం, 2013 -17 మధ్య కాలంలో 2400 మందికి పైగా పారిశుధ్య కార్మికులు పదవీ విరమణకు ముందు మరణించారు. కానీ అధికారులు మాత్రం వారు పని ప్రదేశంలోని ప్రమాదాల వల్ల కాకుండా ఇతర కారణాలతో చనిపోయారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed