ఢిల్లీలో త్వరలో ప్లాస్మా బ్యాంక్: కేజ్రీవాల్

by  |
ఢిల్లీలో త్వరలో ప్లాస్మా బ్యాంక్: కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: దేశరాజధానిలో త్వరలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా డొనేట్ చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. విలేకరులతో మాట్లాడుతూ, రెండు మూడు రోజుల్లో ప్లాస్మా బ్యాంకు అందుబాటులోకి వస్తుందని ఆయన హామీనిచ్చారు. ఇప్పటికే 29 మంది పేషెంట్లపై ప్లాస్మా థెరపీ ట్రయల్స్ నిర్వహించామని, ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వివరించారు. అందుకే ఇతరుల ప్రాణాలు రక్షించే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా డొనేట్ చేయాలని అభ్యర్థించారు.

దక్షిణ ఢిల్లీ వసంత్ కుంజ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరి సైన్సెస్‌లో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నారని, ఇది డాక్టర్లకు, స్వీకర్తలకు అనుసంధానంగా పనిచేస్తుందని వివరించారు. ప్లాస్మా డొనేట్ చేయడం సులువుగా సాగిపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్లాస్మా డొనేషన్‌కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నెంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రక్రియల్లో ప్లాస్మా థెరపీ ఇప్పటికైతే మెరుగైన విధానమని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఢిల్లీలో ఈ ప్లాస్మా థెరపీ విరివిగా చేపట్టి ప్రాణాలను కాపాడే నిర్ణయాలను సర్కారు తీసుకుంటున్నది.



Next Story

Most Viewed