మెహుల్ చోక్సికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..

by  |
మెహుల్ చోక్సికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని పలు బ్యాంకులను మోసం విదేశాలకు చెక్కేసిన మెహుల్ చోక్సీ లాంటి వారి మీద ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ అనే డాక్యుమెంటరీ తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, దానిని విడుదలకు ముందే తమకు చూపించాలని (ప్రీ స్క్రీనింగ్) పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి ‘చోక్సీ’ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2న ఈ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయనుండగా, ప్రీ స్క్రీనింగ్‌తో పాటు.. విడుదల వాయిదా కోరుతూ చోక్సీ పిటిషన్ వేశారు. అయితే, ప్రివ్యూ అనుమతికి జస్టిస్ నవీన్ చావ్లా నిరాకరించారు.

ఓవర్-ది-టాప్ (OTT) మీడియా సర్వీసుకు చెందిన కంటెంట్‌ను అదుపు చేసేందుకు ఎలాంటి రెగ్యులేషన్స్ లేవని ఆయన పేర్కొన్నారు. దీనిపై తగిన ఫోరంను ఆశ్రయించడం, సివిల్ సూట్ వేయాలని సూచించారు. పలు స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, తదితర వాణిజ్య దిగ్గజాల ఉత్థాన పతనాల ఆధారంగా ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ రూపొందింది. నెట్‌ఫ్లిక్స్ తరఫున న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ తన వాదన వినిపిస్తూ.. OTTలోని విషయాలను ఎవరూ నియంత్రించలేరన్నారు.

దీనిని నీరవ్ మోదీపై డాక్యుమెంటరీ సిరీస్‌గా పేర్కొంటూ, ఆయన తన మేనమామతో కలిసి పనిచేయడం, రాయిటర్స్, బీబీసీ సహా న్యూస్‌ ఛానెల్స్‌కు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు చూపించారని, పబ్లిక్ డొమైన్‌లో ఇవి ఇప్పటికే ప్రసారమయ్యాయన్నారు. చోక్సీ కేసుల్లో పెండింగ్‌లో ఉన్న న్యాయ నిర్ణయాలతో డాక్యమెంటరీకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. చోక్సీ పరారీలో ఉన్నాడని, వేరే దేశం పౌరసత్వం కూడా తీసుకున్నాడని, ఆయన ఇక్కడకు రావడం కానీ, ఉపశమనం కోరడం కానీ జరగలేదని నెట్‌ఫ్లిక్స్ తరఫున హాజరైన మరో సీనియర్ అడ్వకేట్ దయన్ క్రిష్ణన్ వాదించారు.

దయన్ క్రిష్ణన్ వాదనపై చోక్సీ తరఫున హాజరైన న్యాయవాది విజయ్ అగర్వాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింట్ పరారీలో లేడని, ముంబై హైకోర్టులో ప్రొసీడింగ్స్‌పై స్టే ఉందని వివరించారు. ‘నేను కేవలం ప్రివ్యూ మాత్రమే అడిగాను. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ స్పందించక పోవడంతో కోర్టును ఆశ్రయించాను. ఇవాళ బ్యాడ్ బాయ్ బిలియనీర్స్‌తో కో వాళ్లు వచ్చారు. రేపు కోర్టులపై కూడా ఏదైనా తీయవచ్చు’ అని అగర్వాల్ వాదించారు. ఇలాంటి డాక్యుమెంటరీ వల్ల చోక్సీ కేసులో జరుగుతున్న విచారణను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయని, ఇది తన క్లయింట్‌కు ఉన్న హక్కులను హరించడమేనన్నారు.

కాగా, తాము ఆన్‌లైన్ వేదికను నియంత్రించడం, మానిటరింగ్ చేయడం చేయలేమని, ఇది కేవలం పిటిషనర్ (మెహుల్ చోక్సీ) కు, నెట్‌ఫ్లిక్స్‌కు మధ్య ఉన్న వ్యవహారమని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు వెల్లడించారు.

Next Story

Most Viewed