మంచంపై కుళ్లిన శవం.. ఇంట్లోనే కుటుంబీకులు!

by  |
మంచంపై కుళ్లిన శవం.. ఇంట్లోనే కుటుంబీకులు!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటున్నారు. అయితే, గత రెండ్రోజులుగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వెళ్లి చూద్దామంటే గేట్‌కు తాళం వేసి ఉంది. ఏం చేయాలో తెలియని స్థితిలో వారు బంధువులకు సమాచారమిచ్చారు. అందులో ఒకరు వచ్చిలోనికి వెళ్లి చూడగా మంచంపై కుళ్లిపోయిన శవం కనిపించింది. ఇంట్లోని కుటుంబ సభ్యులంతా వింతగా ప్రవర్తిస్తున్నారు. అనుమానం వచ్చిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యనగర్‌ కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. పోలాకి సత్యనారాయణ ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. ఆయనకు భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి ఇరుగుపొరుగు వారితో ఎలాంటి సంబంధం ఉండేది లేదు. పెద్ద కుటుంబం అయినా, బంధువులు ఎక్కువ మంది ఉన్నా, ఎవరూ రాకపోకలు చేసేవారు కాదు. వారి ఇంటి గేటుకు ఎల్లప్పుడూ తాళాలు వేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. నెలలో ఒకసారి, రెండు సార్లు మాత్రం సత్యనారాయణ పెన్షన్ డబ్బుల కోసం బయటకు వెళ్లి అవసరమైన సామన్లు తెచ్చేవాడని అంటున్నారు.

ఈ క్రమంలోనే సత్యనారాయణ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఆయన తమ్ముడి కొడుకు ఇంట్లోకి వెళ్లి చూశాడు. ఇంట్లో చనిపోయిన వ్యక్తి మంచంపై ఉందని గమనించి పోలీసులు, రెడ్‌క్రాస్ ప్రతినిధులకు సమాచారమిచ్చాడు. అక్కడకు వెళ్లిన పోలీసులు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అక్కడి పరిస్థితిని చూసి షాకయ్యారు. మంచంపై కుళ్లిపోయి ఈశ్వరమ్మ శవం ఉండగా, ఇళ్లంతా చెత్తతో నిండి ఉంది. ఇంట్లోని వారంతా మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించారు.

వివరాలు అడిగినా సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వారు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, సత్యనారాయణ ఇద్దరు పిల్లలు కూడా మతిస్థిమితం లేని వారు కావటంతో ఈశ్వరమ్మ ఎప్పుడు చనిపోయిందో కూడా తెలియని పరిస్థితి. అందువల్లే విషయాన్ని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సత్యనారాయణ కుటుంబాన్ని ఏదైనా మానసిక వికాస కేంద్రానికి తరలించాలని చుట్టుపక్కల వారు కోరారు.



Next Story