ఈ-కామర్స్ సంస్థలకు డెడ్‌లైన్!

by  |
ఈ-కామర్స్ సంస్థలకు డెడ్‌లైన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ సంస్థలను కంట్రోల్‌లో పెట్టడానికి కేంద్రం సరికొత్త నిబంధనలు తీసుకురానున్నది. ప్రస్తుత నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నది. అలాగే, దేశీయ కంపెనీలకు, విదేశీ కంపెనీలకు మధ్య బేధాలను తొలగిస్తూ అన్నింటికీ ఒకే విధానాన్ని అమలుచేయడానికి సంకల్పిస్తున్నట్టు తెలుస్తున్నది. వినియోగదారుల డేటా, స్టోరేజ్‌కి సంబంధించి పటిష్ట నిబంధనలను రూపొందిస్తున్నది. గతంలో వస్తువులు, సేవలను నేరుగా ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు, పంపిణీ చేసే వాటిని ఈ-కామర్స్ కంపెనీగా గుర్తించేవారు. తాజా సవరణల ప్రకారం, డిజిటల్ ప్రకటనలు, కంటెంట్ విక్రయాలను కూడా ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. వివిధ నమూనాలను కలిగిన కంపెనీలు, వాటికి సంబంధించిన కార్యకలాపాలు ఆధారంగా కొత్త నియమాలతో ఈ-కామర్స్ కంపెనీలుగా గుర్తించనుంది. కొన్ని కంపెనీలకు ఈ నియమాలు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఇదివరకే ఈ రంగంలో ఉన్న కంపెనీలకు ఊరటగానే ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ఆమోదం అనంతరం ఈ-కామర్స్ కొత్త చట్టం చేసే అవకాశాలున్నాయి. దీని కోసం కొత్త నియంత్రణ సంస్థ కూడా ఏర్పాటు కానుంది. ఇదివరకు డేటా స్థానికీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం, ఈ అంశానికి మరింత ప్రాధాన్యతనిచ్చే చర్యలను తీసుకోనుందని ఓ అధికారి చెప్పారు. అంతేకాకుండా, కొత్త డ్రాఫ్ట్ పాలసీ ప్రకారం.. ఈ-కామర్స్ కంపెనీలు ప్రభుత్వం కోరుకునే ఏ డేటానైనా 72 గంటలలోపు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. లేదంటే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల విదేశీ కంపెనీలకైనా, దేశీయ కంపెనీలకైనా ఒకేతరహా నిబంధనలను వర్తిస్తాయి. దేశ సమగ్రత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలకు కఠినతర నియమాలను కేంద్రం రూపొందించినట్టు ఆ అధికారి వివరించారు.

బడా కంపెనీలకు ఊరట..

కొత్త డ్రాఫ్ట్‌లో బిజినెస్ టూ కన్స్యూమర్ (బీ2సీ), బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ), ఈ-కామర్స్ మార్కెట్, ఇంటర్నెట్ ఆధారంగా వినియోగదారులు పొందే కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్-బేస్‌డ్ ఈ-కామర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఇలా ఏదైనా కొత్త విధానాల పరిధిలోకి రానున్నాయి. అలాగే, ఈ-కామర్స్ రంగంలోని పలు సంస్థలకు సంబంధించిన కార్యకలాపాల ఆధారంగా ఆయా సంస్థల సమాచారాన్ని ఎక్కడ భద్రపరచాలనే విషయాన్ని ప్రభుత్వమే నిర్ణయించనుంది. గతంలో డేటాను భారత్‌లోనే భద్రపరచాలన్న నిబంధనలను సడలించి, డేటా ఎక్కడ స్టోర్ చేసినా అడిగిన వెంటనే సమర్పించే నిబంధనలను రూపొందించింది. ఓ రకంగా ఇది పెద్ద కంపెనీలకు కలిసొచ్చే విషయమే. కేంద్రం రూపొందించనున్న ఈ కొత్త ఈ-కామర్స్ విధానంలోని నియమావళి విదేశీ కంపెనీలైన అమెజాన్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకు మేలు కలుగుతుంది. ఇదివరకు ఈ కంపెనీలు డేటాను భారత్‌లోనే భద్రపరచాలన్న నిబంధనలతో ఇక్కడే డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు తాజా నిబంధనలతో ఎక్కడైనా డేటా సెంటర్లను ఏర్పాటు చేసుకుని, కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే సమర్పించేలా ఉపశమనం పెద్ద కంపెనీలకు కలుగుతోంది. అయితే, సున్నితమైన, దేశ భద్రతకు సంబంధించిన సమాచారం, ప్రజల రికార్డులు, డిఫెన్స్‌కు సంబంధించిన సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత అథారిటీ అనుమతి లేనిదే విదేశాల్లో స్టోర్ చేయడానికి వీల్లేదు.

ఈ-కామర్స్ సంస్థల ఎగుమతులకు దన్ను

ప్రత్యేకమైన ఈ-కామర్స్ ఎగుమతుల ప్రమోషన్ సెల్స్ ద్వారా ఈ-కామర్స్ ఎగుమతి జోన్‌లు, నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలతో సహా సర్టిఫికేషన్, టెస్టింగ్ ల్యాబ్స్, అంతర్గత కస్టమ్స్ క్లియరెన్స్ చర్యలు తీసుకుని ఎగుమతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎగుమతి ప్రోత్సహకాలు, వస్తు, సేవల పన్ను, ఆదాయ పన్ను ప్రోత్సహకాలు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్‌లతో ఎగుమతులను మెరుగుపరచాలనే సిఫార్సులు కేంద్రం వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భారత హస్తకళల ఎగుమతులను ప్రారంభించేందుకు పలు ఈ-కామర్స్ కంపెనీలతో సంస్థాగత సంబంధాలను కలిగి ఉండేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని డీపీఐఐటీ తెలిపింది.



Next Story

Most Viewed