దాల్ సరస్సులో.. బోట్ అంబులెన్స్ సేవలు

by  |
దాల్ సరస్సులో.. బోట్ అంబులెన్స్ సేవలు
X

దిశ, ఫీచర్స్ : దేశంలో ఎంతోమంది కొవిడ్ బాధితుల సహాయనిధికి తోచిన విరాళాలు అందిస్తూ.. ఆపత్కర పరిస్థితుల్లో మానవత్వాన్ని చాటుతున్నారు. పెద్ద మనస్సుతో బాధితుల ఆకలి తీరుస్తున్నారు. ఇంకొంతమంది ఆక్సిజన్ సిలిండర్లు, మందులు ఉచితంగా అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కశ్మీర్‌కు చెందిన తారిక్ అహ్మద్ పట్లూ అనే యువకుడు తన పడవను అంబులెన్స్‌గా మార్చి దాల్ సరస్సులో సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు.

కరోనా విపత్కాలంలో సహృదయత, మానవత్వం పరిమళిస్తుంటే, మరోవైపు కరోనా బాధితుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్న సంఘటనలు బాధపెడుతున్నాయి. ఊళ్లోకి, ఇంట్లోకి రానివ్వకుండా చేస్తున్న ఘటనలు తరుచూ కనిపిస్తూనే ఉన్నాయి. తారిక్ అహ్మద్‌కు కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది. తారిక్ ఇటీవలే కరోనా బారిన పడగా.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొవిడ్ జయించాక కూడా ఆస్పత్రి నుంచి ఇంటికి వద్దామనుకున్న ఎవరూ పడవలోకి ఎక్కనివ్వలేదు. తారిక్ కూడా పడవ నడిపేవాడే.. అయినా పడవ ఎక్కించుకోవడానికి భయపడేవాళ్లు. ఆ సంఘటనతో ఎంతో బాధ పడ్డ తారిక్.. తనలా మరొకరు కన్నీళ్లు పెట్టుకోవద్దనే ఆలోచనతో తనకున్న పడవను అంబులెన్సుగా మార్చి సేవలందిస్తున్నాడు. కరోనా రోగులను తన పడవలో తీసుకెళ్తుండటంతో పాటు ఏదైనా సాయం కావాలనుకుంటే తనకు ఫోన్ చేయమని వారికి అండగా నిలుస్తున్నాడు. ఈ పడవలో పీపీఈ కిట్స్, స్ట్రెచర్స్‌, వీల్ చైర్ కూడా అందుబాటులో ఉంచాడు. ఇప్పటివరకు జమ్మూకశ్మీర్‌లో 2.29 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 1.75 లక్షల మంది కోలుకున్నారు. 2,912 మంది మరణించారని లెక్కలు చెబుతున్నాయి.

‘ఈ అంబులెన్స్‌లో సైరన్, స్పీకర్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. మాస్క్‌లు ధరించాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి. కొవిడ్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో వీటిని ఉపయోగిస్తున్నాను. పెరుగుతున్న కేసుల కారణంగా ప్రజల కోసం ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశాను. సహాయం కోసం నాకు అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి. వారి అవసరానికి తగిన విధంగా సరైన సహాయం అందించాను. ప్రస్తుతం అంబులెన్స్ ప్రధాన పరికరాలతో నిండి ఉంది. ప్రథమ చికిత్స, స్ట్రెచర్, వీల్‌చైర్, బిపి సెట్ ఉన్నాయి. ఈ అంబులెన్స్‌ను ప్రజలకు స్నేహపూర్వకంగా మార్చడానికి నా వంతు ప్రయత్నం చేశాను. రెండు, మూడు రోజుల పాటు ఆక్సిజన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సరైన చికిత్స అందించే విధంగా ఇందులో ఓ డాక్టర్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి నేను అభ్యర్థిస్తున్నాను’.
– తారిక్ అహ్మద్

ఈ ప్రాంతంలో వైద్య సేవల అవసరాన్ని తీర్చడానికి ఇలాంటి అంబులెన్సులు అవసరమని నివాసితులు భావిస్తున్నారు. తారిక్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని.. 10-15 సంవత్సరాల క్రితం నుంచి ఇలాంటి అంబులెన్స్ ఉంటే బాగుండేదని.. ఇతర సరస్సులలో కూడా ఇలాంటి సేవలు అవసరమని స్థానికులు అభిప్రాయపడ్డారు.


Next Story

Most Viewed