క్రిప్టో కరెన్సీ కాపాడుకోవడమెలా? పెట్టుబడి సురక్షితమేనా?

by  |
క్రిప్టో కరెన్సీ కాపాడుకోవడమెలా? పెట్టుబడి సురక్షితమేనా?
X

దిశ, ఫీచర్స్: 2009లో ప్రపంచ విపణిలోకి అడుగుపెట్టిన క్రిప్టోకరెన్సీ వాల్యూ వన్ డాలర్ కావడానికి రెండేళ్లు పట్టింది. కానీ, ప్రస్తుతం దాని విలువ దాదాపు 48వేల డాలర్లకు పైగా ఉంది. ఈ నేపథ్యంలో బిలియనీర్ ఎలన్ మస్క్ నుంచి బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ వరకు ఎంతోమంది బిజినెస్ టైకూన్స్, సెలబ్రిటీలు క్రిప్టో స్పేస్‌లో చేరారు. దీంతో క్రిప్టోకరెన్సీ చుట్టూ హైప్ పెరుగుతుండటంతో పాటు ఈ డిజిటల్ నాణేల ధరలు కూడా పెరుగుతున్నాయి. క్రిప్టో నాణేలు అధిక రాబడులను ఇస్తున్నప్పటికి అవి సైబర్ దాడులకు గురవుతున్నాయి. డిజిటల్ మనీని దొంగిలించడానికి సైబర్ నేరగాళ్లు బిట్‌కాయిన్ చుట్టూ ఉన్న వ్యామోహాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు క్లౌడ్-ఎనేబుల్డ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ బార్రాకుడా పరిశోధనను వెల్లడించింది. US ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ప్రకారం అక్టోబర్ 2020 – మార్చి 2021 మధ్య క్రిప్టో స్కామ్‌ల్లో కనీసం 7,000 మంది $ 80 మిలియన్లకు పైగా కోల్పోయారని తెలిపింది. మరి డిజిటల్ కరెన్సీని ఎలా కాపాడుకోవాలి? మోసగాళ్ల వలలో చిక్కకుండా ఉండటమెలా? వంటి విషయాలు తెలుసుకుందాం.

బ్లాక్‌చెయిన్ హ్యాకర్లు క్రిప్టో హోల్డర్లను మాత్రమే కాకుండా క్రిప్టో ఎక్స్ఛేంజీలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అట్లాస్ వీపీఎన్ ఇటీవలే వెల్లడించింది. 2020లో 122 దాడుల్లో $ 3.78 బిలియన్ విలువైన డిజిటల్ ఆస్తులు దొంగలపాలైనట్లు వారి అధ్యయనం పేర్కొంది. టోకెన్-స్వాపింగ్ ప్లాట్‌ఫామ్ పాలీ నెట్‌వర్క్ నుంచి $ 613 మిలియన్ డిజిటల్ నాణేల(రూ. 4,537 కోట్లు)ను దొంగిలించగా ఇటీవల జరిగిన అతిపెద్ద క్రిప్టోకరెన్సీ దొంగతనాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

నిబంధనలు లేకపోవడంతో..

బిట్‌కాయిన్ క్రేజ్ రోజురోజుకు మెరుగవడంతో క్రిప్టోకరెన్సీల విలువ అక్టోబర్ 2020 – ఏప్రిల్ 2021 మధ్య దాదాపు 400 శాతానికిపైగా పెరిగింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 2020 – మే 2021 మధ్యకాలంలో దాదాపు 192 శాతం ఈమెయిల్ కాంప్రమైజ్ అటాక్స్ పెరగడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ కరెన్సీని ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు నియంత్రించగా, క్రిప్టో కరెన్సీ విషయంలో అలా జరగదు. దాని నియంత్రణ పూర్తిగా కొనుగోలు, అమ్మకాలు జరిపేవారి చేతుల్లోనే ఉంటుంది. చాలా దేశాల్లో ప్రభుత్వాలు దీనిని చట్ట విరుద్ధమని భావించి, నియంత్రించాలని ప్రయత్నించడానికి కారణం అదే. ఇక ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణతో సంబంధం లేకుండా క్రిప్టోకరెన్సీని డిజైన్ చేయడంవల్ల ఈ డిజిటల్ కరెన్సీని దోపిడి చేసేందుకు సైబర్ నేరగాళ్లకు సురక్షితమైన ఎంపికగా మారింది. ఈ మేరకు బిట్‌కాయిన్ కొనుగోలు చేసి నకిలీ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వడానికి లేదా క్రిప్టోకరెన్సీని ఉపయోగించి నకిలీ విక్రేత ఇన్‌వాయిస్‌ని చెల్లించడానికి నకిలీ ఈ-మెయిల్‌లను పంపిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.

క్రిప్టో వాలెట్‌లు సురక్షితమేనా?

క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. ‘పేటీఎం’, ‘గూగుల్ పే’ లాగానే ఇది కూడా ఓ వాలెట్. దీన్ని బ్లాక్‌‌చైన్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేయగా ఇది ఏ దేశానికీ చెందినది కాదు. క్రిప్టోకరెన్సీలపై ఎవరి నియంత్రణ ఉండదు. ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ. బిట్‌కాయిన్, ఈథెరియం, టీథర్, కార్డానో, పోల్కాడాట్, రిపల్, డాగ్‌కాయిన్ వంటి డిజిటల్ కరెన్సీలను వాలెట్‌లో భద్రపరుస్తారు. క్రిప్టో వాలెట్ అంటే డిజిటల్ కాయిన్లకు ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్ మాదిరి అని చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రైవేట్ కీలను స్టోర్ చేస్తుంది. దీని ద్వారా క్రిప్టో కాయిన్లు పంపొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. దీనికోసం అదనపు ఫీజు చెల్లించాల్సిన పని లేదు. చాలావరకు ఎక్స్చేంజీలే వాలెట్ సేవలు కూడా అందిస్తుంటాయి. అందువల్ల ఎక్స్చేంజీలకే ఈ చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీటిని ‘ప్రైవేట్ కీ’ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయవచ్చు. సూపర్ సెక్యూర్డ్ పాస్‌వర్డ్‌కి సమానమైన క్రిప్టో లేకుండా క్రిప్టో యజమాని కరెన్సీని యాక్సెస్ చేయలేరు. అయితే ఈ వాలెట్‌లోనూ రకాలున్నాయి.

మొబైల్ క్రిప్టో వాలెట్..

క్రిప్టోకరెన్సీలో చురుకుగా వ్యాపారం చేసే వారికి మొబైల్ క్రిప్టో వాలెట్ ఒక ముఖ్యమైన సాధనం. ఇది మన స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది ప్రైవేట్ కీలను స్టోర్ చేస్తూ ట్రేడ్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

వెబ్ వాలెట్..

ఈ-వాలెట్లు లేదా వెబ్ వాలెట్‌లు ప్రైవేట్ కీలను సర్వర్‌లో స్టోర్ చేస్తాయి. ఇవి థర్డ్ పార్టీ ద్వారా నియంత్రించబడతాయి. వెబ్‌సైట్‌ను నడుపుతున్న సంస్థల ద్వారా మీ ప్రైవేట్ కీలకు యాక్సెస్ పొందవచ్చు. తద్వారా మీ నిధులపై పూర్తి నియంత్రణ లభిస్తుంది. సాధారణంగా ఇవి తక్కువ సురక్షితమైనవి.

డెస్క్‌టాప్ వాలెట్..

డెస్క్‌టాప్ వాలెట్‌లు కంప్యూటర్‌లో ప్రైవేట్ కీలను మీ హార్డ్ డ్రైవ్ లేదా SSD‌లో స్టోర్ చేస్తాయి. వెబ్, మొబైల్ వాలెట్‌ల కంటే ఇవి మరింత సురక్షితం. ఎందుకంటే అవి తమ డేటా కోసం థర్డ్ పార్టీలపై ఆధారపడవు. దొంగిలించడం కాస్త కష్టం.

పేపర్ వాలెట్..

పేపర్ వాలెట్ లేదా ఆఫ్‌లైన్ వాలెట్ అనేది ప్రైవేట్ కీలు, క్యూఆర్ కోడ్‌లను కలిగి ఉన్న ఒక ప్రింటెడ్ పీస్ ఆఫ్ పేపర్. ఇది క్రిప్టోకరెన్సీ లావాదేవీలను సులభతరం చేయడానికి ఉపయోగించబడుతుంది. అవి ఇంటర్నెట్‌తో సంబంధం లేకపోవడంతో, అత్యంత సురక్షితమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

హార్డ్‌వేర్ వాలెట్..

ఇది ప్రైవేట్ కీలను సురక్షితమైన ఫిజకల్ డివైజ్‌లో నిల్వ చేస్తుంది. ఇది క్రిప్టోకరెన్సీని రక్షించడానికి ఉత్తమమైన మార్గాల్లో ఒకటి. అంతేకాకుండా వైరస్‌ల దాడిని తట్టుకోగలవు. హ్యాకర్లు నాణేలను దొంగిలించడం వాస్తవంగా అసాధ్యమని చెప్పుకోవచ్చు.

కరెన్సీ ఎలా పోతోంది?

పోయిన క్రిప్టో నాణేలను తిరిగి పొందలేమన్నది ముఖ్యమైన విషయం. ఏదైనా క్రిప్టోకరెన్సీని ఒక వాలెట్ నుంచి మరొక వాలెట్‌కు పంపినప్పుడు గ్రహీత చిరునామాను నమోదు చేయమని యూజర్ అడుగుతాడు. అయితే డిజిటల్ ఆస్తిని తప్పు చిరునామాకు పంపినట్లయితే, ఈ లావాదేవీలను రద్దు చేయడానికి మార్గం లేదు. అంతేకాదు వాలెట్‌కు తప్పు పాస్‌వర్డ్‌ని ఇన్‌పుట్ చేస్తే, క్రిప్టోకరెన్సీలు కోల్పోయే అవకాశముంది. ఇలా ఎంతోమంది తప్పుడు క్రిప్టో పాస్ ‌వర్డ్ కారణంగా కోట్లాది రూపాయలు పొగోట్టుకున్నారు.

వినియోగదారుడి ప్రైవేట్ కీ దొంగతనానికి గురైతే బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లో దొంగను గుర్తించడానికి లేదా దొంగిలించబడిన క్రిప్టో ఆస్తుల తదుపరి లావాదేవీలను నిరోధించడానికి ఎలాంటి నిబంధనలు లేవు. ఇక క్రిప్టోకరెన్సీ అనేది భారతదేశంలో, మరెన్నో దేశాల్లో చట్టబద్ధత లేకపోవడం మరో కారణం.

పెట్టుబడి సురక్షితమేనా?

వాలెట్‌ల భద్రత వినియోగదారుడు వాటిని ఎలా నిర్వహిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. క్రిప్టోకరెన్సీ సెక్యూరిటీలో అతిపెద్ద ప్రమాదం ప్రైవేట్ కీని కోల్పోవడం అయితే ఆన్‌లైన్ వాలెట్‌లు సెటప్ చేయడానికి, ఉపయోగించడానికి సులభంగా ఉన్నా సైబర్ దాడులకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువే. అందువల్ల క్రిప్టోకరెన్సీని భద్రపరచడానికి ఆన్‌లైన్ బదులుగా ఆఫ్‌లైన్ వాలెట్‌ని వాడటమే ఉత్తమం.

ఈ క్రిప్టో కరెన్సీని ట్రాక్ చేయడానికి ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల దగ్గర ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వ్యక్తిగత జాగ్రత్తే కీలకం.


Next Story

Most Viewed