స్పష్టత లేని సర్వే..!

by  |
స్పష్టత లేని సర్వే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పురపాలికల్లో జరుగుతున్న సర్వేలో అన్నీ అనుమానాలే. జరుగుతున్న సర్వే ఆస్తుల సేకరణకా, ప్లాట్ల వివరాలు తెలుసుకోవడానికా.. లేదంటే ఇళ్ల వివరాల కోసమా అనే విషయమై స్పష్టత లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. సిబ్బంది చేసే పొరపాట్లకు జవాబుదారీ ఎవరు, వివరాలు తప్పుగా నమోదు చేస్తే బాధ్యత ఎవరిదనే విషయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నమోదులో పొరపాట్లు జరిగి వివాదానికి దారితీస్తే ఎవరు పూచీ అని ఆవేదన చెందుతున్నారు.

కాగా, నగర పాలక సంస్థ సిబ్బంది ధరణి పోర్టల్ చెక్ లిస్టు అని, ధరణి పోర్టల్ బేసిక్ ఇన్ఫర్మేషన్​ పత్రాలని కొన్నింటిని నగరవాసులకు అందజేస్తున్నారు. సదరు పత్రాలను కొందరు నింపి ఇస్తుండగా, మరికొందరు ఫోన్ల ద్వారానే వివరాలు చెబుతున్నారు. ఇలా ప్రజలు నింపి ఇచ్చిన దరఖాస్తు పత్రాలు, లేదా ఫోన్లలో చెప్పిన వివరాలు వాస్తవమేనా అనే విషయాన్ని జీహెచ్​ఎంసీ సిబ్బంది పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. సిబ్బంది లక్ష్యం పూర్తి చేయడమే పనిగా వెళ్తున్నారే తప్ప ప్రామాణికతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలూ వినవస్తున్నాయి.

ప్రమాణికత లేదు..

ప్రతి ఇంటి యజమానికి డాక్యుమెంట్ ఉన్నా నెంబర్ రాసుకోవడం లేదు, ఇంటికి నిర్మాణ అనుమతి ఉన్నా, ప్రొసీడింగ్స్ నెంబర్‌ ఎంటర్​ చేయడం లేదు. భవనం ఎన్ని అంతస్తులు, అనుమతి ఏ మేరకు ఉంది వంటి వివరాలు సేకరించడం లేదు. ఇంటి ప్లాటు విస్తీర్ణం తీసుకుంటున్నా, సర్వే నెంబర్ ను సేకరించడం లేదు. భూమి ఏ తరహాదో కూడా సిబ్బంది గ్రహించేందుకు ప్రమాణాలు లేవు. అలాగే, ఇంటి నెంబర్​ లేని వాటిని నమోదు చేయడానికి ప్రత్యేక కాలమ్​ కూడా లేదు. ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిన వివరాలు కూడా సిబ్బంది సరిగా ఎంటర్​ చేయకుండా నామమాత్రంగా పని ముగించేస్తున్నారె విమర్శలున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో సమస్యలు వచ్చేవిగా ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అన్నీ సందేహాలే..

జీహెచ్​ఎంసీ మంజూరు చేసే జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలోనే పొరపాట్లు ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వ విభాగాలు, పురపాలిక సమాచారం సేకరణలో పొరపాట్లు, అక్షర దోషాలు, నెంబర్ల తారుమారు జరుగుతుంటాయి. ఆధారు కార్డు నెంబర్‌ నమోదులో ఒక్క నెంబర్ అటుఇటుగా రాసినా సమాచారమంతా అస్తవ్యస్తంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పకడ్బందీగా వ్యవహరించాల్సిన సున్నితమైన ఈ విషయ సేకరణలో సిబ్బంది ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించిన మొదటికే మోసం వస్తుందని పేర్కొంటున్నారు. ఈ దఫా సిబ్బంది చేసిన వివరాల నమోదు చివరిదైతే ఏదైనా తప్పుడు సమాచారం సేకరణ జరిగితే పరిస్థితి ఏంటని, ప్రజల్లో నెలకొన్న అనిశ్చితిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటున్నారు.



Next Story

Most Viewed